కరోనా శాపం.. మరో 2 లక్షల ఉద్యోగాలు ఆవిరి!
కరోనా మహమ్మారి తలెత్తిన విపత్కర పరిస్థితులు ఆటోమొబైల్ రంగ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. మరో నెలలో వాహన రంగంలో డిమాండ్ పుంజుకోకపోతే డీలర్‌షిప్‌లలో భారీగా ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని ఆటోమొబైల్స్ డీలర్స్ సమాఖ్య (ఫాడా) స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో ఆటోమొబైల్ రంగంలో ఉద్యోగాలకు ఎసరు వచ్చింది. ప్రత్యేకించి వాహన డీలర్‌షిప్‌లలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడినట్లు ఆటోమొబైల్ డీలర్స్ సమాఖ్య (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. రెండు లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత ఏడాది మందగమనం వల్ల ఎదురైన సంక్షోభంతో పోలిస్తే, కరోనా ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ‘ఫాడా’ అంచనా వేసింది. 2019లో మందగమనం కారణంగా డీలర్‌షిప్‌లలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేసింది. ఈ విషయంపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమని 'ఫాడా' పేర్కొంది.
also read లాక్‌డౌన్ ఎఫెక్ట్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ పొదుపు: 12 రీజనల్ ఆఫీసుల మూత
ఈ నెలాఖరు వరకు డీలర్లు.. అవుట్లెట్లు, మానవ వనరులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సర్వే ద్వారా తెలుసుకుని ఒక అవగాహనకు వస్తామని ఫాడా తెలిపింది. మరో నెల వరకు డిమాండ్ పుంజుకోకపోతే మాత్రం.. ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని ఫాడా అధ్యక్షుడు ఆశిశ్ హర్షరాజ్ కాలే అభిప్రాయపడ్డారు.
జూన్ నెలాఖరు తర్వాత డీలర్ షిప్‌ల తగ్గింపు, ఉద్యోగాల కోత వంటి అంశాలపై డీలర్ల సంఘం సభ్యులు నిర్ణయిస్తారని ఫాడా తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలులో ఉందని, దీంతో గిరాకీ పరిస్థితులను అంచనా వేయలేమని ఆశిశ్ హర్షరాజ్ కాలే పేర్కొన్నారు. ఆటోమొబైల్ డీలర్లు మనుగడ సాగించడానికి ఉద్యోగుల తగ్గింపు చివరి అవకాశం అని చెప్పారు.