Asianet News TeluguAsianet News Telugu

సాహసోపేతం.. చరిత్రాత్మకం:ఈవీలపై జీఎస్టీ తగ్గింపుపై ఆటో ఇండస్ట్రీ

విద్యుత్ వాహనాలు, వాహనాల చార్జర్లపై జీఎస్టీని 12 నుంచి ఐదు శాతానికి తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతిన అమలు చేసేందుకు వీలు కల్పించిందని పేర్కొంది.

Industry body welcomes GST rate cut on Electric Vehicles, charging stations
Author
New Delhi, First Published Jul 28, 2019, 11:20 AM IST

విద్యుత్‌ వాహనాలు, వాటి ఛార్జర్లపై జీఎస్టీని తగ్గించాలని కేంద్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆటోమొబైల్ పరిశ్రమ స్వాగతించింది. ఇది ఓ సాహసోపేత నిర్ణయం అని అభివర్ణించింది. విద్యుత్‌ వాహన తయరీదార్ల సంఘం (ఎస్‌ఎమ్‌ఈవీ) కూడా ఈ నిర్ణయాన్ని ప్రశంసించింది. 

విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేందుకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 

విద్యుత్‌ వాహనాల ఛార్జర్లకు కూడా జీఎస్టీని ప్రస్తుతమున్న 18 శాతం నుంచి 5 శాతానికి పరిమితం చేసేందుకూ కేంద్రానికి జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసింది. ఈ నిర్ణయంపై వాహన పరిశ్రమకు చెందిన కొందరు స్పందిస్తూ కేంద్రం తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 

హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఎండీ కం సీఈఓ ఎస్ఎస్ కిమ్ స్పందిస్తూ ‘ఇదో ఓ చరిత్రాత్మక నిర్ణయం. దీనిని మేం స్వాగతిస్తున్నాం. పర్యావరణ హిత వాహన విధానాన్ని త్వరితగతంగా అంది పుచ్చుకునేందుకు ఇది ఓ ప్రోత్సాహక చర్యగా ఉపయోగపడుతుంది.

ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీని వల్ల భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల కొనుగోలు విషయంలో కొనుగోలుదార్ల నమ్మకం బలపడుతుంది’ అని పేర్కొన్నారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎండీ పవన్‌ గోయెంకా స్పందిస్తూ ‘విద్యుత్‌ వాహనాల ప్రోత్సాహం దిశగా భారత ప్రభుత్వం తీసుకున్న మరో సాహసోపేత నిర్ణయం. త్రిచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాల విషయంలో నిర్వహణ ఖర్చులు పోగా తగినంత ఆదాయం వస్తుందా అనే సందేహాలు తొలగి సానుకూల దృక్పథం ఏర్పడేందుకు జీఎస్‌టీ రేట్ల కోత తోడ్పడుతుంది’ అని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios