హ్యుండాయ్ రూ.2000 కోట్ల పెట్టుబడి.. రూ.10 లక్షల కారు తయారీ టార్గెట్
రానున్నది విద్యుత్ వాహనాల శకం. ముడి చమురు దిగుమతితో హారతి కర్పూరంలా హరించుకుపోతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు కేంద్రం కూడా విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించిన నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ మున్ముందు పోటీలో దూసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇటీవల విద్యుత్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘కోన’ విడుదలతో భారత వాహన రంగంలో నవ శకానికి నాంది పలికిన దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.
భారత్‌లో రూ.10లక్షలకే విద్యుత్ కారును అందుబాటులోకి తెచ్చేందుకు యత్నాలు ప్రారంభించింది. ఈ కారు అభివృద్ధి కోసం రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా మున్ముందు విద్యుత్ వెహికల్స్ తయారీలో వివిధ సంస్థల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచి హ్యుండాయ్ సిద్ధమవుతోంది.
చెన్నైలోని హ్యుండాయ్ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేయనున్నారు. ఇది చిన్నసైజు ఎస్‌యూవీ తలపించవచ్చని సమాచారం. ఈ కారును మధ్య ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, అరబ్ దేశాలకు ఎగుమతి చేయాలని హ్యుండాయ్ ప్రణాళికలు తయారు చేస్తోంది.
ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో హ్యుండాయ్ ఆ దిశగా వేగంగా పనిచేస్తోంది. ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్లాంట్‌ను భారత్‌లో ప్రారంభించాలని కూడా హ్యుండాయ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే సుజుకీ, టొయోటా సంయుక్తంగా బ్యాటరీ తయారీ ప్రాజెక్టును చేపట్టాయి. హ్యుండాయ్ కూడా ఒక భాగస్వామితో కలిసి ఇటువంటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుందని సంస్థ ఇండియా ఎండీ కిమ్ తెలిపారు.
‘మేం భారత్ కోసం పూర్తిగా కొత్త ఉత్పత్తిని కనుగొనడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. దీని బాడీ స్టైల్స్ విప్లవాత్మకంగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ఎల్ జీ, శామ్ సంగ్, ఎస్డీఐ, ఎస్కే ఇన్నోవేషన్స్ వంటి దక్షిణ కొరియా సంస్థలతోపాటు కొన్ని చైనా సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కలిగి ఉన్నట్లు తెలిపారు.
భారత్ పరిస్థితులకు అనుగుణమైన డిఫరెంట్ కారును మార్కెట్లోకి తేనున్నట్లు హ్యుండాయ్ ఎండీ ఎస్ ఎస్ కిమ్ చెప్పారు. ఇటీవల విపణిలోకి విడుదల చేసిన ‘కొన’ విద్యుత్ కారు ధర రూ.25 లక్షల పైమాటే.
దీన్ని కొనేందుకు పెద్దగా ముందుకు రాకపోవచ్చు. ఈ నేపథ్యంలోనే అత్యంత చౌకగా, విస్త్రుత వర్గాల్లోకి ‘కొనా’ వంటి విద్యుత్ కార్లను తీసుకెళ్లాలని హ్యుండాయ్ నిర్ణయించింది. సాధారణ కస్టమర్లకు ఆమోదయోగ్యమైన ధరను నిర్ణయించడంతోపాటు దూకుడుగా ముందుకెళ్తామని హ్యుండాయ్ ఎండీ ఎస్ఎస్ కిమ్ తెలిపారు.
నూతన కారు ఉత్పత్తి కోసం 200 మిలియన్ల డాలర్లతోపాటు నూతన సఫ్లయి చైన్ డెవలప్ చేసేందుకు మొత్తం 300 మిలియన్ల డాలర్లు (రూ.2000 కోట్లు) ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.