ఆన్‌లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ల వర్షం.. హ్యుండాయ్ &టాటా కార్లపై భారీ ఆఫర్లు
కరోనా మహమ్మారి విజ్రుంభిస్తున్న వేళ కార్ల తయారీ సంస్థలు ఆన్ లైన్ విక్రయాలకు తెర తీశాయి. ఇందుకోసం హ్యుండాయ్, టాటా మోటార్స్ సంస్థలు వినియోగదారులకు భారీ ఆఫర్లు అందజేస్తున్నాయి.
ముంబై : కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ వల్ల హ్యుండాయ్, టాటా కార్ల ఆన్‌లైన్ అమ్మకాలపై డిస్కౌంట్ల వర్షం కురుస్తోంది. దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో హ్యుండాయ్ మోటార్స్, టాటా మోటార్స్ తమ కార్ల ఆన్‌లైన్ అమ్మకాలపై ఆయా కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించాయి.
టాటా మోటార్స్ కొద్ది రోజుల క్రితం ‘క్లిక్ టు డ్రైవ్’ డిజిటల్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. లాక్డౌన్ మధ్య టాటా కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకమైన ఆఫర్ల ప్రచారం మొదలు పెట్టింది.
టాటా మోటార్స్ సంస్థకు చెందిన టాటా హారియర్ బీఎస్-6 ప్రమాణాలతో గత నెలలో భారతదేశంలో ఆవిష్కరించింది. ఇప్పుడు టాటా హారియర్ కొనాలని చూస్తున్న ఎవరైనా టాటా ‘క్లిక్ టు డ్రైవ్’ ప్లాట్‌ఫామ్ ఉపయోగించి రూ. 30వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.
టాటా టైగర్‌పై రూ. 25 వేల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్‌ను టాటా ‘క్లిక్ టు డ్రైవ్’ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆన్‌లైన్‌లో రూ. 20 వేల వరకు తగ్గింపు ఇస్తున్నట్లు టాటామోటార్స్ ప్రకటించింది.
టాటామోటార్స్ మాదిరిగాగే హ్యుండాయ్ మోటార్స్ కూడా ‘క్లిక్ టు బై’ ఫ్లాట్ ఫాం ద్వార కార్లను ఆన్ లైన్‌లో విక్రయిస్తోంది. హ్యుండాయ్ సాంట్రో కారును రూ.40వేల డిస్కౌంటుతో హ్యుండాయ్ విక్రయిస్తోంది. గ్రాండ్ ఐ 10 కారుపై రూ.45వేలు, ఎలైట్ ఐ20 కారుపై రూ.35వేలు తగ్గింపు ఆఫర్ ప్రకటించింది.
మరోవైపు దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు 20 శాతం పెరిగి 1.56 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో 1.30 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయినట్టు సొసైటీ ఆఫ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తోంది.
స్థానికంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న కంపెనీలను ప్రోత్సహించేందుకు 2020 ఆర్థిక సంవత్సరంలో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రీడ్ వెహికల్ (ఎఫ్ఏఎంఈ) పథకం కింద కేంద్రం 10 వేల కోట్ల విలువైన సబ్సిడీని ప్రకటించింది.
కాగా, 2020 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 20.6 శాతం పెరిగి 1.52 లక్షల యూనిట్లకు చేరుకోగా, ఎలక్ట్రానిక్ బస్సుల అమ్మకాలు ఏకంగా 50 శాతం పెరిగి 600 యూనిట్లుకు చేరుకున్నాయి. అయితే, ఎలక్ట్రానిక్ కార్ల అమ్మకాలు మాత్రం 5.5 శాతం క్షీణించి 3,400 యూనిట్లకు పడిపోయాయి.