అహ్మదాబాద్: ఎగిరే కార్లు మనకు కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ విషయంలో పరిశోధనలు చేశాయి. ఎన్నో మోడళ్లను పరీక్షించాయి. కానీ ఇవ్వన్నీ ఇప్పటివరకూ పాశ్చాత్య దేశాలకే పరిమితం అయ్యాయి. అయితే గుజరాత్ ప్రభుత్వం తాజాగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఎగిరే కార్లు భారత్‌లోనూ తయారు కానున్నాయి. 

నెదర్‌ల్యాండ్స్‌కు చెందిన కంపెనీ పీఏఎల్-వీ భారత్‌లో ఎగిరే కార్ల తయారీ యూనిట్‌ నిర్మించాలని నిర్ణయించింది. ఫ్లయింగ్ కార్ల తయారీ ప్లాంట్‌ను గుజరాత్‌లో నిర్మించేందుకు నిర్ణయించిన కంపెనీ ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నది. 

also read టూ వీలర్ బైక్స్ పై భలే ఆఫర్లు : జస్ట్ మూడు వారాలు మాత్రమే

ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, పాల్-వీ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్లో మాస్ బొమ్మెల్ సంతకాలు చేశారు. భారత్ నుంచి ఇతర మార్కెట్లకు ఈ ఫ్లైయింగ్(ఎగిరే) కార్లను ఎగుమతి చేయడమే తయారీ కేంద్రం ఏర్పాటు వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. 

ఆ రాష్ట్రంలోని వసతులు, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని పాల్-వీ ఓ ప్రకటనలో తెలిపింది. 2021 నుంచి అక్కడ ఉత్పత్తి ప్రారంభించాలని పాల్-వీ కంపెనీ ప్రణాళిక వేసుకుంది. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులూ, సౌకర్యాల కల్పనకు సిద్దంగా ఉన్నామని గుజరాత్ పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎంకే దాస్ తెలిపారు. 

ఇక కారు వివరాల విషయానికొస్తే ఈ కారులో రెండు ఇంజన్లు ఉంటాయి. గంటకు 160 నుంచి 180 కిమీల వేగంతో ప్రయాణించగలదు. ఆన్ చేసిన మూడు నిమిషాల్లోనే ఎగరటానికి రెడీ అయిపోతుంది. అంతే కాదు.. ఫుల్ ట్యాంక్‌తో ఏకధాటిగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. పాల్-వీ అంటే పర్సనల్ ఎయిర్ లాండ్ వెహికల్ అని అర్థం.

also read మారుతి సుజుకి కొత్త కార్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు...

పాల్-వీ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్లో మాస్ బొమ్మెల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులు, సులభతర వాణిజ్యం, మెరుగైన నౌకాశ్రయం, లాజిస్టిక్ వసతులు గుజరాత్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 

అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాలకు ఈ ఫ్లయింగ్ కార్లను ఎగుమతి చేయాలని పాల్-వీ తలపోస్తున్నది. ఇప్పటికే కంపెనీకి 110 ఫ్లయింగ్ కార్ల కోసం ఆర్డర్లు వచ్చాయని పాల్-వీ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ కార్లో మాస్ బొమ్మెల్ చెప్పారు.