Asianet News TeluguAsianet News Telugu

భారత్ మార్కెట్‌లోకి తొలి ఇంటర్నెట్ కారు ‘ఎంజీ హెక్టార్’

బ్రిటిష్ ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్స్ హైబ్రీడ్, విద్యుత్ వెహికల్స్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనున్నది. వచ్చే నెలాఖరు నాటికి దేశీయ రోడ్లపై పరుగులు తీయనున్న హెక్టార్ భారత్‌లోనే తొలి ఇంటర్నెట్ కారు కానున్నది. 

EVs, hybrids on MG Motor agenda for India
Author
New Delhi, First Published Apr 3, 2019, 10:58 AM IST

ప్రముఖ బ్రిటిష్ ఆటోమొబైల్ మేజర్ ఎంజీ మోటార్‌ త్వరలోనే హెక్టార్‌ పేరుతో ఓ ఎస్‌యూవీ కారును మార్కెట్‌లోకి తేనున్నది. టాటా హారియర్‌కు పోటీగా వస్తున్న ఈ కారులో అత్యాధునిక సౌకర్యాలతోపాటు, స్మార్ట్‌ ఫీచర్లు ఉన్నాయి. 

ఎంజీ మోటార్స్ సంస్థ యాజమాన్యం ఈ కారుకు చెందిన ఫలు ఫీచర్లను బహిర్గతం చేసింది. ఇంటర్నెట్ వినియోగంతో భారతదేశంలో నడిచే తొలి కారు ఇదే కావచ్చునని భావిస్తున్నారు. వచ్చే రెండేళ్లలో భారతదేశంలో నాలుగు మోడల్ కార్లను ప్రవేశపెట్టనున్నది. 

హెక్టార్ కొనసాగింపుగా ఈ ఏడాదిలో విద్యుత్ వినియోగ కారును మార్కెట్లోకి తెస్తామని ఎంజీ మోటార్ ఇండియా అధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా తెలిపారు.  5జీ సిమ్‌, బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌తో భారత్‌ రోడ్లపైకి వస్తున్న తొలికారు ఎంజీ మోటార్స్ ‘హెక్టార్’ కావడం గమనార్హం. 

టెక్నాలజీ దిగ్గజం ‘మైక్రోసాఫ్ట్’ భాగస్వామ్యంతో ‘హెక్టార్’లో స్మార్ట్‌ఫీచర్లను అభివృద్ధి చేశారు. గతంలో ఏ భారతీయ కారులో చూడని అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని ఎంజీ మోటార్స్ తెలిపింది.

వచ్చే నెలాఖరు నాటికి ‘హెక్టార్’ను మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎంజీ మోటార్‌ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న టాటా హారియర్‌, జీప్‌ కంపాస్‌, హ్యుండాయ్‌ టక్సన్‌, మహీంద్రా ఎస్‌యూవీ 500 మోడల్ కార్లకు ఎంజీ మోటార్స్ ‘హెక్టార్’ గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.

ఈ కారులో బటన్‌ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. ‘హలో ఎంజీ’ అంటూ కారు రూప్‌, తలుపులు తెరవమని ఆదేశించవచ్చు. ఏసీని పెంచడం, తగ్గించడం, నావిగేషన్‌ సహా ఎన్నో సౌకర్యాలను నోటిమాటతో పొందవచ్చు. అతితక్కువ నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లోనూ ఇది చక్కగా పనిచేస్తుంది. 

ఈ కారులో ఇన్‌బిల్ట్‌గా 5జీ స్మార్ట్‌ సిమ్‌ను అమర్చారు. స్మార్ట్‌ఫోన్‌తో దీనికి అనుసంధానం కావచ్చు. పలు ఎంటర్‌టైన్‌మెంట్‌ అప్లికేషన్లను ‘గానా.కామ్‌’నూ ఉపయోగించుకోవచ్చు. 

స్మార్ట్‌ ఫీచర్లతోపాటు ఈ కారులో ప్రయాణికుల భద్రతకు కూడా పెద్ద పీట వేసినట్లు ఎంజీ మోటర్‌స్ తెలిపింది. రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఇందులో ఉన్న ఈ-కాల్‌ ఎమెర్జెన్సీ వ్యవస్థ ద్వారా కస్టమర్‌ కేర్‌కు తెలిసేలా ఏర్పాటు చేశారు. ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకోగా, సంస్థ పల్స్‌హబ్‌కు టెక్ట్స్‌ మెస్సేజ్‌ వెళ్లిపోతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios