అమ్మకాల్లేక ఆటోమొబైల్ రంగం అల్లాడి పోతున్నది. కానీ కారు చీకటిలో చిరు ఆశా కిరణం అన్నట్లు కొన్ని మోడల్ కార్లకు మాత్రం యమ డిమాండ్ లభిస్తోంది. ప్రత్యేకించి యుటిలిటీ విభాగం (యూవీ) విభాగంలో ఎస్‌యూవీ, కంపాక్ట్ ఎస్‌యూవీ, మినీ యూవీ మోడల్ కార్లకు ప్రస్తుతం డిమాండ్ భారీగానే ఉన్నది. 

సెప్టెంబర్‌ యూవీ సేల్స్‌లో 5.49 శాతం గ్రోత్
సెప్టెంబర్ నెలలో యుటిలిటీ విభాగంలో కార్ల విక్రయాల్లో 5.49 శాతం గ్రోత్ కనిపించింది. మరోపక్క ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో యుటిలిటీ విభాగంలో 77,380 వాహనాలు విక్రయిస్తే, 2019లో 81,625 వాహనాలు అమ్ముడవ్వడమే దీనికి నిదర్శనం. 

యువీ వెహికల్స్ పట్ల కస్టమర్లు సానుకూలం
వినియోగదారుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయనడానికి ఈ విక్రయాలే నిదర్శనంగా కనిపిస్తోంది. మారుతి సుజుకికి చెందిన విటారా బ్రెజ్జా, హ్యుండాయ్ గ్రాండ్, వెన్యూ, ఎంజీ హెక్టార్ మోడల్ కార్లకు డిమాండ్ నిలకడగా కొనసాగుతోంది. 

మారుతి ఎస్ ప్రెస్సోకు సానుకూల రియాక్షన్
ఇటీవల మారుతి సుజుకి మార్కెట్లోకి తీసుకొచ్చిన మినీ ఎస్‌యూవీ ఎస్-ప్రెస్సోకు మంచి స్పందన లభిస్తోంది. ఎస్‌యూవీ లుక్స్‌తో బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ కారుకు కేవలం 11 రోజుల్లోనే 10 వేల బుకింగ్న్ నమోదయ్యాయి. 

అందుబాటు ధరలో ఉండటం కలిసొచ్చే అంశం
సుమారు దశాబ్ద కాలం తర్వాత మారుతి సుజుకి చిన్న కార్ల విభాగంలో తీసుకొచ్చిన వాహనం ఇది. కొంచెం ఎత్తుగా, మెరుగైన గ్రౌండ్, టచ్ స్క్రీన్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి.

అందుబాటు ధరలో ఉండటం కూడా వినియోగదారులకు ఆకర్షిస్తోంది. ఈ కారు ప్రారంభ ధర రూ.3.69 లక్షల నుంచి రూ.4.94 లక్షల వరకు పలుకుతోంది. దీనికి తోడు రెండు రకాల యాక్సెసరీ కిట్లను కంపెనీ అందిస్తోంది.

దూసుకెళ్తున్న హ్యుండాయ్ వెన్యూ
ఇప్పటికే క్రెటా మోడల్ కారుతో ఎస్‌యూవీ మార్కెట్లో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుండాయ్ దూసుకుపోతున్నది. దీనికి సబ్ కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు ‘వెన్యూ’ మరింత బలాన్నిచ్చింది. మే-సెప్టెంబర్ మధ్య 42,681 యూనిట్లు విక్రయించిన వెన్యూ కోసం ప్రస్తుతం 75 వేలకు పైగా యూనిట్ల కోసం బుకింగ్స్ నమోదయ్యాయి. 

బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్ కారుపై ఆసక్తి
ఈ కారులో బ్లూ లింక్ కనెక్టెడ్ ఫీచర్ ఉన్న ఎస్ఎక్స్ (ఓ) కారును కొనుగోలు చేసేందుకు అత్యధికులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని హ్యుండాయ్ మోటార్స్ పేర్కొన్నది.

దక్షిణ కొరియాకే చెందిన మరో ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్ భారత విపణిలో అడుగు పెట్టడానికి ముందే వెన్యూ మోడల్ కారును హ్యుండాయ్ విడుదల చేసింది. 

విటారా బ్రెజా నుంచి వెన్యూకు గట్టి పోటీ
హ్యుండాయ్ వెన్యూ కారుకు మారుతి విటారా బ్రెజా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో నంబర్ వన్‌గా నిలిచిన బ్రెజ్జాను జూలై, ఆగస్టు నెలల్లో వెన్యూ దాటేసింది. ఈ కారులో 33 స్మార్ట్ ఫీచర్లలో 10 కేవలం భారత్ కస్టమర్ల కోసం డిజైన్ చేసినవే ఉన్నాయి.

హెక్టార్ మోడల్ కారుకు భారీగా డిమాండ్
బ్రిటన్ ఆటో మేజర్ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లోకి తీసుకు వచ్చిన హెక్టార్ మోడల్ కారుకు డిమాండ్ భారీగా ఉంది. ఇప్పటికే ఈ కారు ధరను 2.5 శాతం పెంచుతున్నట్లు ప్రకటించినా డిమాండ్ లో ఏమాత్రం మార్పు లేదు. ధర పెంచిన తర్వాత ఇటీవలే మళ్లీ బుకింగ్స్ ప్రారంభించింది. 

12 రోజుల్లో హెక్టార్ మోడల్ బుకింగ్స్ ఇలా
ఎంజీ హెక్టార్ మోడల్ కారు కేవలం 12 రోజుల్లో 8,000 యూనిట్లకు బుకింగ్స్ సాధించింది. జూన్ నెలలో హెక్టార్ మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటి వరకు 6000 యూనిట్ల వరకు అమ్ముడు పోయాయి. 

ధర పెంచినా తగ్గని హెక్టార్ డిమాండ్
తొలుత బుక్ చేసుకున్న వినియోగదారులకు 2.5 శాతం ధర తగ్గించిన ఎంజీ మోటార్స్.. తర్వాత పెంచిన ధరకే బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఎంజీ హెక్టార్ కారు ప్రారంభ ధర రూ.12.18 లక్షల నుంచి రూ.16.88 లక్షల మధ్య ఉంది.

డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి వేగవంతం చేస్తామని ఎంజీ తెలిపింది. ఫోర్ట్ ఎకో స్పోర్ట్ కారుకు కూడా డిమాండ్ బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.