Asianet News TeluguAsianet News Telugu

పల్లెల్లో ట్రాక్టర్లు, టూ వీలర్స్‌కు ఫుల్ డిమాండ్..ఎందుకంటే ?

పంట దిగుబడులు బాగానే రావడానికి తోడు ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల మధ్య గ్రామాల్లో ట్రాక్టర్లు, టూ వీలర్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. 

Auto sales in June a far cry from recovery; hope for tractors, two-wheelers
Author
Hyderabad, First Published Jul 2, 2020, 11:04 AM IST

న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనానికి తోడు కరోనా నియంత్రణకు విధించిన లాక్‌‌‌‌డౌన్ వేళ దేశవ్యాప్తంగా వాహనాల అమ్మకాలు విపరీతంగా తగ్గినా ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. ప్రత్యేకించి గ్రామీణుల ఖర్చు పెరుగుతోందని నిఫుణులు చెబుతున్నారు. ట్రాక్టర్, టూవీలర్ అమ్మకాలు పెరిగాయని తెలిపారు.

ఎందుకంటే ఈసారి పంట దిగుబడులు భారీగా ఉన్నాయి. దీనివల్ల పల్లెల్లో ఆదాయాలు సహజంగానే పెరిగాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నది. జన్‌‌‌‌ధన్ ఖాతాల్లో డబ్బు వేయడం వంటివి ఇందుకు ఉదాహరణలు. వీటికితోడు ఈసారి వర్షాలు బాగానే పడతాయని వాతావరణశాఖ ప్రకటించింది. 

ఈ పరిణామాలు ఆటోమొబైల్స్ కంపెనీల్లో ఉత్సాహం నింపుతున్నాయి. జూన్ త్రైమాసికంలో ట్రాక్టర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని ఆటోమొబైల్ కంపెనీలు భావిస్తున్నాయి. 

also read మారుతి సుజుకిని వెంటాడుతున్న కరోనా వైరస్..సగానికి పైగా తగ్గిన అమ్మకాలు.. ...

‘‘డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. రబీ దిగుబడులు ఆశించినట్టే వచ్చాయి. రైతులకు గిట్టుబాటు ధర దక్కింది. గ్రామీణ ప్రాంతాల కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోంది”అని మహీంద్రా అండ్ మహీంద్రా ఫామ్ ఎక్విప్‌ మెంట్ ప్రెసిడెంట్ హేమంత్ సిక్కా చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 26 శాతం పెరుగుతాయని తమ అంచనా అని సోనాలికా ట్రాక్టర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమన్ మిట్టల్ అన్నారు.

టూవీలర్ కంపెనీ హీరో మోటాకార్ప్ కూడా అమ్మకాలు బాగున్నాయని తెలియజేసింది. ప్రతి వారమూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని, దేశవ్యాప్తంగా అమ్మకాలు పెరుగుతున్నాయని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూ టివ్ చెప్పారు. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మాత్రమే సేల్స్ బాగా లేవని వివరించారు.

చివరకు బిస్కెట్లు, చాక్లెట్లు, సబ్బులు తయారు చేసే కంపెనీలు కూడా సంతోషంగానే కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ఆదాయం పెరగడం వల్ల అమ్మకాలూ పెరిగాయని పార్లే బిస్కెట్స్ వెల్లడించింది.

మన దేశ ఆదాయంలో వ్యవసాయరంగం వాటా రెండు శాతం పాయింట్ల వరకు ఉంటుందని, జీడీపీలో 15 శాతం వరకు ఉంటుందని ఈవై ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డీకే శ్రీవాస్తవ వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూరల్ ఎకానమీ బలంగా ఉండొచ్చని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios