సొంతంగా సేల్స్ పెంచుకునే మార్గాలన్వేషించాలి.. ఆటో సంస్థలకు సియామ్ అడ్వైజ్
జీఎస్టీ తగ్గింపు సాధ్యం కాదని కేంద్రం, జీఎస్టీ కౌన్సిల్ నిర్ధారించడంతో ఆటోమొబైల్ సంస్థలకు సియామ్ విలువైన సలహాలిచ్చింది. సొంతంగా విక్రయాలు పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచించారు.
వాహన తయారీ సంస్థలు స్వయంగా అమ్మకాలు పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) పిలుపునిచ్చింది. పండుగ సీజన్లో వాహనాలకు డిమాండు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో పరిశ్రమ వర్గాలకు సియామ్ కీలక సూచనలు చేసింది. ఆటోమొబైల్ రంగ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరిశ్రమ వర్గాలు సొంతంగానే పరిష్కారం కనుగొనాలని భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) పిలుపునిచ్చింది.
వాహనాలపై జీఎస్టీ తగ్గింపు ఉండదని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆటో మొబైల్ సంస్థలు స్వయంగా డిమాండ్ పెంచుకునే ప్రణాళికలు రచించాలని సియామ్ సూచించింది. గత కొన్నేళ్లలో ఎన్నడూ లేనంతగా వాహన రంగం సంక్షోభంలో చిక్కుకుంది.
ఈ నేపథ్యంలో అమ్మకాలను ప్రోత్సహించేందుకు జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని వాహన తయారీ సంస్థలు సర్కార్‌కు కోరాయి.
అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గింపుపై పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే రాష్ట్రాలు తమకు వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాయి.
"ఇటీవల జరిగిన 37వ జీఎస్టీ మండలి సమావేశంలో వాహనాలపై పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుందని ఆటో మొబైల్ రంగం భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సమావేశం తర్వాత వాహనాలపై ఎలాంటి పన్ను తగ్గింపు ఉండదని స్పష్టమైంది" అని సియామ్ అధ్యక్షుడు రాజన్ వాద్రా చెప్పారు.
అయితే ప్రస్తుతం 60 శాతం ఆటోమొబైల్ విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ శ్లాబ్‌లో ఉండగా.. 40 శాతం మాత్రమే 28 శాతం శ్లాబ్‌లో ఉండటం గమనార్హం.
జీఎస్టీ తగ్గించకున్నా.. పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాల పెరుగుతాయని ఆశిస్తున్నట్లు వాద్రా తెలిపారు.
సబ్ సెగ్మెంట్లోని 10-13 సీటర్ (నాలుగు మీటర్ల కన్న తక్కువ పొడవు) వాహనాలపై కాంపన్సేషన్ సెస్ తగ్గింపు ఇందుకు ప్రోత్సాహమందిస్తుందని ఆయన అంచనా వేశారు.
అభివృద్ధికి ఊతమందించే దిశగా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఉద్దీపనలు పరిశ్రమ వర్గానికి మేలు చేస్తాయని సియామ్ సెక్రటరీ జనరల్ రాజన్ వాద్రా అన్నారు.
మార్కెట్ స్థిరీకృతమై ఆదాయం సౌకర్యవంతమైన స్థాయికి చేరినప్పుడు.. ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.