న్యూఢిల్లీ: రెండేళ్లకోసారి జరిగే వాహన పండుగ నూతన కార్లతో కళకళలాడింది. దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు తాము సరికొత్తగా రూపొందించిన నూతన కార్లను గ్రేటర్‌ నోయిడాలోని ఆటో మొబైల్‌ ఎక్స్‌పో వేదికగా ప్రదర్శించాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాకు చెందిన కీలక ఆటోమొబైల్‌ సంస్థలు ఎక్స్ పోకు దూరంగా ఉన్నాయి. మిగతా కంపెనీలు మాత్రం జోష్‌ పెంచాయి. 

చైనాకు చెందిన గ్రేట్‌ వాల్‌ మోటార్స్ మాత్రం భారత్‌లో బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించడం విశేషం. ఈ ఆటో ఎక్స్‌పోలో మారుతి, హ్యుండాయ్‌, టాటా మోటర్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, రెనో, మెర్సిడెజ్‌-బెంజ్‌, వోక్స్‌వ్యాగన్‌, స్కోడా, కియా, హెక్టార్‌ తమ నూతన కార్లను ప్రదర్శించాయి. వీటిలో అత్యధికంగా విద్యుత్‌తో నడిచే కార్లే కావడం విశేషం. కరోనా వైరస్‌ ధాటికి ఎక్స్ పోలో పాల్గొన్న చాలా మంది మాస్క్‌లు ధరించి పాల్గొనడం విశేషం.

also read  కరోనా ఎఫెక్ట్‌తో ఆటో ఎక్స్‌పోకు చైనా సంస్థలు డుమ్మా..?

బెంజ్‌ నుంచి సరికొత్త కౌప్‌
జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌..భారత మార్కెట్లోకి రూ.2.42 కోట్ల విలువైన ‘ఏఎంజీ జీటీ 63ఎస్‌ 4 మ్యాటిక్‌’ మోడల్ కారును అందుబాటులోకి తెచ్చింది. గంటకు 315 కిమీ వేగాన్ని అందుకోనున్న ఈ కారు కేవలం ఐదు సెకన్లలో 100 కి.మీ వేగం అందుకుంటుంది. నాలుగు డోర్లు కల ఈ కారును నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏప్రిల్‌లో దేశీయ విపణిలోకి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఈక్యూసీని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది కూడా. 

భారత్‌లో ఎంజీ రెండో ప్లాంట్‌
భారత్‌లో మరో ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా. ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్‌లో జనరల్‌ మోటార్స్‌కు ఉన్న ప్లాంట్‌ను కొనుగోలు చేసిన సంస్థ..మరో యూనిట్‌ను నెలకొల్పే అవకాశాలు ఉన్నాయని కంపెనీ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ చాబా తెలిపారు. ఈ యూనిట్‌లో ఏడాదికి లక్ష కార్లు ఉత్పత్తి అవుతుండగా, 2022 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు లక్షలకు పెంచుకోనున్నట్లు ప్రకటించారు. నూతన ప్లాంట్‌ ఏర్పాట్లు వచ్చే మూడు, నాలుగు నెలల్లో కొలిక్కి రానున్నట్లు చెప్పారు.  

రెండేళ్లలో మరో నాలుగు కార్లు: టాటా
ఆటోమొబైల్‌ రంగంపై మరింత పట్టు సాధించడానికి టాటా మోటర్స్‌ పావులు కదుపుతున్నది.   వచ్చే రెండేళ్లలో దేశీయ మార్కెట్లోకి నాలుగు కార్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో ఎలక్ట్రిక్‌ కారుతోపాటు ఎస్‌యూవీ, విద్యుత్‌తో నడిచే బస్సు, ట్రక్కులు కూడా ఉన్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఆటో ఎక్స్‌పోలో 26 నూతన ఉత్పత్తులను ప్రదర్శించింది. వీటిలో 14 కమర్షియల్‌ వాహనాలు కాగా, 12 ప్యాసింజర్‌ వాహనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయానికి ప్రత్యేక ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. 

10 లక్షల కాలుష్య రహిత కార్లు విక్రయిస్తాం: మారుతి
కాలుష్య రహిత వాహనాలపై  దృష్టి సారించిన మారుతి సుజుకీ వచ్చే కొన్నేళ్లలో పది లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటిలో సీఎన్‌జీ, స్మార్ట్‌ హైబ్రిడ్‌, విద్యుత్‌తో నడిచే వాహనాలు ఉన్నాయని మారుతి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా తెలిపారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న విద్యుత్‌తో నడిచే వాహనాలపై విధించే కస్టమ్స్‌ డ్యూటీని పెంచడమేంటని మారుతి సుజుకీ ప్రశ్నించింది.

సుంకం పెంచడంతో దేశీయంగా విద్యుత్‌తో నడిచే కార్లు తయారు చేయడం అంత సులభతరం కాదని మారుతి ఎండీ, సీఈవో కెనిచి అయుకవా వ్యాఖ్యానించారు. కమర్షియల్‌ ఈవీలపై దిగుమతి సుంకాన్ని 25 శాతం నుంచి 40 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 

also read ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు కొత్త టెక్నాలజీ....

కాన్సెప్ట్‌ మోడల్ కారును ఆవిష్కరించిన స్కోడా 
ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ స్కోడా దేశీయ పరిస్థితులకనుగుణంగా తయారుచేసిన ఎస్‌యూవీ కాన్సెప్ట్‌ కారును ఆవిష్కరించింది. వచ్చే ఏడాది విడుదల చేయనున్న ఈ కారును ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా తయారు చేసినట్లు కంపెనీ ఇండియా బ్రాండ్‌ డైరెక్టర్‌ జాక్‌ హోల్లియస్‌ తెలిపారు. వచ్చే మూడేళ్లలో దేశీయంగా వ్యాపారాన్ని విస్తరణకు 150 నగరాల్లో 200 విక్రయ, సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం సంస్థ రూ.8 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నది. 

కోనా ధరను పెంచబోమన్న హ్యుండాయ్‌
విద్యుత్ వాహనం కోనా మోడల్‌ ధరను పెంచబోమని హ్యుండాయ్‌ మోటార్స్ ప్రకటించింది. ఎలక్ట్రిక్‌ వాహనాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఈ కారు ధరను పెంచే ఉద్దేశమేది లేదని హ్యుందాయ్‌ ఎండీ, సీఈవో ఎస్‌ఎస్‌ కిమ్‌ తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియాను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం కోనా కారు రూ.23.71 లక్షలకు లభించనున్నది.