Asianet News TeluguAsianet News Telugu

కారు ధర రూ.13.95 కోట్లు, రెప్పపాటులో 100కి.మీ : బాటిస్టా ఫీచర్లు ఇవే

మహీంద్రా అండ్ మహీంద్రా, ఇటలీ ఆటో దిగ్గజం పినినార్పినా కలిసి సంయుక్తంగా విద్యుత్ వినియోగంతో అత్యంత వేగంగా ప్రయాణించే ‘బాటిస్టా’ కారును దుబాయ్ మార్కెట్లో ఆవిష్కరించాయి

All-electric $2m worth Battista unveiled in Dubai
Author
New Delhi, First Published May 1, 2019, 11:35 AM IST

దేశీయ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ ఇటలీ కార్ల తయారీ సంస్థ ‘ఆటోమొబైలి పినిన్ఫారినా’ మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్లోకి సరికొత్త హైపర్‌కార్‌ బట్టిస్టాను తీసుకొచ్చింది. దీని ధర 20లక్షల డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో రూ.13.95 కోట్లు.

పూర్తిగా ఉద్గార రహిత ఎలక్ట్రిక్ కారు ‘బాటిస్టా’
మహీంద్రా అండ్ పినినార్పినా సంయుక్తంగా తయారు చేసిన ఈ కారు పూర్తి ఇటాలియన్‌ డిజైన్‌తో తయారు చేసిన ఉద్గార రహిత ఎలక్ట్రిక్‌ కారు. దీనిని దుబాయ్‌లో విడుదల చేశారు. దుబాయ్‌లోని విలాసవంతమైన కార్ల డీలర్‌ ఆడమ్స్‌ మోటార్స్‌ షోరూమ్‌లో ఇది అందుబాటులో ఉంది. 

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో పూర్తిస్థాయి ఉత్పత్తి
ఈ మోడల్ కార్ల పూర్తి స్థాయి ఉత్పత్తిని ఇటలీలోని కాంబియానో ఉత్పత్తి కేంద్రంలో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభిస్తారు. మొత్తం 150 కార్లనే ఉత్పత్తి చేస్తారు. వీటిల్లో మిడిల్ ఈస్ట్‌లో కనీసం 50 కార్లు విక్రయించాలని భావిస్తోంది. 

సూపర్ కార్లకు డిమాండ్ గల దేశం ‘దుబాయ్’
పినినార్పినా కంపెనీ డిజైన్‌ డైరెక్టర్‌ లూకా బోర్గోనో మాట్లాడుతూ ‘జెనీవా ఆటోషోలో దీన్ని విడుదల చేసిన కొన్ని వారాల్లోనే దుబాయ్‌లో విడుదల చేయడం సంతోషంగా ఉంది. సూపర్‌ కార్లకు అత్యధిక డిమాండ్‌ ఉన్న దేశం ఇది. సరికొత్త బట్టిస్టా కారు 1,900 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది.

దీని నుంచి ఎటువంటి కాలుష్యం ఉత్పత్తి కాదు. ఈ కారు అల్ట్రా హై పర్ఫార్మెన్స్‌ కార్లంటే ప్రేమను పెంచుతుంది’ అని అన్నారు. 

దుబాయిలో ఆడమ్స్ మోటార్స్ కు డీలర్ షిప్
తొలుత ఆడమ్స్‌ మోటార్స్‌కు మహీంద్రా అండ్ మహీంద్రా, పినినార్పినా డీలర్‌ షిప్‌ ఇచ్చారు. సౌదీ అరేబియాలో కూడా విక్రయించేలా మరో రిటైల్‌ భాగస్వామి కోసం కూడా అన్వేషణ కొనసాగుతోందని పినిన్ఫారినా తెలిపింది.

తొలిసారి కారులో 120 కెడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని అమర్చారు. నాలుగు చక్రాలకూ నాలుగు మోటార్లు ఉంటాయి. మొత్తం కలిపి 1900 బీహెచ్‌పీ శక్తిని, 2,300 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తాయి. 

ఫార్ములా వన్ కారు కంటే బటిస్టా వేగవంతం
ప్రస్తుత ఫార్ములా వన్ కారుకన్నా పినినార్పినా బటిస్టా కారు చాలా వేగవంతమైంది. కేవలం రెండు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 12 సెకన్ల లోపు గంటకు 300 కిలోమీటర్ల వేగానికి చేరుతుంది. దీని అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. దీనిని గంటకు 450 కిలోమీటర్లకు కూడా చేర్చవచ్చు.

నిరాశపరచిన టీవీఎస్‌ మోటార్స్
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నికర లాభాల్లో టీవీఎస్‌ మోటార్‌ నిరాశ పరిచింది. రూ.133.8 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.165.6 కోట్లతో పోలిస్తే ఇది 19.2 శాతం తక్కువ.

కార్యకలాపాల ఆదాయం రూ.4,007.24 కోట్ల నుంచి రూ.4,384.02 కోట్లకు పెరిగింది. కంపెనీ ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయాలు (ఎగుమతులతో కలిపి) మొత్తం మీద 2017-18 మార్చి త్రైమాసికంలో 8.89 లక్షలు ఉండగా, సమీక్షా త్రైమాసికంలో 9.07 లక్షలకు చేరాయి.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో స్వలంగా పెరిగిన నికర లాభం
అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2018-19 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.662.60 కోట్ల నుంచి 1.13 శాతం పెరిగి రూ.670.1 కోట్లకు చేరింది. కార్యకలాపాల ఆదాయం రూ.15,518.63 కోట్ల నుంచి రూ.18,209.92 కోట్లకు పెరిగింది.

మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 33.67 లక్షల నుంచి 37.57 లక్షలకు పెరిగాయి. మంగళవారం బీఎస్‌ఈలో టీవీఎస్ మోటార్స్ షేర్ 3.01 శాతం నష్టంతో  రూ.491.15 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios