ముంబై: ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్రోకరేజీ సంస్థలతో పోలిస్తే కొత్తగా అడుగుపెట్టే సంస్థల విషయంలోనే ఎక్కువగా ఆందోళన చెందాల్సి ఉంటుందని జెరోధా భావిస్తోంది. ఇందుకు పేటీఎం మనీని ఉదాహరణగా చూపుతోంది. స్టాక్‌ బ్రోకింగ్‌ సేవలను ప్రారంభించేందుకు ఇటీవల పేటీఎం మనీకి సెబీ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 

కొత్త సంస్థలకు టెక్నాలజీ విషయంలో ఇబ్బందులేమి ఉండకపోవడమే వాటితో పోటీ ఎక్కువ ఉంటుందని చెప్పడానికి కారణమని జెరోధా ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) నితిన్‌ కామత్‌ పేర్కొన్నారు. ‘ట్రేడింగ్‌ ఉత్పత్తుల విషయంలో పోటీ పడేవి ఏమైనా ఉన్నాయంటే అవి కొత్తగా అడుగుపెట్టే సంస్థలే. అయితే అవి ఆ స్థాయి పనితీరు కనబరుస్తాయా? లేదా? అనేది కాలం మాత్రమే చెప్పగల్గుతుంది’అని తెలిపారు. 
వాస్తవానికి ప్రస్తుత ట్రేడర్లతో పోలిస్తే కొత్తగా స్టాక్‌ మార్కెట్లో అడుగుపెట్టేవారి నుంచే జెరోధాకు 65 నుంచి 70 శాతం వరకు వ్యాపారం వస్తుంది. ‘మనం ఎప్పుడూ మన వెనక ఎవరు వస్తున్నారని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు మనల్ని వాళ్లు అందుకుంటారో తెలియదు’ అని జెరోధా సీఈఓ నితిన్ కామత్ తెలిపారు.

‘భారత్‌లో మార్కెట్‌ వాటాను త్వరగా పెంచుకునే అవకాశం ఉన్న సంస్థలు ఉన్నాయంటే అది పేటీఎం. అందువల్ల అది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నది నా అభిప్రాయం’అని జెరోధా సీఈఓ నితిన్ కామత్‌ తెలిపారు. జెరోధా నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ రిటైల్‌ స్టాక్‌ బ్రోకరేజీ సంస్థలు కూడా బ్రోకరేజీ రుసుము తగ్గిస్తున్నాయి.

ఇప్పటికే యాక్సిస్‌ బ్యాంక్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌ సంస్థలు ఆ దిశగా అడుగులు వేశాయి కూడా. అయితే ఈ ప్రభావం తమపై పెద్దగా ఉండదని జెరోధా అంటోంది.

‘రుసుం ఇక్కడ ముఖ్యం కాదు. అందించే ట్రేడింగ్‌ ఉత్పత్తులే కీలకం. పోటీ విషయంలో మేం ఇప్పటికీ ఇతరులకు అందనంత దూరంలో ఉన్నామంటే అదే కారణం. ఎవరి దగ్గర మంచి ట్రేడింగ్‌ ఉత్పత్తులు ఉంటాయో వారే పోటీలో గెలుస్తారు’అని నితిన్ కామత్‌ అన్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న చౌక బ్రోకింగ్‌ విభాగంలో వాటాను పెంచుకునేందుకు సంప్రదాయ బ్రోకింగ్‌ సంస్థలు కూడా అదే తరహా ఉత్పత్తులను అందిస్తున్నాయి. ఇటీవల యాక్సిస్‌ బ్యాంకుకు చెందన బ్రోకరేజీ విభాగమైన యాక్సిస్‌ డైరెక్ట్, షేర్ల కొనుగోలు/ అమ్మకం ఒక లావాదేవీకి రూ.20 మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించింది. 

లావాదేవీల విలువ ఎంతైనా రుసుము ఇంతేనని జెరోధా తెలిపింది. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాలకు ఇవే రుసుములు వర్తిస్తాయని తెలిపింది. యాక్సిస్‌ బ్యాంక్‌ ఖాతాలో త్రైమాసిక సగటున రూ.75 వేలు నిల్వ ఉంచిన వారు, ఈ పథకం వినియోగించుకోవచ్చు.

ఇతరులు నెలకు రూ.250 రుసుముతో, ఇదే వసతి పొందవచ్చు. మరోవైపు ఏంజెల్‌ బ్రోకింగ్‌ కూడా రూ.50,000 వరకు విలువైన షేర్ల కొనుగోలు/అమ్మకానికి రూ.15 చొప్పున, అంతకుమించిన విలువైన లావాదేవీపై రూ.30 చొప్పున మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. 

ఈక్విటీలు, ఫ్యూచర్స్‌-ఆప్షన్స్‌, కమొడిటీ, కరెన్సీ విభాగాలకూ ఇదే రుసుము వసూలు చేస్తామని తెలిపింది. మరోవైపు ఒక లావాదేవీకి రూ.20 లేదా లావాదేవీ విలువలో 0.01 శాతం.. ఏది తక్కువైతే అది మాత్రమే జెరోధా వసూలు చేస్తోంది. డెలివరీకి బ్రోకరేజీ రుసుం లేదు.