ముంబై: యస్‌ బ్యాంక్‌ బోర్డు సభ్యుడు బ్రహ్మ్‌దత్‌ తదుపరి చైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన పేరును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ)కి యస్‌ బ్యాంక్‌ సిఫారసు చేసినట్లు విశ్వసనీయ వర్గాల కథనం. యస్‌ బ్యాంక్‌ కార్యకలాపాల వ్యవహారాల్లో బ్రహ్మ్‌దత్‌కు పట్టు ఉండటం, వ్యవస్థలోని వివిధ అంశాలపై అవగాహన ఉండటం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయనను ఎంపిక చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై స్పందించేందుకు బ్యాంక్ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు.

నవంబర్ నుంచి ఖాళీగా యస్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పదవి నవంబర్ నెల నుంచి యస్ బ్యాంక్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. అంతకుముందు చైర్మన్‌గా పని చేసిన  అశోక్‌ చావ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో నవంబర్ నెలలో రాజీనామా చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉన్నది. 

రిటైర్డ్ బ్యూరోక్రాట్ బ్రహ్మ్ దత్
రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌ అయిన బ్రహ్మ్ దత్‌ ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ బోర్డులో స్వత్రంత్ర డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈయన కాక బోర్డులోని మిగిలిన ఏడుగురు సభ్యుల్లో బ్యాంకు ఎండీ, సీఈఓ రాణా కపూర్‌, లెఫ్టినెంట్‌ జనరల్‌ ముకేశ్‌ సభర్వాల్‌, సుభాష్‌ కలియ, అజయ్‌ కుమార్‌, ప్రతిమ షెహ్రెయ్‌, ఉత్తమ్‌ అగర్వాల్‌, టిఎస్ విజయన్‌ ఉన్నారు.

విజయన్ ఇలా బోర్డు సభ్యుడిగా నియామకం
ఎల్‌ఐసీ, ఐఆర్‌డీఏఐలకు ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన విజయన్‌ను ఇటీవలే యెస్‌ బ్యాంక్‌ బోర్డులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఉత్తమ్‌ అగర్వాల్‌ కూడా అప్పుడే బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన అగర్వాల్‌కు పన్నుల విధానం, ఆర్థిక, పునర్వ్యవస్థీకరణ తదితర విషయాలపై మంచి పట్టుంది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓగా రాణా కపూర్‌ పదవీకాలం పొడిగింపునకు ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతో కొత్త ఎండీ, సీఈఓ పేరును కూడా బ్యాంకు సిఫారసు చేయాల్సి ఉంది. కపూర్‌ పదవీకాలం వచ్చే ఏడాది జనవరి నెలాఖరుతో ముగియనుంది.

కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.8000 కోట్లు 
అవినీతి నిరోధం, నల్లధనం వెలికితీత లక్ష్యంతో రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేసిన 2016-17లో కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం రూ.7,965 కోట్లకు పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ముద్రణ ఖర్చులు రూ.4,912 కోట్లకు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్‌కు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. కరెన్సీ నోట్ల కొరతను ఆర్బీఐ భర్తీ చేయడమే ఇందుకు కారణమని తెలిపింది.

నోట్ల రద్దుకు ముందు కరెన్సీ ముద్రణ ఖర్చు ఇలా
ఇక నోట్ల రద్దుకు ముందు ఆర్థిక సంవత్సరం (2015-16)లో కరెన్సీ ముద్రణ వ్యయం రూ.3,421 కోట్లని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో చెప్పారు. మరోవైపు కరెన్సీ చెల్లింపులపై 2015-16లో రూ.109 కోట్లు, 2016-17లో రూ.147 కోట్లు, 2017-18లో రూ.115 కోట్లు చొప్పున వెచ్చించినట్లు వివరించారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు వాటిని నాశనం చేయడానికి అయిన వ్యయాలను వెల్లడించాలని వచ్చిన ప్రశ్నకు జైట్లీ సమాధానమిచ్చారు. ఆర్‌బీఐ ఖాతాల్లో నోట్ల రద్దు తర్వాత కరెన్సీ ముద్రణకు అయిన వివరాలు వేర్వేరుగా లేవని జైట్లీ అన్నారు.