Worlds Most Expensive Pigeon: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పావురం.. ధర 100 BMW కార్లకు సమానం!
సాధారణంగా మనం చాలా రకాల పక్షులను ఇంట్లో పెంచుతుంటాం. వాటి ధర వందల్లో, వేలల్లో ఉంటుంది కానీ కోట్లలో ధర పలికే పక్షి ఏంటో మీకు తెలుసా? అసలు ఎందుకు ఆ పక్షికి అంత ధర? తెలుసుకోండి మరి.

ప్రపంచంలో చాలా ఖరీదైన వస్తువుల గురించి మనం తరచూ వింటూనే ఉంటాం. వాటి ధర లక్షల్లో ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇంత ఖరీదైన పావురం గురించి విన్నారా? దీని ధర ఒకటి రెండు కాదు 100 BMW కార్లకు సమానమట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షిగా పరిగణించబడుతోంది. పావురాలు మాత్రమే కాదు, కొన్ని చిలుకలు, కోళ్ళు కూడా చాలా ఖరీదైనవి ఉన్నాయట. వాటి ప్రత్యేకతలెంటో ఒకసారి చూసేయండి.
అత్యంత ఖరీదైన పావురం ధర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పక్షి రేసింగ్ పావురం. 2020లో, అర్మాండో అనే రేసింగ్ పావురం 1.4 మిలియన్ డాలర్లకు అంటే దాదాపు 115 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇది ఛాంపియన్ రేసర్. ఇది చాలా వేగవంతమైంది. వాటికి ఎక్కువ దూరం ఎగరడానికి శిక్షణ ఇస్తారు. ఈ పావురాలు గంటకు 60 మైళ్ల వేగంతో ఎగురుతాయి. అర్మాండో అత్యంత ఖరీదైన పక్షిగా ప్రపంచ రికార్డుకు ఎక్కింది. ప్రస్తుతం BMW X4 ధర 96.20 లక్షల రూపాయలు అంటే సుమారు కోటి రూపాయలు. ఈ లెక్కన అర్మాండో పావురం ధర 100 కంటే ఎక్కువ కార్లకు సమానం.
అత్యంత ఖరీదైన చిలుక
న్యూ గినియాలో బ్లాక్ పామ్ కాకటూ అనే పెద్ద చిలుక కనిపిస్తుంది. ఈ చిలుక ఈకలు నల్లగా, ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది. బ్లాక్ పామ్ కాకటూ ధర 15 వేల డాలర్లు అంటే 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చిలుక హైసింత్ మకావ్, ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఇది మూడు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. దీని ధర 10,000 డాలర్లు అంటే దాదాపు 8 లక్షల రూపాయల వరకు ఉంటుంది.
నల్ల మాంసం కోళ్ళు
ఆయం సెమాని చికెన్ అనేది ఒక అరుదైన జాతి. ఇది ఇండోనేషియాలో కనిపిస్తుంది. ఇది దాని నల్ల ఈకలు, నల్ల చర్మం, నల్ల మాంసం కారణంగా ప్రసిద్ధి చెందింది. ఈ కోళ్ళు చాలా ఖరీదైనవి. వీటి ధర 2,500 డాలర్లు అంటే 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది.