ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్ లైటింగ్ విధానం అవలంబిస్తున్న 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ప్రస్తుతం ఐటి పరిశ్రమలో ఈ మూన్ లైటింగ్ విధానం పై చర్చ మొదలైంది. అయితే అసలు మూన్ లైటింగ్ విధానం అంటే ఏంటి..? ఇది కంపెనీ ప్రయోజనాలకు ఎంతవరకు గొడ్డలి పెట్టో తెలుసుకుందాం.
ఒకే సమయంలో 2 కంపెనీల్లో పనిచేస్తున్న (మూన్‌లైటింగ్) తమ ఉద్యోగుల్లో 300 మందిని తొలగించినట్లు విప్రో ప్రెసిడెంట్ రిషద్ ప్రేమ్‌జీ తెలిపారు. కోవిడ్ సమయంలో తమ కంపెనీకి చెందిన 300 మంది ఉద్యోగులు, తమ పోటీ కంపెనీల్లో పనిచేస్తున్నారని. ఇటువంటి ప్రవర్తన చట్టవిరుద్ధమని, తదనుగుణంగా మేము అటువంటి సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మూన్ లైటింగ్ గురించి తాను ఇటీవల చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని రిషద్ ప్రేమ్‌జీ ఒక కార్యక్రమంలో అన్నారు.
ఉద్యోగుల ఇలాంటి వ్యవహారం వల్ల ఇతర ఉద్యోగుల పనిపై కూడా కంపెనీ ప్రభావం చూపుతోందని విప్రో వర్గాలు వాదిస్తున్నాయి. ఇప్పటికే విప్రో తరహాలోనే ఇతర కంపెనీలు సైతం మూన్‌లైటింగ్ సమస్యపై దృష్టిసారించారు. ఈ రోజు విప్రోలో పనిచేసే ఉద్యోగులు, మా పోటీదారుల్లో ఒకరి కోసం నేరుగా పని చేస్తున్నారు. అలాంటి వారిని గత కొన్ని నెలల్లో మేము 300 మందిని కనుగొన్నాము. ఇది కంపెనీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని రిషద్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు.
నిజానికి ఒక ఉద్యోగి తాను చేస్తున్న కంపెనీలో మాత్రమే కాకుండా మరో కంపెనీలో కూడా డబల్ షిఫ్ట్ ప్రాతిపదికన ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. ఈ విధంగా మూన్ లైటింగ్ ప్రాతిపదికన ఉద్యోగం చేయడానికి చాలా కంపెనీలు ఒప్పుకోవు. ఇవి తమ కంపెనీ కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధమని చెబుతుంటాయి. నిజానికి ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది కోవిడ్ నేపథ్యంలో ఆన్ సైట్ ఆఫీసుకు వచ్చి పనిచేయడం తగ్గిపోయింది. వర్క్ ఫ్రం హోం కారణంగా చాలా మంది ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం ఈ మూన్ లైటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడం ద్వారా తమ కంపెనీ ఆదాయం పై ప్రభావితం అవుతుందని పెద్ద కంపెనీలో ఆందోళన చెందుతున్నాయి.
ప్రేమ్‌జీ తన ట్విట్టర్‌లో ఈ సమస్యను "మోసం"తో సమానం అని పేర్కొన్నప్పటికీ, 'మూన్‌లైటింగ్' సమస్య ఐటి పరిశ్రమలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. టెక్ పరిశ్రమలో మూన్ లైటింగ్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇదో స్కామ్ అంటూ రిషద్ ప్రేమ్ జీ ట్వీట్ చేశారు. ప్రేమ్‌జీ ట్వీట్‌పై పరిశ్రమలో తీవ్ర స్పందన వ్యక్తమైంది.
ఇదిలా ఉంటే చాలా ఐటీ కంపెనీలు ఇటువంటి పద్ధతుల గురించి ఉద్యోగులను హెచ్చరించాయి. గత వారం, ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు 'మూన్‌లైటింగ్'ని అనుమతించదని, తమ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘిస్తే ఉద్యోగాన్ని రద్దు చేయవచ్చని పేర్కొంది. క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారతదేశంలోని రెండవ అతిపెద్ద IT సేవల సంస్థ, ఇన్ఫోసిస్, గత వారం ఉద్యోగులకు బలమైన మరియు దృఢమైన సందేశాన్ని ఇచ్చింది.
"నో డబుల్ లైఫ్" పేరుతో ఇన్ఫోసిస్ కమ్యూనికేషన్ "ఉద్యోగి హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం డబుల్ ఎంప్లాయిమెంట్ అనుమతించబడదు" అని స్పష్టం చేసింది. ఆఫర్ లెటర్‌లోని సంబంధిత క్లాజ్ కూడా ఈ సందర్భంలో ప్రస్తావించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి, దీని ఫలితంగా ఉద్యోగాన్ని రద్దు చేయవచ్చు అని ఇన్ఫోసిస్ ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించింది. IBM ఇండియా కూడా మూన్‌లైటింగ్ ఒక అనైతిక పద్ధతి అని అభిప్రాయపడింది.
