ఈ కామర్స్‌ మార్కెట్‌లో అతిపెద్ద డీల్‌గా నిలిచిన వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ ఒప‍్పందంపై ఆదాయపన్ను శాఖ ఆరా తీస్తోంది.  ఈ క్రమంలో ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్‌,  సచిన్ బన్సల్‌లకు  ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. వాల్‌మార్ట్‌ ఒప్పందంపై పొందిన ఆదాయ వివరాలను వెల్లడించాలని  కోరింది.

వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన నగదు వివరాలు అందించాలని కోరింది. నికర లాభం, పన్ను చెల్లింపులకు సంబంధించిన వివరాలను కూడా ఐటీ శాఖ కోరినట్టు సమాచారం. వీరితోపాటు సంస్థలోని 35మంది వాటాదారులకు కూడా నోటీసులు జారీ చేసింది.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం భారతీయులైన సచిన్‌,బిన్నీ బన్సల్‌ ద్వయం 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే  వాటా అమ్మకం,  దానిపై ముందస్తు పన్నుఎప్పుడు చెల్లిస్తారని ఐటీ శాఖ  నుంచి కొన్ని నెలల క్రితమే నోటీసులు అందాయనీ, అయితే ఆ నోటీసులకు సంబంధించి మేము అప్పుడే వివరణ ఇచ్చామని కో  ఫౌండర్‌ బిన్నీ బన్సల్  తెలిపారు.

వాల్ మార్ట్ సంస్థకు ఫ్లిప్ కార్ట్ వాటాల విక్రయం నుంచి ఎంత ఆదాయం లభిస్తుందనే అంచనా ఉంటుంది కనుక, దాని ఆధారంగా ముందస్తు పన్ను చెల్లించాలి. మొత్తం అంచనా పన్నులో 75 శాతాన్ని ఈ ఏడాది డిసెంబరు 15లోపు, మిగిలిన 25 శాతాన్ని 2019 మార్చి 15లోపు జమచేయాలి. 

‘వాల్‌మార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందాన్ని అధ్యయనం చేశాక, అంతర్జాతీయ పన్ను విభాగం సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్సల్‌లకు లేఖ పంపింది. వారిద్దరు బెంగళూరులో ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నారు కనుక, అక్కడి మదింపు అధికారి సంప్రదింపులు సాగిస్తారు’అని ఐటీ అధికారి ఒకరు వెల్లడించారు.

వీరు ముందస్తు పన్ను జమ చేయకపోతే, నెలకు 1% చొప్పున వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.  కాగా అంతర్జాతీయ  ఈ కామర్స్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీయ దిగ‍్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది.

సెప్టెంబర్‌లో ప్రకటించిన ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.13750కోట్లు (16 బిలియన్‌ డాలర్లు). ఒప్పందంలో భాగంగా ఇప్పటికే సుమారు రూ.7439కోట్లు వాల్‌మార్ట్ చెల్లించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. 

ఇదిలా ఉంటే ఈ ఒప్పందం ముగిసిన అనంతరం ఫౌండర్లలో ఒకరైన సచిన్‌ బన్సల్‌  ఫ్లిప్‌కార్ట్‌లో తన 5-6శాతం వాటాను అమ్ముకొని సంస్థకు గుడ్‌ బై చెప్పారు. మరో ఫౌండర్‌  బిన్సీ బన్సల్‌  లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ నెలలో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో పదవికి రాజీనామా చేశారు. ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద వాటాదారుడుగా కొనసాగుతానని  ప్రకటించిన సంగతి తెలిసిందే.