చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పుడు రాజీ దిశగా పయనిస్తోంది. ఈ రెండు దేశాలు ఒక ఒప్పదం కుదుర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఒప్పందం కుదిరితే చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన అంక్షలు మొత్తం తొలగిపోయే అవకాశం ఉంది. 

దీనికి ప్రతిగా  అమెరికా మేధోహక్కులను చైనా పరిరక్షిస్తుంది. దీంతోపాటు అమెరికా నుంచి దిగుమతులను కూడా పెంచే అవకాశం ఉంది. అమెరికా విధించిన పన్నులను తొలగించేలా చైనాకు చెందిన ప్రతినిధులు కొన్ని వారాలుగా చర్చిస్తున్నారు.

చైనా వస్తువులపై ఇప్పటికే అమెరికా దాదాపు 200 బిలియన్‌ డాలర్లకు పైగా దిగుమతి సుంకాలు విధించింది. దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా ఈ పన్నులను తొలగించేలా చేసేందుకు చైనా ప్రతినిధుల బృందం రంగంలోకి దిగి అమెరికా ప్రతినిధులతో ప్రారంభించిన చర్చలు కొలిక్కి రానున్నాయి. 

ఒక్కసారిగా పన్నులు తొలగించడమా? లేక దశల వారీగా తొలగించడమా? అన్న అంశంపై అమెరికా మల్లగుల్లాలు పడుతోంది. చైనా కొత్త ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసిన నాడే సుంకాలను పూర్తిగా తొలగించాలన్నదానికే అమెరికా ఎక్కువ మొగ్గు చూపుతోంది.

ఒకవేళ కొత్త ఒప్పందం అమల్లో చైనా విఫలమైతే అమెరికా కొత్తగా పన్నులు విధించే అవకాశం ఉంది. 
వీటికి చైనా ప్రతీకార చర్యలు తీసుకోకూడదని అమెరికా షరతులు విధిస్తోంది. ఈ నెల 27వ తేదీన డొనాల్డ్ ట్రంప్‌ - జీ జిన్‌పింగ్‌ సమావేశమై ఒప్పందానికి తుదిరూపును ఇవ్వవచ్చు. 

ఈ నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రావాల్సిన టారీఫ్‌ల పెంపును ట్రంప్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. దీని ప్రకారం అమెరికా వస్తువులపై చైనా తక్కువ టారీఫ్‌లు విధిస్తుంది. అమెరికాలోని హూస్టన్‌ చెందిన ఒక గ్యాస్‌ కంపెనీ నుంచి 18బిలియన్‌ డాలర్లు విలువైన సహజవాయువు కొనుగోలు చేస్తుంది.

ఆటోమొబైల్‌ సంస్థల్లో విదేశీ యాజమాన్యంపై ఆంక్షలను తొలగిస్తుంది. దిగుమతి చేసుకొనే ఆటోమొబైల్‌ విడిభాగాలపై 15శాతం కంటే తక్కువ పన్నులు ఉండేలా చూస్తూ ఉంటుంది. ఆరేళ్లలో అమెరికా నుంచి 1.2ట్రిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులను చేసుకొంటుంది.