Asianet News TeluguAsianet News Telugu

ఉర్జీత్ నిష్క్రమణ...మనసు చంపుకుని పనిచేయలేక

నిబంధనలకు, స్వయంప్రతిపత్తికి భిన్నంగా తాను వ్యవహరించలేనని పరోక్షంగా ఆర్బీఐ గవర్నర్ గా రాజీనామా చేసిన ఉర్జిత్ పటేల్ తేల్చేశారు. తొలినుంచి మౌనంగా ఉంటూనే పనులన్నీ సజావుగా చక్కబెట్టుకుంటూ వెళుతున్న పటేల్ దూకుడుకు కళ్లెం వేయాలని కేంద్రం చూసింది. కానీ పరిస్థితులు చేయి దాటిన తర్వాత వ్యక్తిగత కారణాల పేరుతో వైదొలిగి.. రఘురామ్ రాజన్ కంటే ఎక్కువ ప్రతిష్టే తెచ్చుకున్నారు ఉర్జిత్.

Urjit Patel, the 'Neelakantha' who finally said no to poison
Author
Delhi, First Published Dec 11, 2018, 7:06 AM IST

చివరి క్షణం వరకు రాజీనామా సంగతి బయటకు పొక్కకుండా తనదైన శైలిలో వ్యవహరించిన ఉర్జిత్ పటేల్ కెన్యాలో జన్మించారు. ఉర్జిత్‌పటేల్‌ ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆర్థిక వేత్తగా గుర్తింపు సాధించారు.

ఆయన ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించడానికి ముందు డిప్యూటీ గవర్నర్‌గా కూడా విధులు నిర్వహించారు. ద్రవ్యోల్బణం కట్టడిలో కీలక పాత్ర పోషించారు. ‘ఆయన దేశానికి చాలా అవసరం’ ఇది ఉర్జిత్‌ పటేల్‌ భారత్‌ పాస్‌పోర్టు దరఖాస్తుకు నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సిఫారసు చేశారు.

బ్యాంకుల్లో మొండిబకాయిల నిబంధనలను సవరించాలని ప్రభుత్వం కోరింది. కానీ ఆయన దానిని నిర్మొహమాటంగా తిరస్కరించారు. దీంతో భారీగా బ్యాంకుల సొమ్ము ఎగవేసిన పెద్దపెద్ద కార్పొరేట్‌ దిగ్గజాల ఆస్తులను కూడా వేలం వేసి సొమ్ము వసూలు చేశారు. కొంచెం చూసీ చూడనట్లు పోవాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆయన ఏ మాత్రం ఖాతరు చేయలేదు.

మొండిబాకీలతో కుదేలవుతున్న 11 బ్యాంకులను ప్రామ్ట్‌ కరెక్టివ్‌ యాక్షన్‌ కిందకు చేర్చడంలో ఏమాత్రం వెనుకాడలేదు. దీంతో ఈ బ్యాంకులు భారీగా అప్పులు ఇవ్వడానికి వీల్లేకుండా పోయింది. వ్యవస్థలోకి నిధుల ప్రవాహం తగ్గుతుందని ప్రభుత్వం కొంత ఒత్తిడికి గురైంది. బ్యాంకుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని పటేల్‌ మాత్రం వెనక్కి తగ్గలేదు.

91రోజులు దాటిన ఏ బకాయి అయినా వదిలి పెట్టవద్దని ఆర్‌బీఐ ఫిబ్రవరి 12 జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. గడువు దాటిన బకాయిల విషయంలో బ్యాంకులు వెంటనే వసూలు ప్రక్రియను మొదలు పెట్టాలని పేర్కొంది.

ఇది ఆర్‌బీఐకు ప్రభుత్వంతో మళ్లీ విభేదాలను తీసుకొచ్చింది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు అనుకూలంగా నిబంధనలను సడలించాలని ప్రభుత్వం కోరింది. కానీ ఆర్‌బీఐ తన వ్యతిరేకతను వ్యక్తం చేసింది. దీంతో పటేల్‌ను సాగనంపాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించుకున్నది.

ఈ నెల ఐదో తేదీన జరిగిన ఆర్బీఐ బోర్డు సమావేశంలో సామరస్య పూర్వక పరిష్కారం లభించిందని అంతా భావించారు. కానీ తన వైఖరి మార్చుకోలేదని ఉర్జిత్ పటేల్ తన రాజీనామా ద్వారా రుజువు చేసుకున్నారు. ఆర్బీఐ స్వతంత్రతకే కట్టుబడి ఉన్నట్లు తేల్చేశారు. 

రెండేళ్ల క్రితం కేంద్రం అమల్లోకి తెచ్చిన నోట్ల రద్దును ఉర్జిత్ పటేల్ సమర్థించారని అంతా అనుకున్నారు. మౌనంగా పని చేస్తూ ముందుకు వెళ్లే ఉర్జిత్.. అంతకుముందు గవర్నర్ గా పని చేసిన రఘురామ్ రాజన్ కంటే ఎక్కువ ప్రతిష్టే సంపాదించుకున్నారు.

పటేల్‌ కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీంతోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డుపై మరింత పట్టు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. బ్యాంకింగ్‌ రంగంలో ఎటువంటి నిర్వహణ లోపాలను ఉపేక్షించమనే సందేశాన్ని ఇవ్వగలిగారు.

ముఖ్యంగా బ్యాంకుల మొండి బకాయిలను దాచిపెట్టడం వంటి అంశాలను ఏమాత్రం క్షమించలేదు. పటేల్‌ దూకుడు దెబ్బకు యాక్సిస్‌, ఐసీఐసీఐ, యస్ ‌బ్యాంక్‌ల అత్యున్నత నిర్వాహక బృందం మారిపోక తప్పలేదు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేసిన ఉర్జిత్ పటేల్  యేల్స్‌ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకొన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో పటేల్‌కు 2000 నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

అప్పట్లో ఆయన గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేశారు. రిలయన్స్‌ వంటి సంస్థల వ్యాపార వృద్ధికి కీలక సేవలు అందించారు. ఐఎంఎఫ్‌లో ది ఎకనమిస్ట్‌ ప్రాజెక్టులో భారత్‌, అమెరికా, బహ్‌మాస్‌, మయన్మార్‌ డెస్క్‌ల్లో పనిచేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios