Union Budget 2024: మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎంతంటే...
బడ్జెట్ అనగానే లక్షల కోట్ల వ్యవహరంగానే మనకు తెలుసు. వేలకోట్ల పెట్టుబడులు, ఆదాయం, అప్పులు, సర్దుబాట్లు కనిపిస్తుంటాయి. మరి మొట్టమొదటి బడ్జెట్ ఎన్ని కోట్లు తెలుసా?
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఈ టర్మ్ పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురువారం కేంద్రఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో ఈ కేంద్ర బడ్జెట్ ఎప్పుటినుంచి మొదలయ్యింది? మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? ఎంత అంచనాలు వేశారు.. ఒక్కసారి గమనిస్తే..
స్వతంత్ర భారతదేశం, మొదటి యూనియన్ బడ్జెట్‌ను 26 నవంబర్ 1947న ఆర్. కె.షణ్ముఖం చెట్టి సమర్పించారు. ఈ బడ్జెట్ లో
మొత్తం ఆదాయాలు - రూ. 171.15 కోట్లు
మొత్తం వ్యయం - రూ. 197.29 కోట్లు
ద్రవ్య లోటు - రూ.24.59 కోట్లు
రక్షణ శాఖకు - రూ. 92.74 కోట్లు
ఆదాయపు పన్ను ద్వారా వచ్చే ఆదాయం - రూ.119 కోట్లు
గా సమర్పించారు.
union budget: మందుల ధర తగ్గుతుందా.. ? ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంచనాలు ఇలా..
ఇక 1950 వరకు బడ్జెట్ పేపర్ల ప్రింటింగ్ అంతా రాష్ట్రపతి భవన్‌లోనే జరిగేది. కానీ ఆ తరువాత బడ్జెట్ పత్రాలు లీక్ అవ్వడంతో.. ప్రింటింగ్ వేదికను న్యూఢిల్లీలోని మింటో రోడ్‌లోని ప్రెస్‌కి మార్చవలసి వచ్చింది. 1980లో, ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యాలయం ఉన్న నార్త్ బ్లాక్‌లో ప్రభుత్వ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి అక్కడే బడ్జెట్ ముద్రణ జరుగుతుంది.
1959-61 నుండి 1963-64 ఆర్థిక సంవత్సరాలకు యూనియన్ బడ్జెట్‌లు, 1962-63 మధ్యంతర బడ్జెట్ లను మొరార్జీ దేశాయ్ సమర్పించారు. మొరార్జీ దేశాయ్ రెండుసార్లు ఫిబ్రవరి 29న బడ్జెట్ సమర్పించారు. అది 1964, 1968తలో. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ రోజు మొరార్జీ దేశాయ్ పుట్టిన రోజు. బర్త డే రోజున కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఏకైక ఆర్థిక మంత్రిగా కూడా మొరార్జీ దేశాయ్ రికార్డ్ నెలకొల్పారు.
మొరార్జీ దేశాయ్ తన మొదటి టర్మ్ లో ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను.. ఆ తరువాత రెండోసారి పదవీకాలంలో మూడు బడ్జెట్‌లను, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రిగా, భారతదేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సమర్పించారు. మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత, అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వహించారు. ఆ సమయంలో అలా ఆమె ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు.
ఇక 1977లో సమర్పించిన మధ్యంతర బడ్జెట్ కోసం హిరూభాయ్ ఎం. పటేల్, అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇది కేవలం 800 పదాలతో ఉంది.
అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 1, 2020న కేంద్ర బడ్జెట్ సమర్పిస్తూ నిర్మలా సీతారామన్ చేశారు. ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇప్పటివరకు ఇదే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం. అలా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డును నిర్మలా సీతారామన్ పేరిట ఉంది.