న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన పోషక పానీయాల బ్రాండ్లు హార్లిక్స్‌, బూస్ట్‌.. యూనిలీవర్‌ సొంతం కానున్నాయి. గ్లాస్కో స్మిత్‌ క్లైన్‌ (జీఎస్‌కే) పీఎల్‌సీకి చెందిన ఆసియా హెల్త్‌ ఫుడ్‌ డ్రింక్స్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు ఆంగ్లో-డచ్‌ దిగ్గజం యూనిలీవర్‌ ప్రకటించింది. తద్వారా భారత్‌తోపాటు ఆసియాలోని మరో 20 మార్కెట్లలోని జీఎ్‌సకే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారం యూనిలీవర్‌ పరం కానున్నది. హార్లిక్స్ బ్రాండ్‌ను కైవసం చేసుకునేందుకు నెస్లే, యూనీలివర్ మధ్య పోటాపోటీ సాగింది. శీతల పానీయ సంస్థ కోకాకోలా కూడా పోటీ పడింది. చివరకు యూనీలీవర్‌దే‌పై చేయి అయ్యింది.

ఈ ఒప్పందం విలువ 310 కోట్ల (దాదాపు రూ.27,750 కోట్లు) పౌండ్లు.  ఈ ఒప్పందంలో భాగంగా యూనిలీవర్‌కు చెందిన భారత వ్యాపార విభాగం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌)లో జీఎస్కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ ఇండియా (జీఎస్కే సీహెచ్‌) విలీనం అవుతుంది. షేర్ల మార్పిడితో జరిగే విలీనానికి హెచ్‌యూఎల్‌ బోర్డు కూడా ఆమోదం తెలిపింది.
 
రూ.10 విలువ కలిగిన జీఎస్‌కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ చెందిన ఒక్కో షేర్‌కు రూపాయి ముఖ విలువ కలిగిన 4.39 హెచ్‌యూఎల్‌ షేర్లను కేటాయిస్తారు. తద్వారా జీఎస్‌కే మొత్తం వ్యాపారం రూ.31,700 కోట్లకు చేరుతుంది. నియంత్రణ సంస్థలు, వాటాదారుల ఆమోదంతోపాటు ఇతర ఆమోదాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ ఏడాది కాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. విలీనం తర్వాత హెచ్‌యూఎల్‌లో జీఎస్‌కే పీఎల్‌సీకి 5.7 శాతం వాటా లభిస్తుంది. హెచ్‌యూఎల్‌లో యూనిలీవర్‌ వాటా 5.3 శాతం తగ్గి 61.9 శాతానికి పరిమితం అవుతుంది.
 
హార్లిక్స్‌ బ్రాండ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్‌ డ్రింక్‌ సంస్థ నెస్లే, శీతల పానీయాల దిగ్గజం కోకా కోలా కూడా ప్రయత్నించాయి. నెస్లే, యూనిలీవర్‌ మధ్యే పోటీ నడిచింది. చివరికి నెస్లే కంటే అధిక ధరకు బిడ్‌ వేయడం ద్వారా జీఎస్కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ను యూనిలీవర్‌ సొంతం చేసుకున్నది.
 
భారత హెల్త్‌ డ్రింక్‌ మార్కెట్‌లో జీఎస్‌కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌దే మెజారిటీ వాటా. ప్రస్తుతం భారత మార్కెట్లో జీఎస్కే హార్లిక్స్‌, బూస్ట్‌, వివా, మాల్టోవా బ్రాండ్లతో హెల్త్‌ డ్రింకులను విక్రయిస్తోంది. భారత్‌లో హార్లిక్స్‌ బ్రాండ్‌ది సుదీర్ఘ చరిత్ర. జీఎస్కే ఆసియా టర్నోవర్‌లో ఈ బ్రాండ్‌దే 90 శాతం వాటా. ప్రస్తుతం భారత్‌లో నంబర్ వన్ హెల్త్‌ డ్రింక్‌ బ్రాండ్‌. యూరో మానిటర్‌ ఇంటర్నేషనల్‌ అనే సంస్థ ఇండియాలో పోషక పానీయాల మార్కెట్‌ రూ.7,873 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
 
కంపెనీకి ముఖ్యమైన మార్కెట్లలో భారత్‌ కూడా ఒకటని జీఎస్కే పీఎల్‌సీ అంటోంది. ఇండియాలో ఓవర్‌ ది కౌంటర్‌ (ఓటీసీ), ఓరల్‌ హెల్త్‌ బ్రాండ్ల విభాగాల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపింది. ప్రస్తుతం జీఎస్కే విభాగాల్లో క్రోసిన్‌ మాత్రలతోపాటు ఈనో, సెన్సోడైన్‌ టూత్‌పేస్ట్‌ను విక్రయిస్తోంది. తాజా ఒప్పందం పూర్తయ్యాక జీఎస్‌కేకు చెందిన ఓటీసీ, ఓరల్‌ హెల్త్‌ బ్రాండ్లను ఐదేళ్ల కాలానికి హెచ్‌యూఎల్‌ పంపిణీ చేయనున్నది. ప్రస్తుతం ఈ బ్రాండ్లను జీఎస్కే ఇండియా డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది.
 
హెచ్‌యూఎల్‌తోపాటు జీఎస్‌కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ సంస్థల షేర్లు బాగా పుంజుకున్నాయి. సోమవారం బీఎస్ఈలో హెచ్‌యూఎల్‌ షేర్ల ధర 4.12 శాతం ఎగబాకి రూ.1,825.90 వద్దకు చేరుకుంది. జీఎస్కే కన్స్యూమర్‌ హెల్త్‌కేర్‌ షేర్ 3.75 బలపడి రూ.7,542.85 వద్దకు పెరిగింది.
 
ఈ వ్యూహాత్మక విలీనం ద్వారా దేశంలోని గొప్ప బ్రాండ్లు మా పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నాయని హెచ్‌యూఎల్ చైర్మన్ కం సీఈఓ సంజీవ్ మెహతా తెలిపారు. విలీనం తర్వాత సంస్థ ఫుడ్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ వ్యాపారం టర్నోవర్‌ రూ.10,000 కోట్ల మైలురాయిని అధిగమించనున్నది. దీంతో కంపెనీకి చెందిన ఫుడ్‌ అండ్‌ రిఫ్రెష్మెంట్ వ్యాపారం దేశంలోనే అతిపెద్ద ఎఫ్‌ అండ్‌ ఆర్‌ వ్యాపారాల్లో ఒకటిగా నిలవనున్నదని  సంజీవ్‌ మెహతా తెలిపారు. 
 
జీఎస్‌కే ఆదాయంతోపాటు భారత వినియోగదారుల ఆరోగ్యానికి సైతం హార్లిక్స్‌ బ్రాండ్‌ దశాబ్దాల పాటు ఎంతగానో దోహదపడిందని జీఎస్కే సీఈో ఎమ్మా వామ్లె చెప్పారు. యూనిలీవర్‌ దాని భవిష్యత్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని నమ్ముతున్నామని, ఈ ఒప్పందం ద్వారా సమకూరిన నిధులను గ్రూపు ఫార్మా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడంతోపాటు ఇతర ప్రాధాన్యాల కోసం వినియోగించుకుంటామని   ఎమ్మా వామ్ల్సె తెలిపారు.