రైల్వే ప్లాట్ ఫాంపై ఎల్లో లైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఇది దాటితే ప్రమాదమే
మీరు ట్రైన్ లో ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారా? అయితే రైల్వే ప్లాట్ ఫాం మీద ఎలాంటి నిబంధనలు పాటించాలో మీకు తెలుసా? ఈ రూల్స్ తెలియకపోతే మీరు ప్లాట్ ఫాం పై ఉన్నా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ రూల్స్ తెలుసుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఎల్లో లైన్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి.
మీరు గమనిస్తే రైల్వే ప్లాట్‌ఫాంపై రెండు రంగుల్లో బ్రిక్స్ వేసి ఉంటారు. అవి రెడ్ కలర్, ఎల్లో కలర్. ఈ రెండు రంగులు ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసినవి. ఇందులో ఎల్లో కలర్ లైన్ అర్థం ఏమిటంటే ప్రయాణికులు రైలు ఎక్కడానికి వచ్చినప్పుడు ఎల్లో కలర్ లైన్ కు వెనుక ఉండాలి. ఆ లైన్ దాటి రెడ్ కలర్ ఉన్న చోట ఉండకూడదు. రెడ్ కలర్ లైన్ ప్రమాదాన్ని సూచిస్తుంది.
రైల్వే ప్లాట్ ఫాంపై ఎరుపు, పసుపు రంగులు ఎందుకుంటాయి
ఇండియాలో మీరు ఏ రైల్వే ప్లాట్ ఫాం చూసినా రైల్వే ట్రాక్ పక్కనే ఎరుపు, పసుపు రంగుల్లో బ్రిక్స్ తో నిర్మించిన వెడల్పైన లైన్లు ఉంటాయి. వీటి అర్థం ఏంటంటే.. ట్రైన్ ట్రాక్ మీదకు వచ్చినప్పుడు రెడ్ కలర్ లో ఉన్న చోట ప్రయాణికులు నిలబడకూడదు. ఎల్లో లైన్ కు వెనుక వైపు నించోవాలి. అలా కాకుండా రెడ్ కలర్ లైన్ లో నిలబడితే రైలు వేగానికి మీరు ముందుకు పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి రైలు కింద కూడా పడిపోతారు. ఇలాంటివి జరగకుండా ఉండటానికి కచ్చితంగా రెడ్, ఎల్లో లైన్ల గురించి తెలుసుకొని రూల్స్ పాటించాలి.
బెలోని ఫార్ములాకు రైల్వే ప్లాట్ ఫాం కు సంబంధం ఏమిటి
ప్రయాణికుల భద్రత కోసమే రైల్వే శాఖ రైల్వే ప్లాట్ ఫాం లపై రెడ్, ఎల్లో కలర్ లో వెడల్పైన లైన్లు ఏర్పాటు చేస్తుంది. దీని వెనుక సైన్స్ కు చెందిన కారణం ఒకటి ఉంది. బెలోని ఫార్ములా ప్రకారం రైలు పట్టాలపై వేగంగా వెళ్లేటప్పుడు దాని చుట్టూ వాక్యూమ్(శూన్యత) ఏర్పడుతుంది. ఇది రైల్వే ప్లాట్ ఫాంపై వెళుతున్నప్పుడు కూడా ప్లాట్ ఫాం పై ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీలో ప్రయాణికులు ఉంటే రైలు వారిని తన వైపుకు లాగేసుకుంటుంది. దీంతో ప్రమాదం జరిగి మీరు తీవ్రంగా గాయపడతారు. ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదం జరగొచ్చు. అందుకే రైల్వే అధికారులు రెడ్ కలర్ లో వెడల్పైన పెద్ద గీత ఏర్పాటు చేస్తారు. అంటే ప్లాట్ ఫాంపై రైలు వెళుతున్నప్పుడు ప్రయాణికులు ఎవరూ రెడ్ కలర్ లో నిలబడటం, కూర్చోవడం చేయకూడదు. కచ్చితంగా ప్లాట్ ఫాంపై ఎల్లో కలర్ కు దూరంగా నిలబడాలి.
రైల్వే ప్లాట్ ఫాంపై ప్రమాదాలు
రైలులో సీటు సంపాదించాలన్న కంగారులో చాలా మంది రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ఎక్కేస్తుంటారు కదా. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. పొరపాటున జరితే కచ్చితంగా రైల్వే ట్రాక్ కు, ప్లాట్ ఫాం కు మధ్య పడిపోతారు. ఇప్పటికే ఇలాంటి ప్రమాదాలు ప్రతి రోజూ ఏదోఒక చోట జరుగుతూనే ఉంటున్నాయి.
అదేవిధంగా టైం అయిపోతుందని రైలు ఆగకుండానే కొందరు ప్లాట్ ఫాం పైకి దిగేస్తుంటారు. ఇది కూడా ఎంతో ప్రమాదకరం. రైలు వేగాన్ని బట్టి సరిగ్గా దిగకపోతే జారి పడి గాయాలవుతాయి. దిగే వాళ్లకు పోటీగా ఎక్కే వాళ్లు కూడా ఉంటారు. వారి వల్ల ఒకరికొకరు ఢీకొని ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
రైల్వే ప్లాట్ ఫాంపై ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు
ప్రయాణికులు తప్పకుండా రైల్వే అధికారులు సూచించిన నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా రైలు వచ్చి ఆగిన తర్వాత మాత్రమే దాని దగ్గరకు వెళ్లాలి. ఎల్లో లైన్ దాటకుండా ఆ లైన్ కు అవతలి వైపు మాత్రమే ఉండాలి. రైలు ప్లాట్ ఫాం పైకి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ రెడ్ కలర్ లైన్ లోకి రాకూడదు. రైలు ప్లాట్ ఫాంపై పూర్తిగా ఆగిన తర్వాత మాత్రమే ఎక్కాలి. రన్నింగ్ లో ట్రైన్ ఎక్కడం, దిగడం చేయకూడదు.
రైల్వే ప్లాట్ ఫాం పై రూల్స్ పాటించకపోతే ఫైన్ ఎలా వేస్తారు
రైల్వే ప్లాట్‌ఫాంలపై రూల్స్ ఉల్లంఘిస్తే ప్రయాణికులకు ఫైన్ వేస్తారు. ముఖ్యంగా రైల్వే సిబ్బంది ఇచ్చిన సూచనలు పాటించకపోతే భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. రైలు ప్లాట్‌ఫాంపై ఉండగా ఎల్లో లైన్‌ను దాటడం ప్రమాదకరం. దీనిని ఉల్లంఘించినప్పుడు రూ.500 వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. టిక్కెట్ లేకుండా ప్లాట్‌ఫాంలో ఉండటం లేదా రైల్లో ప్రయాణించడం అత్యంత కఠినమైన నేరంగా పరిగణిస్తారు. దీనికి ఫైన్ రూ.250 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. అలాగే అదనంగా రైలు టిక్కెట్ ధరను చెల్లించాలి. రైలు దగ్గరికి వస్తున్న సమయంలో రక్షణ సూచనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి.