Twitter CEO పరాగ్ అగర్వాల్ తమ చేతుల్లోంచి ఈ ఆన్ లైన్ సోషల్ ప్లాట్ ఫాం ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన పరిణామం పై చాలా విచారంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పరాగ్ అగర్వాల్ పలు ప్రశ్నలు వేయగా, అందుకు పరాగ్ కాస్త విచారంగానే సమాధానం చెప్పారు. ముఖ్యంగా కంపెనీ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టెస్లా సహ వ్యవస్థాపకుడు. అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‌ను కొనేశాడు. కానీ ఈ 44 బిలియన్ డాలర్ల డీల్ ఖరారైన తర్వాత, ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కి మాత్రం ఈ డీల్ ఏ మాత్రం నచ్చలేదు. కంపెనీ భవిష్యత్తు అంధకారమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) పరాగ్ అగర్వాల్ సోమవారం టౌన్ హాల్‌లో ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఎలాన్ మస్క్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, 'ఈ సోషల్ మీడియా సంస్థ భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలోకి ప్రవేశించిందని, డీల్ పూర్తయిన తర్వాత ఈ ప్లాట్‌ఫాం ఎటువైపు వెళ్తుందో తెలియదని, ప్రస్తుతం ఈ కంపెనీ ఓ బిలియనీర్ చేతిలో ఉంది. అయితే, కంపెనీ తన ఉద్యోగులకు ఒక నోటీసును విడుదల చేసింది, త్వరలో ట్విట్టర్ కొత్త యజమాన్యం అందరినీ సమావేశం ద్వారా కలవనుందని పేర్కొంది. ఈ సమావేశంలోనే ఎలాన్ మస్క్ ఉద్యోగుల ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వనున్నారు.

ఉద్యోగుల తొలగింపుపై సర్వత్రా భయం...
ఉద్యోగులతో సంభాషణ సందర్భంగా పరాగ్‌కు పలు సమస్యలపై ఉద్యోగుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. వీటిలో ఒకటి ఉద్యోగుల తొలగింపులు, కంపెనీ బోర్డులో మార్పులకు సంబంధించినది. అయితే దీనిపై పరాగ్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇక గతేడాది ట్విటర్‌లో నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ వస్తారా? అనే ప్రశ్నపై పరాగ్ మాట్లాడుతూ, ఒప్పందం ఖరారైన తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్ ఏ దిశలో వెళ్తుందో మాకు తెలియదు అంటూ ముక్తాయింపునిచ్చారు. 

మస్క్‌తో తదుపరి చర్చలు జరిగినప్పుడల్లా ఈ ప్రశ్నను తప్పకుండా లేవనెత్తుతానని ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం లేఆఫ్‌ల వంటి ఏ ప్లాన్‌పైనా ఎటువంటి ప్రణాళికలను పరిగణనలోకి తీసుకోవడం లేదని కూడా ఆయన చెప్పారు. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు బ్రెట్ టేలర్ మాట్లాడుతూ.. ‘తమ టీమ్ సామర్థ్యాలను మరింత పెంచేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుంది. దీని తర్వాత కూడా కంపెనీ విజయం ఖచ్చితంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఒప్పందం అనంతరం పరాగ్ ట్వీట్ చేశారు
కంపెనీ ప్రస్తుత CEO పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ బోర్డ్ సభ్యుడు బ్రెట్ టేలర్ చేసిన ట్వీట్‌కి ప్రతిస్పందనగా ఇలా వ్రాశారు, - ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌కు ఒక ప్రయోజనం, ఔచిత్యం ఉంది, ఇది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. తమ బృందం గురించి మేము చాలా గర్విస్తున్నాము, నాకు ఎన్నడూ ముఖ్యమైనది కాని పని నుండి ప్రేరణ పొందాము. ఆయన చేసిన ఈ ట్వీట్‌పై అనేక అర్థాలు వెలికి తీస్తున్నారు. పరాగ్ ట్విట్టర్‌ను మస్క్‌కి విక్రయించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు.