TATA group: రతన్ టాటాకు ఎంతో సన్నిహితుడుగా మెహ్లీ మిస్త్రీ పేరుపొందారు. అయితే టాటా ట్రస్టుల నుండి తన ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ లో పరిస్థితి మరింత దిగజారినట్టు అర్థమవుతున్నాయి.
టాటా సంస్థల అధిపతి, వ్యవస్థాపకుడు రతన్ టాటా మరణించి ఏడాది గడుస్తోంది. రతన్ టాటా జీవించి ఉన్నంతకాలం టాటా సంస్థలలో ఎలాంటి గొడవలు లేవు. కానీ ఆయన మరణించిన తర్వాత ఆ గ్రూపులో అనేక వివాదాలు చుట్టుమట్టాయి. టాటా గ్రూప్ లో ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఉప్పు తయారీ దగ్గర నుంచి ఇనుము తయారీ దాకా అనేక పరిశ్రమలను ఇది నడుపుతోంది. ఆపిల్ కోసం భారత్ లో ఐఫోన్లను కూడా తయారు చేస్తున్నది టాటా కంపెనీయే. కానీ ఇప్పుడు అంతర్గత కలహాలతో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్ని నెలలగా ట్రస్టీల మధ్య బోర్డు రూమ్ లో యుద్ధమే జరుగుతోంది. ఆ గ్రూపులో అంతర్గత విభేదాలు వార్తలకెక్కాయి. మొదట 2016లోనే సైరస్ మిస్త్రీని తొలగించినప్పుడు తొలుత వివాదాలు చెలరేగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని తాత్కాలికంగా ఒక ఒప్పందం కుదిరి సమస్య సద్దుమణిగేలా చేసింది.
అయితే ఇప్పుడు బోర్డ్ రూమ్ లో నియామకాలు, నిధులు, ఆమోదాలు, కంపెనీల హోల్డింగులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ వంటి అంశాల్లో ట్రస్టీల మధ్య విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది. టాటా ట్రస్టులకు టాటా సన్స్ బోర్డులో ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు. వారి మధ్య సఖ్యత కుదరకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చినట్టు నిపుణులు చెబుతున్నారు. టాటా సన్స్ గ్రూపులో గొడవలు జరుగుతున్నప్పుడు కూడా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలం మాత్రం పొడిగించారు. గొడవలు బోర్డు అంతర్గత విషయాలని, ట్రస్టీల మధ్య వివాదాలని... దీంతో చైర్మన్ కి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఇప్పుడు టాటా గ్రూపులో మరొక కీలక పరిణామం జరిగింది.
మెహ్లీ మిస్త్రీ రాజీనామా
రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడుగా ఉన్న మెహ్లీ మిస్త్రీ తన ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాకు, అలాగే మిగతా ట్రస్టీలకు కూడా రాశారు. అందులో సంస్థను వివాదాలకు దూరంగా ఉంచాలని కోరారు. రతన్ టాటా వ్యవస్థాపక విలువలను కాపాడాలని ఆయన అందులో అభ్యర్థించారు. వేగంగా తీసుకునే నిర్ణయాలు, అంతర్గత విభాగాల వల్ల సంస్థ ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సంస్థ కన్నా ఎవరూ గొప్పవారు కాదని ఆయన లేఖలో చెప్పారు.
నిజానికి మెహ్లీ మిస్త్రీ పదవీకాలం గత ఏడాది అక్టోబర్ 27 మేలోనే ముగిసింది. అయితే అంతకుముందు అక్టోబర్ 17న బోర్డు సమావేశంలో ఆయనను జీవితకాల ట్రస్టీగా ఉంచాలని తీర్మానం వచ్చింది. అయితే ముగ్గురు ట్రస్టీలు అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఆ నిర్ణయం అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత మరింతగా వివాదాలు పెరిగిపోయాయి.
టాటా ట్రస్ట్ లో నోయల్ టాటా ఒక బలమైన వర్గంగా, మెహ్లీ మిస్త్రీ మరొక బలమైన వర్గంగా విడిపోయారు. వీరి మధ్యే అసలైన అంతర్గత వివాదాలు ఉన్నాయని వినిపిస్తోంది. కానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 156 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ లో ప్రతిసారీ వివాదాలు రావడం, ఆ సంస్థ ప్రతిష్టను దిగజారుస్తోందని రతన్ టాటా సన్నిహితులు బాధపడుతున్నారు. టాటా సన్స్ గ్రూప్ లో టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ 66 శాతం వాటాను కలిగి ఉంది. దీని కింద దాదాపు 400 కంపెనీలు ఉన్నాయి.
