ముంబై: ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ- నీతా అంబానీ కూతురు ఇషా అంబానీకి మెట్టినింటి వారు అద్భుతమైన.. ఎంతో ఖరీదైన కానుకే ఇచ్చారు. ఈషా అంబానీకి, పిరమాల్ గ్రూప్ వారసుడు ఆనంద్ పిరమాల్ గతేడాదే ఇంటివారైన సంగతి తెలిసిందే.

వారిద్దరికీ పెళ్లికానుకగా ఇషా అంబానీకి ఆమె అత్తింటి వారు ముంబై నగర పరిధిలోని వర్లీలోని 50వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల గలీటా భవనం బహుమతిగా అందించింది. దీని ఖరీదు సుమారు రూ. 450 కోట్లకు పై మాటేనని అంచనా. 

దక్షిణ ముంబైలోని వర్లీ ప్రాంతంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనాన్ని గతేడాదే పిరమాల్‌ కుటుంబసభ్యులు సొంతం చేసుకున్నారు. వారి అభిరుచికి అనుగుణంగా దాన్ని రీ మోడల్‌ చేయించుకున్నారు.

ప్రస్తుతం ఈ భవనం ఇంటీరియర్‌ డెకరేషన్ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. శుక్రవారం నుంచి ట్రెండ్ అవుతున్నాయి. ఈ భవనంలో వినియోగించిన ఫర్నిచర్‌ను విదేశాల్లో తయారు చేయించారు. 

ఔట్‌డోర్‌ స్విమ్మింగ్‌ ఫూల్‌, మల్టిపుల్‌ డైనింగ్‌ రూములు, సమావేశాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన హాళ్లు ఉంటాయి. భవనం ముందు భాగంలో డైమండ్‌ ఆకారంలో తీర్చిదిద్దిన విభాగంలో మూడు అంతస్తులు ఉంటాయి. ఇందులో ఒక స్విమ్మింగ్‌ఫూల్‌, ప్రార్థనా మందిరం ఉన్నాయి. ఇక ఈ భవనం ముందు భాగంలో 20 లగ్జరీ కార్లను పార్క్‌ చేసేందుకు వీలుగా సెల్లార్‌ను నిర్మించారు.