న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు జూన్‌లో 17.57 శాతం పెరిగి 27.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో అధిక ముడి చమురు రేట్ల కారణంగా దిగుమతుల భారం పెరిగింది. వాణిజ్య లోటు మూడున్నరేళ్ల గరిష్ట స్థాయి 16.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2014 నవంబర్‌ తర్వాత వాణిజ్య లోటు ఈ స్థాయికి ఎగియడం ఇదే తొలిసారి. 2014 నవంబర్‌లో వాణిజ్య లోటు 16.86 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. ఇక గతేడాది జూన్‌లో ఇది 12.96 బిలియన్‌ డాలర్లు.

కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్‌లో దిగుమతులు 21.31 శాతం పెరిగి. 44.3 బిలియన్‌ డాలర్ల ఆదాయం పెరిగింది. ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో చూసుకుంటే ఎగుమతులు 14.21 శాతం, దిగుమతులు 13.49 శాతం పెరిగాయి. ఎగుమతుల విలువ 82.47 బిలియన్‌ డాలర్లు కాగా, దిగుమతుల విలువ 127.41 బిలియన్‌ డాలర్లు. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 44.94 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

జూన్‌లో అత్యధికంగా పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, ఔషధాలు, వజ్రాభరణాలు, ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి. చమురు దిగుమతులు 56.61 శాతం ఎగిసి 12.73 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, పసిడి దిగుమతులు మాత్రం 3 శాతం క్షీణించి 2.38 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు టెక్స్‌టైల్స్, లెదర్, మెరైన్‌ ఉత్పత్తులు, పౌల్ట్రీ, జీడిపప్పు, బియ్యం, కాఫీ తదితర ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధి మందగించింది. దీనికి తోడు తాజాగా డాలర్‌తో పోటీ పడలేక రూపాయి రోజురోజుకు క్షీణిస్తుండడం కూడా దేశ వాణిజ్యంపై ప్రభావం కనబరుస్తోంది. దిగుమతులకు ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరంగా పరిణమించింది.

16 నుంచి ఐడీబీఐ సమ్మె


ఐడీబీఐ బ్యాంక్‌ అధికారులు కొందరు సోమవారం (జులై 16) నుంచి ఆరు రోజుల పాటు సమ్మె చేసేందుకు సిద్ధమయ్యారు. ఐడీబీఐ బ్యాంక్‌ అస్థిత్తాన్ని ప్రమాదంలో పడేస్తూ బ్యాంక్‌లో కీలకమైన 51 శాతం వాటాను జీవిత బీమా సంస్థకు (ఎల్‌ఐసీ) అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంతోపాటు పాటు 2012 నవంబర్ నుంచి తమ వేతనాల సవరణ జరగనందుకు నిరసనగా కొందరు అధికారులు సమ్మె చేసేందుకు సిద్ధమవుతున్నారని బ్యాంక్‌ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

వేతన సవరణ విషయంలో గత ఏడాది ఒకసారి సమ్మె నోటీసు ఇచ్చినా బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన హామీతో ఐడీబీఐ అధికారులు విరమించుకున్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీకి విక్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు 'ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌' ఇప్పటికే కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి తాజాగా మరో వినతిపత్రం అందించింది.