Asianet News TeluguAsianet News Telugu

జెట్‌‌ఎయిర్‌వేస్‌లో వేతనాల కోత ఖాయమే

నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్ వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం.

TPG Capital in talks to invest in Jet Airways
Author
New Delhi, First Published Aug 21, 2018, 11:40 AM IST

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’లో సిబ్బంది వేతనాల్లో కోత విధించడం ఖాయంగానే కనిపిస్తోంది. అలా చేయగలిగితే విమాన సర్వీసుల నిర్వహణ సజావుగా సాగుతుందని యాజమాన్యం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మరోవైపు నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్ వేస్ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌ సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. అయితే ఇంతవరకు ఒప్పందం ఖరారవ్వలదేని, ఈ సంప్రదింపులతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

ప్రయాణికుల ప్రోత్సాహ పథకం వాటా కొనుగోలుపై టీపీజీ నజర్


100 మిలియన్‌ డాలర్ల (రూ.700 కోట్ల)కు పైగా పెట్టుబడులు పెట్టేందుకు జెట్ ఎయిర్ వేస్, టీపీజీ క్యాపిటల్ మధ్య చర్చలు జరుగుతున్నా, ఇవి ప్రారంభదశలోనే ఉన్నాయని చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు టీపీజీ, జెట్‌ ఎయిర్‌వేస్‌ నిరాకరించాయి. నగదు లభ్యత సమస్యల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టింది. ఆర్థిక ఫలితాల వెల్లడిని కూడా వాయిదా వేయడంతో, సంస్థ షేర్లు మూడేళ్ల కనిష్ఠస్థాయికి దిగజారాయి. ఈ నేపథ్యంలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌, తరచు ప్రయాణించే వారికి ప్రోత్సాహకాల పథకం జెట్‌ ప్రివిలేజ్‌లో వాటా కొనుగోలు చేసేందుకు టీపీజీ దృష్టి సారించింది. దీనిపై సలహా కోసం మోర్గాన్‌ స్టాన్లీని నియమించిందని కూడా సమాచారం. ఈ పథకం విలువ 400 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,800 కోట్లు)గా లెక్కించే అవకాశముందనీ పేర్కొంది. ఇలాంటి ఒప్పందం కోసమే బ్లాక్‌స్టోన్‌తో జెట్‌ ఎయిర్‌వేస్‌ చర్చలు జరుపుతోంది. గత మార్చి ఆఖరుకు సంస్థ రుణాలు రూ.8,150 కోట్లకు చేరాయి.

మ్యూచువల్ ఫండ్స్‌పైనే చిన్న మదుపర్ల మోజు


మ్యూచువల్‌ ఫండ్‌లపై చిన్న మదుపర్లు సానుకూల వైఖరిని కొనసాగిస్తున్నారు. జులైలో క్రమానుగత పెట్టుబడులు (సిప్‌లు) ద్వారా రూ.7,554 కోట్లను మ్యూచువల్‌ పథకాల్లోకి చొప్పించడమే ఇందుకు నిదర్శనం. గతేడాది జులైలో వచ్చిన రూ.4,947 కోట్లతో పోలిస్తే ఈ పెట్టుబడులు 53 శాతం పెరిగాయి. భారత మ్యూచువల్‌ ఫండ్‌ల సంఘం (యాంఫీ) వద్ద లభ్యమవుతోన్న గణాంకాల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2017-18) సిప్‌ల ద్వారా ఫండ్‌ పథకాల్లోకి మదుపర్లు రూ.67,000 కోట్లు గుమ్మరించారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.43,900 కోట్లు చొప్పించారు. 

స్థిరాస్థి, పసిడి కంటే మ్యూచువల్ ఫండ్స్‍పైనే మదుపర్ల ఆసక్తి


స్థిరాస్తి, పసిడి వంటి సంప్రదాయ పెట్టుబడుల కంటే మ్యూచువల్‌ ఫండ్‌లపై మదుపర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ‘సిప్‌ల ద్వారా పెట్టుబడులకు ఆదరణ పెరిగింది. ఒడుదొడుకుల మార్కెట్లలో సిప్‌లు అత్యుత్తమైనవి. మార్కెట్‌ పడితున్నప్పుడు మదుపర్లు సిప్‌లు రద్దు చేసుకుంటున్నారు. మదుపర్లకు ఈ అంశంలో అవగాహన పెరగాలి’ అని షేర్‌ఖాన్‌, బీఎన్‌పీ పరిబాస్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ గ్రోనింగ్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మొదటి నాలుగు నెలల్లో సిప్‌ల ద్వారా రూ.29,102 కోట్లు వచ్చిచేరాయి. ప్రస్తుతం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల వద్ద 2.33 కోట్ల సిప్‌ ఖాతాలు ఉన్నాయి. 2018-19లో కొత్త 9.92 లక్షల ఖాతా జతచేరాయి.

వ్యూహం మారిన పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణ


వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణపై కేంద్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. ప్రజలకు తాయిలాలు అందించడంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు ఆయా సంస్థలను కట్టబెట్టే వ్యూహం ఉంది. అయితే ఇప్పటివరకు ఎయిర్‌ ఇండియా, హిందూస్థాన్‌ కాపర్‌, మెటలర్జికల్‌ లిమిటెడ్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక విక్రయాలను నిలిపేసి, ఒఎన్‌జిసి-హెచ్‌పిసిఎల్‌ నమూనా రీతిలో తన వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం చర్చలు కూడా ప్రారంభించింది. 

సట్లెజ్ జల వికాస్ లో వాటా కొనుగోలుకు ఎన్‌హెచ్‌పీసీ రెడీ


సట్లెజ్‌ జల వికాస్‌ నిగమ్‌ (ఎస్‌జెవిఎన్‌ఎల్‌)లో కేంద్రం వాటా 63.8శాతం కొనుగోలు చేయడానికి నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పిసి) సుముఖంగా వుందని సంబంధిత అధికారి తెలిపారు. అయితే, ఎన్‌హెచ్‌పిసి నిర్వహణ తీరును దృష్టిలో పెట్టుకుంటే అది మంచి అవకాశం కాదని భావిస్తున్నారు. దానికి బదులుగా ఎన్‌టిపిసికి అవకాశం కల్పిస్తే బాగుంటుందని కేంద్రం ఆలోచిస్తోంది. జల విద్యుత్‌ రంగంపై ప్రధానంగా దృష్టి సారించిన బృందం, అనుభవం ఎన్‌టిపిసికి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రు.80వేల కోట్ల మేరకు పెట్టుబడులను ఉపసంహరణ లక్ష్యం కాగా, కేవలం రూ.9000 కోట్ల మేరకు పెట్టుబడులను ఉపసంహరించిన నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. గతేడాది హిందూస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్‌లో కేంద్రం మెజారిటీ వాటాను ఒఎన్‌జిసి స్వాధీనం చేసుకోవడంతో రు.37వేల కోట్లను సేకరించడంతో రికార్డు స్థాయిలో లక్ష కోట్లను సమీకరించగలిగింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వాటాలను విక్రయించాలని భావిస్తోంది. నష్టాల్లో వున్న 12కిపైగా ప్రభుత్వ రంగ కంపెనీలు పెట్టుబడుల ఉపసంహరణ బాటలో వున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios