మీకు ఎలక్ట్రిక్ వెహికల్ ఉందా? ఇక్కడ చెప్పిన టిప్స్ పాటిస్తే మీ వెహికల్ బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది.

ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎంతోమందికి మొదటి ఛాయిస్ అవుతున్నాయి. పెట్రోల్ ధరలతో పోల్చితే వీటి ఛార్జింగ్ కి తక్కువ ఖర్చవుతుంది. సైలెంట్ డ్రైవింగ్, పర్యావరణానికి కూడా ఎలాంటి హానీ చేయని వెహికల్స్ ఇవి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ముఖ్యమైన భాగం బ్యాటరీ. దీనిని కాపాడుకోవడం చాలా అవసరం. ఈ టిప్స్ పాటిస్తే మీ వెహికల్ బ్యాటరీ ఎక్కువకాలం పనిచేస్తుంది.

1. మెల్లగా డ్రైవ్ చేయండి 

బ్యాటరీ వేగంగా ఖర్చు కాకుండా ఉండాలంటే యాక్సిలేటర్ మెల్లగా తిప్పాలి. కారైతే మెల్లగా యాక్సిలేటర్ పై కాలు పెట్టాలి. ఒక్కసారిగా వేగం పెంచడం వల్ల బ్యాటరీ పై ఒత్తిడి ఎక్కువవుతుంది. మెల్లగా స్టార్ట్ చేయడం వల్ల బ్యాటరీ జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.

2. ఉన్న ఛార్జింగ్ తో ఎంతదూరం వెళ్లగలరు 

ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మీ బైక్ ఒక్క ఛార్జ్‌తో ఎంత దూరం వెళ్తుందో ముందే తెలుసుకోండి. ప్రయాణానికి ముందే ఛార్జింగ్ ఫుల్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. మీరు వెళ్లే రూట్లో ఛార్జింగ్ స్టేషన్ ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. మీరు వెహికల్ తయారీ కంపెనీ యాప్ ద్వారా కూడా ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అనవసరంగా రోడ్డుపై బ్యాటరీ అయిపోకుండా ముందస్తుగా ప్లాన్ చేయడం మంచిది.

3. బ్యాటరీని కాస్త తక్కువగా ఛార్జ్ చేయండి 

బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేయడం మంచిది కాదు. అలాగే పూర్తిగా ఖాళీ అయ్యేంతవరకూ వాడకూడదు. సాధారణంగా 20% నుండి 80% మధ్య ఛార్జ్ స్థాయిలో ఉంచితే బ్యాటరీ లైఫ్ టైమ్ బాగుంటుంది. చాలా మంది రాత్రి ఛార్జింగ్ పెట్టేసి మర్నాడు ఉదయం లేచిన తర్వాత ఆఫ్ చేస్తారు. ఇది అస్సలు సరికాదు. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ వేడెక్కుతుంది. దీని వల్ల బ్యాటరీ కొన్ని రోజులకే దెబ్బతింటుంది. 

4. చలికాలంలో జాగ్రత్తలు పాటించండి 

చలికాలంలో బ్యాటరీ పనితీరు తగ్గిపోతుంది. చాలా తక్కువ ఉష్ణోగ్రతల్లో బ్యాటరీ పనిచేయడంలో స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే చలిలో బైక్‌ను ఓపెన్‌ ప్లేస్ లో పెట్టకూడదు. ఇంట్లో గ్యారేజ్‌లో పెట్టాలి. లేదా కవర్ వేసి ఉంచాలి. ఈ టిప్స్ పాటిస్తే ఏ ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ అయినా ఎక్కువ కాలం పనిచేస్తుంది.