Asianet News TeluguAsianet News Telugu

ఎంతో క్రేజీ మరి: 8 స్టార్టప్‌లతో 40 వేల మందికి ఉద్యోగాలు

వెంచర్ క్యాపిటల్స్‌గా పేరొందిన స్టార్టప్‌లు క్రమంగా భారతదేశ ఐటీ రంగంలో పురోగతి దిశగా అడుగులేస్తున్నాయి. 2011 నుంచి 2017 వరకు తొమ్మిది స్టార్టప్ లు మాత్రమే పురుడు పోసుకుంటే ఈ ఏడాదిలోనే 8 ఏర్పాటు కావడం వాటిపై పెరుగుతున్న మోజుకు నిదర్శనం. ఈ ఏడాదిలో 40 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి స్టార్టప్‌లు.

The year 2018 saw a rise of unicorns in indian start ups across verticals
Author
Mumbai, First Published Dec 26, 2018, 10:29 AM IST

రోజురోజుకు స్టార్టప్‌ల పట్ల క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. భారతదేశంలోని స్టార్టప్‌ల లావాదేవీలు నాటకీయ ఫక్కీలో పురోగతి సాధించాయి. 2011 నుంచి 2017 వరకు కేవలం తొమ్మిది స్టార్టప్ లు మాత్రమే ఏర్పాటైతే 2018లోనే ఎనిమిది స్టార్టప్‌లు ప్రారంభం అయ్యాయి.

ఈ స్టార్టప్‌ల చేరికతో భారత స్టార్టప్‌ల్లో పెట్టుబడుల విలువ ఒక బిలియన్ డాలర్ల (రూ.7000 కోట్లు) ఉంటుందని నాస్కమ్ అంచనా. ఆతిథ్య రంగంలో ఒయోరూమ్స్, ఫుడ్ డెలివరీలో జొమాటో, స్విగ్గి, రిటైలర్ మార్కెట్ ప్లేస్ విభాగంలో ఉడాన్, ‘ఎడ్యుకేషన్ - టెక్నాలజీ’లో బ్యుజు, ‘ఈ-పేమెంట్స్’లో పేటీఎం మాల్, సాఫ్ట్ వేర్ ప్రోగ్రామర్ విభాగంలో ఫ్రెష్ వర్క్స్, డిజిటల్ బీమాలో పాలసీ బజార్ స్టార్టప్ లు కొలువు దీరాయి. 

నవ్యతకు, నూతన ఆలోచనా విధానాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈ స్టార్టప్‌లు బడా వ్యాపారవేత్తలనే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిధుల సమీకరణలో చోటా, మోటా స్టార్టప్ సంస్థలు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఇట్టే అధిగమించేస్తున్నాయి. నిధుల కోసం పలు సంస్థలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) అంటూ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశిస్తున్నాయి. 

మరికొన్ని స్టార్టప్ సంస్థలు ఆ అవసరం లేకుండానే ఎన్నో స్టార్టప్‌లు వెంచర్ క్యాపిటల్ (వీసీ) ఫండ్స్ రూపంలో ఇప్పటికే ఉన్న తమ భాగస్వాముల నుంచి భారీగా నిధులను అందుకుంటున్నాయి. 

స్టార్టప్‌లపై పెరుగుతున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తూ ఈ ఏడాది ఐపీవోల కంటే వీసీ ఫండింగ్‌ల ద్వారానే నిధుల ప్రవాహం అధికంగా నమోదైంది. గతేడాది వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ ద్వారా స్టార్టప్‌లు 3.74 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకోగా, ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 697 డీల్స్ ద్వారా 6.55 బిలియన్ డాలర్ల (సుమారు రూ.44,940 కోట్లు)ను పొందాయి.

ఏడాదిలోపు స్టార్టప్‌ల్లో పెట్టుబడులు దాదాపు రెట్టింపు కావడం విశేషం. మరోవైపు 2017లో ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 11.88 బిలియన్ డాలర్లు (రూ.77,228 కోట్లు)గా ఉంటే, ఈ ఏడాది 4.97 బిలియన్ డాలర్ల (రూ.34,117 కోట్లు)కే పరిమితమయ్యాయి.

ఈ మొత్తం పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి సుమారు 25 సంస్థలు సేకరించాయని వీసీసీఎడ్జ్, డేటా రిసెర్చ్ వేదిక న్యూస్ కార్ప్ వీసీసర్కిల్ తెలిపాయి. 2016లో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ 3.2 బిలియన్ డాలర్లు, ఐపీవో నిధులు 4.01 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు పేర్కొన్నాయి. 

ఈ ఏడాది ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. తమ మదుపరి నాస్పర్స్ నుం చి వీసీ ఫండింగ్స్ ద్వారా ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను అందుకోగా, ఈ ఏడాదే స్విగ్గీ స్టార్టప్ క్లబ్‌లో చేరింది.

అలాగే ఈ ఏడాది ఆరంభంలో హాస్పిటాలిటీ చైన్ స్టార్టప్ ఓయో రూమ్స్ కూడా సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్, సికోయా క్యాపిటల్, లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్‌నర్స్ తదితర తమ మదుపరుల నుంచి 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పొందింది.

ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ తర్వాత భారత్‌లోనే అత్యధికంగా స్టార్టప్‌లు ఉన్నాయి. కాగా, భారత ఎకో సిస్టమ్‌లో ప్రతియేటా 1300 స్టార్టప్ లో జత కలుస్తున్నా.. కనీసం 300 మాయం అవుతున్నాయి. అవి నిలదొక్కుకోవడానికి మూడు నుంచి ఐదేళ్ల వ్యవధి పడుతోంది. స్టార్టప్ లు ఈ ఏడాది 40 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios