Asianet News TeluguAsianet News Telugu

అప్పుల ఊబిలో అనిల్.. ముందుచూపుతో ముకేశ్ ముందడుగు

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ముందుచూపుతో వ్యవహరిస్తూ దూసుకెళ్తుండగా, ఆయన తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం భిన్నంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ తోపాటు పలు సంస్థల విక్రయంపై ద్రుష్టిని కేంద్రీకరించారు.

The epic saga of how telecom felled one brother and is reinventing another
Author
Mumbai, First Published May 1, 2019, 11:45 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీ సోదరులిద్దరూ అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ పరస్పరం వ్యతిరేక దిశల్లో వెళుతున్నారు. ఒకరు ఆర్థిక పరమైన ఊబిలో చిక్కుపడిపోతూ ఉంటే మరొకరు ఆ ఊబి నుంచి బయటపడేందుకు ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. 

ఇటీవలే ఎరిక్సన్ బకాయిల చెల్లింపు విషయమై తమ్ముడు అనిల్‌ అంబానీని అన్న ముకేశ్ అంబానీ రంగంలోకి దిగి కోర్టు శిక్ష నుంచి తప్పించారు. అందుకు అన్నా వదినలు ముకేశ్ అంబానీ, నీతా అంబానీలకు అనిల్ అంబానీ ధన్యవాదాలు తెలిపారు కూడా. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముఖేష్‌ అంబానీ కంపెనీలను కొనుగోళ్లు చేస్తూ వ్యాపారాన్ని విస్తరిస్తూ ఉంటే.. మరోవైపు అనిల్‌ అంబానీ తన ఆధీనంలోని కంపెనీలను విక్రయానికి పెట్టేస్తున్నారు. 

పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు తన వ్యక్తిగత కంపెనీల రుణభారాన్ని కూడా తగ్గించుకుంటున్నారు. ఇందుకోసం కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా ఆస్తులను విక్రయిస్తుండగా మరికొన్ని చోట్ల రుణాలను బదలాయింపు చేస్తున్నారు.

గత నవంబర్‌లో క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ ముఖేశ్‌ అంబానీ సొంత కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ‌(ఆర్‌ఐహెచ్‌పీఎల్‌) రుణభారం అధికంగా ఉందని హెచ్చరించింది.

ఈ కంపెనీ అనుబంధ సంస్థలు జామ్‌నగర్‌లో నౌకాశ్రయాన్ని, హజీరాలో 2,200 మెగావాట్ల పవర్‌ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గుజరాత్‌ను కలిపే ఒక పైప్‌లైన్‌ కూడా దీనికి ఉంది. ఈ కంపెనీకి దాదాపు రూ.22వేల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయని క్రిసెల్‌ హెచ్చరించింది. 

దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డింగ్స్ ఈ అప్పుల భారాన్ని తగ్గించుకొనే పనిలో పడింది. ఆర్‌ఐహెచ్‌పీఎల్‌ అనుబంధ సంస్థ ఈస్ట్‌ వెస్ట్‌ పైప్‌లైన్‌ లిమిటెడ్‌కు చెందిన ఒక పైప్‌లైన్‌ ప్రాజెక్టును ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌కు రూ.13వేల కోట్లకు విక్రయించింది. ఇది కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌కు అనుబంధ సంస్థ. 

గత జూన్‌లో ఈడబ్ల్యూపీకు చెందిన పెట్టుబడుల విభాగాన్ని విడదీసింది. సిక్కా పోర్ట్స్‌ అండ్‌ టర్మినల్స్‌ను  రిలయన్స్ ఇండస్ట్రీస్ హోల్డింగ్ ఏర్పాటు చేసింది. దీనికి రూ.3,500 కోట్లు విలువైన నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లను బదిలీ చేసింది.

దీంతోపాటు జామ్‌నగర్‌ యుటిలిటీస్‌ అండ్‌ పవర్‌ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు అవసరమైన నిధులను సమకూర్చి విద్యుత్ ఉత్పత్తిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆర్‌ఐహెచ్‌పీఎల్‌కు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో దాదాపు 75.4 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి మార్కెట్‌ విలువ రూ.1.04లక్షల కోట్లు.

ఒక పక్క రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన పెట్రో కెమికల్‌ వ్యాపారంలో 25 శాతాన్ని సౌదీ దిగ్గజం అరామ్‌కోకు విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తద్వారా వీటి అప్పులను తగ్గించారు.

రిలయన్స్‌కు  ఉన్న రూ. 2.87లక్షల కోట్ల అప్పును తగ్గించుకొనేందుకు ఈ వాటాలను విక్రయిస్తోంది. ఈ డీల్‌ విలువ 10-15 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండవచ్చని అంచనా. 

మరోపక్క అనిల్‌ అంబానీ కష్టాలు ఇప్పుడిప్పుడే తీరేలా కనిపించడంలేదు. ఆయన సారథ్యంలోని కంపెనీలు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. స్పెక్ట్రం చెల్లింపుల్లో జాప్యం, రఫేల్‌ డీల్‌తో పన్ను మినహాయింపుల ఆరోపణలు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ కష్టాలతో అనిల్ అంబానీ సతమతమవుతున్నారు. 

తాజాగా అనిల్ అంబానీకి చెందిన రెండు నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థలకు దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ‘కేర్‌’ రేటింగ్‌ను తగ్గించింది. వీటిల్లో రిలయన్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ కమర్షియల్‌ ఫైనాన్సింగ్‌ లిమిటెడ్‌లు ఉన్నాయి.

ఈ రెండు కంపెనీలు తీసుకొన్న రుణాలను చెల్లించడంలో జాప్యం కావడంతో రేటింగ్‌ను కోల్పోయాయి. బీబీబీ+ నుంచి డీ గ్రేడ్‌కు రేటింగ్‌ తగ్గింది. త్వరలోనే ఈ కంపెనీలు రెండు ఆర్థికంగా తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయనడానికి ఈ రేటింగ్‌ను సంకేతంగా భావించాల్సి ఉంటుంది. 

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ పతనం తర్వాత ఎన్‌బీఎఫ్‌సీలను తీవ్రమైన నిధుల కొరత వేధిస్తోంది. ఈ ప్రభావం అడాగ్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీలపై కూడా పడింది. ఈ కంపెనీలు తాము ఇచ్చిన రుణాలను వేరే కంపెనీలకు విక్రయించి నిధులను సమీకరించాలని ప్రయత్నిస్తున్నాయి.

కానీ అది సాధ్యం కావడంలేదు. దీనికి తోడు రిలయన్స్‌ క్యాపిటల్‌కు కూడా కేర్‌ రేటింగ్‌ను తగ్గించడంతో షేరు దాదాపు 4శాతం పతనమైంది. ఇక్కడే కీలకమైన విషయం ఒకటి ఉంది. రేటింగ్‌ తగ్గిపోవడంతో ఈ మూడు కంపెనీలకు అప్పులు ఇచ్చిన ఫండ్‌ హౌసుల్లో ఆందోళన మొదలైంది.

ఆ సంస్థలు తమ నిధులను ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. అంతెందుకు.. అడాగ్‌కు చెందిన సొంత మ్యూచ్‌వల్‌ ఫండ్‌ విభాగమే ఆర్‌హెచ్‌ఎఫ్‌ఎల్‌, ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో పెట్టుబడులను తగ్గించుకోవాలని నిర్ణయించడం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios