రూ. 20 లక్షలకే టెస్లా కారు...అతి త్వరలోనే ఇండియన్ రోడ్లపై రయ్యిమని దూసెకెళ్లనున్న టెస్లా ఎలక్ట్రిక్ కార్..
టెస్లా కంపెనీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే టెస్లా అధికారులు భారత పర్యటనలో భాగంగా వారు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. అన్నీ కుదిరితే మేడిన్ ఇండియా టెస్లా కారు కేవలం 20 లక్షల రూపాయలకే మన దేశ రోడ్లపై రయ్ మనడం ఖాయంగా కనిపిస్తోంది.
టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ తన ప్రముఖ కార్ కంపెనీ టెస్లా ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేసేందుకు పెట్టుబడుల కోసం మోదీ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా (ToI) నివేదిక ప్రకారం, టెస్లా భారతదేశంలో ఏటా 5,00,000 ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) సామర్థ్యంతో కార్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. మరో విషయం ఏమిటంటే, భారతదేశంలో టెస్లా కారు ధర రూ. 20 లక్షల నుండి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. టెస్లాకు ఇప్పటికే చైనాలో ప్లాంట్ ఉంది. కంపెనీ ఇప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ఇతర మార్కెట్‌లకు తన వాహనాలను సరఫరా చేయడానికి ఎగుమతి స్థావరంగా భారతదేశాన్ని చూస్తోంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం “టెస్లా ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో మా వద్దకు వచ్చింది. ఈసారి ఈ చర్య సానుకూలంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. ఎందుకంటే ఇది స్థానిక స్థాయిలో తయారీ, ఎగుమతి రెండింటినీ కలిగి ఉంటుంది. నివేదికల ప్రకారం, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు, సానుకూల ఫలితం వస్తుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని వార్తా కథనం పేర్కొంది. సోలార్ పవర్, స్టేషనరీ బ్యాటరీ ప్యాక్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలతో సహా స్థిరమైన ఇంధన భవిష్యత్తు కోసం భారతదేశానికి బలమైన సామర్థ్యం ఉందని టెస్లా సీఈఓ అంతకుముందు చెప్పారు.
PM మోడీతో మస్క్ సమావేశం తర్వాత టెస్లా పెట్టుబడిపై కదలిక
ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మస్క్‌ను కలిశారు. సమావేశం అనంతరం మస్క్ ప్రధాని మోదీని ప్రశంసిస్తూ.. ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని అన్నారు. మోదీకి తన దేశం పట్ల చాలా శ్రద్ధ ఉందని, భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయనను కోరినట్లు మీడియా ప్రతినిధులతో మస్క్ తెలిపారు. టెస్లాతో పాటు, మస్క్‌కి చెందిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ ప్రొవైడర్ కంపెనీ స్టార్‌లింక్ కూడా భారత మార్కెట్లో తన ఉనికిని నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటోంది. అవసరమైన అనుమతుల కోసం కంపెనీ ఇప్పటికే సంబంధిత ప్రభుత్వ నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసింది.
టెస్లా కార్లకు బ్యాటరీ సరఫరాదారు Panasonic Energy భారత మార్కెట్లో ప్రవేశానికి సిద్దం..
టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించే ముందు తన అనుబంధ సంస్థలను బలోపేతం చేసే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన ఎలక్ట్రానిక్ కార్ల తయారీ దారు అయిన టెస్లా భారతదేశంలో తమ కార్లకు బ్యాటరీ సరఫరా చేసే తయారీ యూనిట్లను భారత్ లో పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంతో ఆయా సంస్థలను చర్చలు ప్రారంభించాల్సిందిగా బ్యాటరీ సరఫరాదారులను కోరింది. ఈ మేరకు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక రిపోర్ట్ చేసింది.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ చర్య చోటు చేసుకుంది.. టెస్లా కు చెందిన టాప్ బ్యాటరీ సరఫరాదారులలో ఒకటైన పానాసోనిక్ ఎనర్జీ భారతదేశంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని సంప్రదించింది. పానాసోనిక్ ఎనర్జీ ప్రెసిడెంట్, సీఈఓ కజువో తడనోబుతో పాటు కంపెనీ ప్రతినిధి బృందం ఈ నెల ప్రారంభంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమైందని ప్రభుత్వ సీనియర్ అధికారులు తెలిపారు.
దీనిపై, సీనియర్ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, "టెస్లా కు చెందిన ఎలక్ట్రానిక్స్ సరఫరా గొలుసు కంపెనీలు భారతీయ మార్కెట్‌ను అన్వేషించడం ప్రారంభించాయి." టెస్లా, దాని భాగస్వాములు తమ తయారీ యూనిట్‌ను భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు ఆయన తెలిపారు.