న్యూ ఢీల్లీ: సాఫ్ట్ వేర్ దిగ్గజం, భారతదేశపు నాల్గవ అతిపెద్ద ఔట్ట్‌సోర్సర్ విప్రో జనవరి 1 నుంచి దాదాపు 80 శాతం మంది ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు అధిక పనితీరు కనబరిచిన వారికి పదోన్నతులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

థియరీ డెలాపోర్ట్ నేతృత్వంలోని కంపెనీ జనవరి 1 నుండి జూనియర్ బ్యాండ్ (బి3 ఇంకా అంతకంటే తక్కువ) లోని అర్హతగల ఉద్యోగులకు వేతన పెంపు ఇవ్వనుంది. బి3 బ్యాండ్ ఉద్యోగులు మొత్తం 1.8 లక్షల మంది ఉద్యోగులలో 80% ఉన్నారు.

మిడ్-లెవల్ (సి 1 బ్యాండ్ ఇంకా అంతకంటే ఎక్కువ) లో అర్హతగల ఉద్యోగులందరికీ వచ్చే ఏడాది జూన్ 1 నుంచి జీతం పెరుగుదల లభిస్తుంది ఒక నివేదికలో పేర్కొంది.

ఆఫ్‌షోర్ ఉద్యోగులకు 6-8%, ఆన్-సైట్ సిబ్బందికి 3-4% వరకు పెంపు ఉంటుందని ప్రచురణలో పేర్కొంది. విప్రో సంస్థ తాజా వేతన పెంపుపై వ్యాఖ్యానించలేదు. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్‌-19 నేపథ్యంలో ఐటీ కంపెనీలు అప్రైజల్‌ సైకిల్‌కు సంబంధించి పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు.

also read భారతదేశ ఆర్థిక వ్యవస్థపై ఫిచ్ తాజా అంచనా.. ఊహించిన దానికంటే మెరుగైన పేరుగుదల.. ...

సాధారణంగా విప్రో జూన్‌ నుంచి ఇంక్రిమెంట్లను అమలు చేస్తుందని, అయితే సీ1 బ్యాండ్‌ ఉద్యోగులు ఒక పెంపును మిస్‌ అయినట్లు తెలియజేశారు. అయితే సంక్షోభ కాలంలోనూ తమ ఉద్యోగులు ప్రస్తావించదగ్గ పనితీరును చూపినట్లు విప్రో పేర్కొంది.

దీంతో  ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌- డిసెంబర్‌), క్యూ4(జనవరి-మార్చి)లలో బిజినెస్‌ మెట్రిక్స్‌ ఆధారంగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్‌ పే అమలు చేయనున్నట్లు విప్రో తెలిపింది.

బీ3 బ్యాండ్‌ వరకూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్‌ 1 నుంచి ప్రమోషన్లు ఇచ్చినట్లు విప్రో తెలియజేసింది. తద్వారా దాదాపు 7,000 మంది ఉద్యోగులు లబ్ది పొందినట్లు పేర్కొంది. 

2020 సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల్లో బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ నికర లాభం 3.15% పెరిగి రూ .2,465.7 కోట్లుగా నమోదైంది. విప్రో షేర్లు సోమవారం 0.65% తగ్గి రూ.358.45 వద్ద ముగిశాయి. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 46% రాబడిని ఇచ్చింది.