సైరస్ మిస్త్రీకి పట్టిన గతే .. రతన్ టాటాకి బెదిరింపు కాల్ , నిందితుడు ఎంబీఏ చదివిన మానసిక రోగి
ప్రముఖ పారిశ్రామికవేత్త , టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రతన్ టాటా ప్రాణాలకు ముప్పు పొంచి వందని .. లేని పక్షంలో ఆయనకు కూడా టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని అగంతకుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి హెచ్చరించాడు
ప్రముఖ పారిశ్రామికవేత్త , టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చింది. రతన్ టాటా ప్రాణాలకు ముప్పు పొంచి వందని .. లేని పక్షంలో ఆయనకు కూడా టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ లాగే అవుతుందని అగంతకుడు ముంబై పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రతన్ టాటా భద్రతను పెంచడంతో పాటు ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బెదిరింపు కాల్స్ కర్ణాటక నుంచి వచ్చినట్లు గుర్తించి, వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పుణెకు చెందిన వ్యక్తని.. ఇతను కొద్దిరోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయినట్లుగా తెలుస్తోంది. నిందితుడి పలు మానసిక అనారోగ్య సమస్యలు వున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
స్క్రిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధితో బాధపడుతున్న నిందితుడు ఎంబీఐ పట్టభద్రుడని పోలీసులు తెలిపారు. బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే టెక్నికల్, టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల సాయంతో పోలీసులు లొకేషన్‌ను గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తి నివాసాన్ని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అయితే అతను గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయినట్లుగా గుర్తించారు. దీనిపై నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. కాల్ చేసిన వ్యక్తి మానసిక ఆరోగ్య పరిస్ధితిని దృష్టిలో వుంచుకుని చట్టపరమైన చర్య తీసుకోకుండా అదుపులోనే వుంచుకున్నారు.
కాగా.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది.