టాటా మోటార్స్ అతిపెద్ద EV ఆర్డర్‌ను పొందింది, ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్ 25,000 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.  

దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్, క్యాబ్ అగ్రిగేటర్ ఉబర్‌కు భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం, టాటా మోటార్స్ ఉబెర్‌కు 25,000 ఎలక్ట్రిక్ వాహనాలను సరఫరా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఒప్పందం కింద, ఢిల్లీ NCR, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఫ్లీట్ ఆపరేటర్లతో భాగస్వామ్యంతో Uber టాటా మోటార్స్ యొక్క XPRES-T EVలను అమలు చేస్తుంది.

Uber, భారతదేశం దక్షిణాసియా అధ్యక్షుడు ప్రభ్‌జిత్ సింగ్ ఒక ప్రకటనలో, “భారతదేశంలో పొల్యూషన్ తగ్గించేందుకు Uber కట్టుబడి ఉందని, ఇందుకోసం టాటా మోటార్స్‌తో ఈ భాగస్వామ్యం చేసుకున్నామని, ఈ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన దశ అని, దేశంలో రైడ్‌షేరింగ్ ప్లాట్‌ఫారమ్, ఎలక్ట్రిక్ వాహన తయారీ దారు మధ్య జరిగిన అతిపెద్ద ఒఫ్పందం ఇదే అని సింగ్ అన్నారు. 

Uber 2024 నాటికి మాస్ ట్రాన్సిట్ లేదా మైక్రో మొబిలిటీలో 100 శాతం జీరో-ఎమిషన్ వాహనాలను నడుపుతామని ఇప్పటికే ప్రకటించింది. ఉబర్ తన కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుతామని ప్రకటించింన నేపథ్యంలో ఈ భాగస్వామ్యం తెరపైకి వచ్చింది. క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీతో టాటా మోటార్స్ కుదుర్చుకున్న రెండో అతిపెద్ద డీల్ ఇదే కావడం విశేషం. 

గత ఏడాది జూన్‌లో, టాటా మోటార్స్ 10,000 XPRES T EVలను సరఫరా చేసేందుకు గురుగ్రామ్‌కు చెందిన ఎలక్ట్రిక్ క్యాబ్ కంపెనీ బ్లూస్మార్ట్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో ఒప్పందం చేసుకుంది. ఉబెర్ కు మార్కెట్లో ప్రత్యర్థి అయిన Ola కూడా దాని బెంగుళూరు EV క్యాబ్ పైలట్ ట్రయల్‌లో భాగంగా 1,000 ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశ పెట్టాలని యోచిస్తోంది.

టాటా మోటార్స్ ఈ నెల నుంచి దశలవారీగా ఉబర్‌కు ఈ కార్లను సరఫరా చేయనుంది. అయితే, డీల్ ఎంత మొత్తం, అన్ని వాహనాలను ఎప్పుడు డెలివరీ చేస్తారు అని అడిగినప్పుడు కంపెనీ స్పందించలేదు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) శైలేష్ చంద్ర ఒక ప్రకటనలో, " ఈ ఒప్పందం వినియోగదారులకు పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ వాహనాల రైడ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు. గ్రీన్ అండ్ క్లీన్ పర్సనలైజ్డ్ రైడ్ అనుభవం కస్టమర్లకు ఇవ్వడమే తమ లక్ష్యమని" ఆయన తెలిపారు. అలాగే, మెరుగైన భద్రత, ప్రశాంతమైన, ప్రీమియం సౌకర్యాలను కస్టమర్‌లకు అందిస్తామని ఆయన అన్నారు. వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్‌లు, EVలను మరింత ఆకర్షణీయంగా మార్చాయని చంద్ర అన్నారు. దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ వాటా 70 శాతానికి పైగా ఉండటం విశేషం.