ముంబై: ప్రముఖ అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థ ‘టాటా జాగ్వార్’ సైతం విద్యుత్ వాహనాల విభాగంలో అడుగు పెట్టాలని సంకల్పించింది. ప్రిన్స్ హార్రీ తన వివాహ సందర్భంగా వెళ్లేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనం తరహాలో క్లాసిక్ ఈ - టైప్ విద్యుత్ సాయంతో నడిచే జాగ్వార్ లాండ్ రోవర్ వాహనాన్ని 2020 లోగా మార్కెట్ లోకి తీసుకు రానున్నది. ఈ మేరకు బ్రిటన్‌లోని జాగ్వార్ లాండ్ రోవర్ ఫ్యాక్టరీలో ఉత్పాదకతకు అవసరమైన సన్నాహాలు చేస్తోంది. 

స్లాక్ స్పోర్ట్స్ కారు జాగ్వార్ ‘ఈ- టైప్ జీరో’ కారును విద్యుత్‌ వినియోగంతో నడిపేందుకు వీలుగా కోవెంట్రీలో గల జాగ్వార్ లాండ్ రోవర్ అనుబంధ విభాగం జాగ్వార్ క్లాసిక్‌‌ యూనిట్‌లో కారును తీర్చిదిద్దుతుంది. జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థ వింటేజ్ మోడల్ కార్లను మార్కెట్‌లోకి తేవాలని తహతహలాడుతోంది. అయితే జాగ్వార్ ఈ - టైప్ తరహా ధరను ఎంత అన్న విషయాన్ని జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ బహిర్గతం చేయలేదు.

ఈ సందర్భంగా జాగ్వార్ లాండ్ రోవర్ క్లాసిక్ సంస్థ డైరెక్టర్ టిమ్ హన్నిగ్ మాట్లాడుతూ ‘జాగ్వార్ ఈ - టైప్ జీరో’ మోడల్ కార్ల పట్ల ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో మేం చాలా ఆనందంతో ఉన్నాం. జాగ్వార్ క్లాసిక్‌లో ‘జాగ్వార్ ఈ - టైప్’ మోడల్ కార్ల రంగ ప్రవేశంతో భవిష్యత్‌లో సంస్థకు లబ్ధి చేకూరుస్తుంది’ అని చెప్పారు. 

‘ఈ- టైప్ జీరో’ మోడల్ కారు అజేయమైన వారసత్వం కలిగి ఉంటుందని జాగ్వార్ క్లాసిక్ డైరెక్టర్ టిమ్ హన్నిగ్ చెప్పారు. జాగ్వార్ క్లాసిక్ సిబ్బంది ఆధ్వర్యంలో ‘ఈ-టైప్’ కార్లు రూపుదిద్దుకుంటున్నాయని, పూర్తిగా కర్బన ఉద్గారాల రహిత ఉత్పత్తులను తయారు చేయడంలో తమ సంస్థ అంకిత భావంతో పని చేస్తున్నదని టిమ్ హన్నిగ్ తెలిపారు. ‘ఈ-టైప్’ మోడల్ వాహనాలను విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేస్తామని కూడా జాగ్వార్ లాండ్ రోవర్ తెలిపింది.