Asianet News TeluguAsianet News Telugu

కళ్లు లేవు: అందరి కళ్లు తెరిపించాడు

పుట్టగానే గుడ్డి కొడుకు ఎందుకు గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండని ఉచిత సలహాలిచ్చారు. ఎందుకు పనికిరాడని... ఉపయోగం లేదని ఈసడించుకున్నారు. కానీ తనను కళ్లు లేని వాడినని హేళన చేసిన సమాజం కళ్లు తెరిపించి.. అంగవైకల్యం... లక్ష్యానికి అడ్డురాదని చాటి చెప్పాడు ఈ కుర్రాడు.

success story of blind entrepreneur Srikanth Bolla
Author
Hyderabad, First Published Feb 21, 2019, 4:30 PM IST

పుట్టగానే గుడ్డి కొడుకు ఎందుకు గొంతు నులిమి చంపేయండని కొందరన్నారు. జీవితాంతం ఎందుకు భారం.. వదిలించుకోండని ఉచిత సలహాలిచ్చారు. ఎందుకు పనికిరాడని... ఉపయోగం లేదని ఈసడించుకున్నారు.

కానీ తనను కళ్లు లేని వాడినని హేళన చేసిన సమాజం కళ్లు తెరిపించి.. అంగవైకల్యం... లక్ష్యానికి అడ్డురాదని చాటి చెప్పాడు ఈ కుర్రాడు. నిండా 30 ఏళ్లు నిండని ఈ కుర్రాడు ఇప్పుడు రూ.50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి సీఈవో.

ఏ చూపైతే లేదని సమాజం చిన్న చూపు చూసిందో అదే సమాజాన్ని తన వైపుకు తిప్పుకుని, అదే సమాజంతో చప్పట్లు కొట్టించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి సమీపంలో ఉన్న సీతారామపురానికి చెందిన దామోదర్ రావు, వెంకటమ్మలకు సంతానంగా పుట్టిన బొల్లా శ్రీకాంత్‌ పుట్టి గుడ్డి.

పురిట్లో ఉండగానే గుడ్డి కొడుకు మీకెందుకు చంపేయండి లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అంటూ సలహాలిచ్చారు. కానీ ఆ తల్లీదండ్రులు వారి సలహాలను పాటించకుండా, విభిన్నంగా ఆలోచించారు.

నెలకు 1600 రూపాయల సంపాదనే.. అయినా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితే అయినా కొడుకుకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకున్నారు. కొంచెం పెద్దయిన తర్వాత బడికి వెళ్లే వయసు వచ్చిన తర్వాత అతన్ని పాఠశాలలో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు గురువులు.

కానీ తల్లిదండ్రులు బతిమలాడటంతో బడిలో చేర్చుకున్నారు. కానీ అందరిలా ముందు వరుసలో కాదు.. వెనక బెంచీకే పరిమితం చేశారు. ఇక ఆట, పాటలకు శ్రీకాంత్ దూరమే. తప్పు అతనిది కాదు.. ఎవరూ అతన్ని ఆటల్లో చేర్చుకునేవారు కాదు.

కానీ కసితో చదువుకున్న శ్రీకాంత్ పదో తరగతి పరీక్షల్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత అతను ఇంటర్‌లో చేరాలనుకున్నాడు. ఎంతో ఉత్సాహంతో వెళ్లి సైన్స్ గ్రూపులో చేరుతానంటూ ప్రిన్సిపాల్‌‌కు చెప్పాడు.

దీనికాయన కింది నుంచి పైకి చూసి.. ‘‘వెళ్లి.. ఆర్ట్స్ గ్రూపులో చేరు’’ అంటూ చెప్పాడు. ఆయన అలా అనడానికి కారణం లేకపోలేదు.. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నియమావళి ప్రకారం అంధులు సైన్స్ గ్రూపులు ఎంచుకోవడానికి అనర్హులు... ఆర్ట్స్‌లో ప్రవేశాలకు మాత్రమే వారిని అనుమనిస్తారు.

కానీ శ్రీకాంత్.. ప్రిన్సిపాల్ చెప్పిన మాట వినలేదు.. బోర్డుకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగాడు. అంతే... ఆరు నెలల తర్వాత బోర్డు దిగివచ్చింది.. అతనికి సైన్స్ గ్రూపులో ప్రవేశమూ కల్పించింది.

ఈ అవకాశాన్ని వినియోగించుకున్న శ్రీకాంత్ ఇంటర్ పరీక్షల్లో 98 శాతం మార్కులతో పాసవ్వడంతో ప్రిన్సిపాల్‌తో పాటు తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఐఐటీలో చేరాలని నిర్ణయించుకున్న శ్రీకాంత్.. అర్హత సాధించడానికి రాత్రింబవళ్లూ కష్టపడ్డాడు.

కానీ ఐఐటీలు అందుకు సిద్ధంగా లేవు. అతనికి హాల్ టికెట్‌ను పంపించకుండా అవమానించాయి. అంతే ఈ చర్యతో అతను నీరుగారిపోయాడు. ఐఐటీలకు అవసరం లేకపోతే.. తనకు అవి అవసరం లేదని’’ అమెరికా వైపు చూశాడు.

స్నేహితులు, అధ్యాపకుల ద్వారా అక్కడి టాప్ కళాశాలలకు దరఖాస్తు చేశాడు. అతని ప్రతిభను గుర్తించిన అమెరికన్ దిగ్గజ విద్యాసంస్థలు... ఎమ్ఐటీ, స్టాన్‌ఫోర్డ్, బర్కెలీ, కార్నెగీ, మెల్లాన్‌లు శ్రీకాంత్‌కు రెడ్ కార్పెట్ పరిచాయి.

వాటిలో ఎమ్ఐటీని తన గమ్యానికి వారథిగా ఉపయోగించుకున్నాడు శ్రీకాంత్. అంతేకాదు ఆ కళాశాలకు తొలి అంతర్జాతీయ అంధ విద్యార్ధిగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఎమ్ఐటీలో గ్రాడ్యుయేషన్ అనంతరం అమెరికాలోని కార్పోరేట్ సంస్థలు కొలువు ఇవ్వడానికి అవకాశం కల్పించాయి.

అయితే శ్రీకాంత్ ఆశయం వేరే ఉంది. భారతదేశంలో తనలా సమాజంలో వివిక్ష ఎదుర్కోంటున్న వారికి అండగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. లక్షల్లో జీతాలు పొందే అవకాశం వచ్చినా.. వాటిని కాదని భారత్‌కు వచ్చేశాడు. వెంటనే హైదరాబాద్‌లో ‘సమన్వయ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.

వికలాంగులకు సేవలందించడం మొదలుపెట్టాడు. అంధుల కోసం ఓ డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ని నెలకొల్పి, 3 వేల మందికి పైగా పాఠాలు చెప్పేవాడు. 2012లో శ్రీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

వికలాంగులకు ఉద్యోగాలిచ్చే కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. అలా రూపుదిద్దుకున్నదే ‘ బొల్లాంట్ ఇండస్ట్రీస్’. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేస్తున్నాడు. వీటితో పాటే ప్రింటింగ్ ప్రొడక్టులను సైతం తయారు చేశాడు.

శ్రీకాంత్ క్రమశిక్షణ, పట్టుదలను గుర్తించిన రవి మంతా అనే పారిశ్రామిక వేత్త భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అలా ఏడాదికి రూ.50 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా దానిని తీర్చిదిద్దాడు.

ఇప్పుడు శ్రీకాంత్ చేతిలో నాలుగు ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి హుబ్లీ, నిజామాబాద్, హైదరాబాద్‌‌. త్వరలో సోలార్ ఆధారిత ప్లాంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో నెలకొల్పబోతున్నారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డు. అందులో మూడు మిషన్లు, ఎనిమిది మంది పనివాళ్లు. అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి... కోట్లకు వ్యాపారాన్ని విస్తరించడం అంటే మాటలు కాదు. దీని వెనుక శ్రీకాంత్ శ్రమ, పట్టుదల, విజన్ ఉన్నాయి.

ఉద్యోగుల్లో 70 శాతం మంది అంధులే.. ఈ కంపెనీని ఐపీవో స్థాయికి తీసుకెళ్లాలనేది అతని ముందున్న లక్ష్యం. ఇతరులకు మనం మంచి చేస్తే.. అది తిరిగి మనకు మంచే చేస్తుందని శ్రీకాంత్ బలంగా నమ్ముతారు.

ఈ ప్రయాణంలో అతని కృషికి మెచ్చి మలేషియాకు చెందిన ఈసీఎల్‌ఐఎఫ్ నుంచి ‘ఎమెర్జింగ్ లీడర్‌షిప్ అవార్డ్’, సీఐఐ నుంచి ‘‘ఎమెర్జింగ్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఆఫ్ ది ఇయర్-2016’’ అవార్డును అందుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios