న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగిత నాలుగున్నర దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరి ఉరుముతున్న తరుణంలో, రేపు వెలుగు చూడనున్న కేంద్ర బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు వినిపిస్తున్నాయి. స్టార్టప్ సంస్థలు, సూక్ష్మ పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు, రాయితీలతో ఊతమిస్తే ఉపాధి కల్పన చురుకందుకుని దేశ ఆర్థిక వ్యవస్థ తేరుకుంటుందన్న సూచనలు జోరెత్తుతున్నాయి. 

కొన్నాళ్లుగా ప్రైవేట్ పెట్టుబడుల్లో తగ్గుదల, ఎగుమతుల్లో క్షీణతలు నమోదయ్యాయి. దీంతోపాటు వస్తు సేవలపై ప్రజల ఖర్చు కుంగి- వేరే మాటల్లో గిరాకీ సన్నగిల్లి, ఆందోళనకర మాంద్యానికి ఆజ్యం పోయడం చూస్తున్నాం. ఈ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో వ్యక్తిగత పన్ను రేట్లలో కోత విధిస్తే పౌరుల చేతిలో సొమ్ములు ఆడతాయని, పొదుపు చేయగల మొత్తం పెరిగితే అంతిమంగా ఆర్థిక రంగం నవోత్తేజం సంతరించుకుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల రూపేణా రూ.13.5 లక్షల కోట్ల మేర రాబడిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నా, వాస్తవంగా రూ.2 లక్షల కోట్ల దాకా తరుగుదల తప్పదని ముందస్తు అంచనాలు వెల్లడిస్తున్నాయి.గత ఏడాది ప్రత్యక్ష పన్నుల ఆదాయ పద్దు రూ.11.5 లక్షల కోట్లకైనా ఈసారి చేరువ కాలేకపోవచ్చునన్న సూచనలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో శనివారం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో ఏ మార్గం అనుసరించనున్నారోనన్న ఉత్కంఠ సహజంగానే రేకెత్తుతోంది. ప్రభుత్వం తలచుకోవాలేగాని పన్నుపోటునుంచి ఉపశమనం ఒక్కటేమిటి. స్టార్టప్ సంస్థలకు శిరోవేదన కలిగిస్తున్న ఇతరత్రా సమస్యలపై దృష్టి సారించాల్సిన అజెండా సైతం పోగుపడి ఉంది.

also read ఆర్థిక ఉద్దీపనలు కల్పించడం అసాధ్యం: నీతి ఆయోగ్

2016 ఏప్రిల్‌ ఒకటో తేదీ తరవాత ఏర్పాటైన ఏ స్టార్టప్ సంస్థకైనా మూడేళ్లు నూరుశాతం పన్ను రాయితీ కల్పిస్తున్నారు. చిరు మొలకలు నిలదొక్కుకుని లాభాల బాట పట్టేవరకు మరికొంత గడువిస్తే వాటినెత్తిన పాలుపోసినవారవుతారు. తయారీ రంగ పరిశ్రమల్ని అనుగ్రహించినట్లే ఉదార ప్రోత్సాహకాల్ని స్టార్టప్ సంస్థలకూ వర్తింపజేస్తే, నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం అవుతుంది. 

సృజన శక్తుల మెదళ్లనే నవ కల్పనల నారుమళ్లుగా తీర్చిదిద్ది భిన్న రంగాల్లో వ్యవస్థాపకతను ఉరకలెత్తించే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం నాలుగేళ్లక్రితం రూపొందించిందే స్టార్టప్ పరిశ్రమల విధానం. ఉద్యోగాలు కోరుకునేవారే కాదు ఉపాధి అవకాశాలు సృష్టించేవారిని అవతరింపజేయడమే తమ ధ్యేయమన్నది నాడు ‘నీతి ఆయోగ్‌’ నోట సైతం మార్మోగిన నినాదం. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజంగా ఎదిగిన భారత్‌ చిరకాలం సంపన్న దేశాలకు నిపుణుల సరఫరా కేంద్రంగానే మిగిలిపోయింది. 

దేశీయంగా కన్ను తెరిచిన తొలి దశ స్టార్టప్ సంస్థల్లో 65 శాతం వరకు ఇక్కడి పన్నులు, సుంకాల ఆరళ్లు భరించలేక సింగపూర్‌ వంటి దేశాలకు తరలిపోయాయని అప్పట్లో కేంద్రమే అంగీకరించింది. ‘స్టార్టప్‌ ఇండియా’ను ఘనంగా పట్టాలకు ఎక్కించిన తరువాత 22 వేర్వేరు చట్టాల కింద నిబంధనలు పాటించాల్సి వస్తున్నదన్న ఔత్సాహికుల ఆక్రోశం, పూడ్చాల్సిన లోపాలు ఎన్నో ఉన్నాయని స్పష్టం చేసింది.


మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరుణ్‌ ఖన్నా కమిటీయే- అమెరికాతో పోలిస్తే ఇక్కడి ఔత్సాహికులు స్టార్టప్‌ నిధులకోసం అధికంగా కష్ట పడాల్సి వస్తోందని తప్పుపట్టింది. సంక్లిష్ట పన్నుల వ్యవస్థ, మౌలిక సదుపాయాల కొరత, బ్యురోక్రసీ ప్రతినాయక పాత్ర తదితరాల్నీ అది వేలెత్తి చూపింది. 

స్టార్టప్ సంస్థల్లో పురుషాధిక్య ధోరణుల్ని ఇప్పటికీ పలు అధ్యయనాలు ప్రశ్నిస్తున్నాయి. పన్నుల మదింపు తరవాత గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్‌, ఓలా, స్నాప్‌డీల్‌, గ్రోఫర్స్‌ ప్రభృత ప్రముఖ స్టార్టప్‌ సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.

సవ్య ప్రస్థానం సాగితే 2025 నాటికి ప్రత్యక్షంగా 4.5 లక్షలవరకు, పరోక్షంగా మూడు లక్షల మంది దాకా ఉపాధి అవకాశాలు ఏర్పరచగల స్టార్టప్ సంస్థలను నేర్పుగా సాకేలా శనివారం ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఏం చేయగలదో చూడాలి.సాంకేతిక కళాశాలల స్థాయిలో స్టార్టప్ సంస్థల యోచనల్ని ప్రోత్సహించాలని తనవంతుగా తెలంగాణ ఐటీశాఖ నాలుగేళ్ల క్రితమే ప్రతిపాదించింది. అది మొదలు ప్రవర్ధమానమవుతున్న చొరవ దేశీయంగా అత్యధిక స్టార్టప్‌లు కలిగిన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక, మహారాష్ట్ర తరవాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. 

also read Budget 2020:పోఖ్రాన్ ఆంక్షల మధ్య: ఇళ్లు, పరిశ్రమలకు రాయితీలు...

2020నాటికి వంద స్టార్టప్ అభివృద్ధి కేంద్రాలను, 5000 స్టార్టప్‌లను నెలకొల్పుతామని ఆంధ్రప్రదేశ్‌- ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలు ముందుకు రావడంతో దరిమిలా తెలంగాణ ఏడో స్థానానికి పరిమితం అయ్యింది. నగరాలవారీగా అహ్మదాబాద్‌, జైపూర్‌, కోల్‌కతా, కొచ్చి స్టార్టప్ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. 

వ్యవసాయంతోపాటు ఎన్నో గ్రామీణ వృత్తులు, వ్యాపారాలకు డిజిటల్‌ సేవలందిస్తూ స్టార్టప్ సంస్థల పునాది విస్తరణ స్వాగతించదగ్గ పరిణామం. పలు స్టార్టప్‌లు ప్రాంతీయ భాషల్లో డిజిటల్‌ సమాచారం అందజేయడంలో నిమగ్నమయ్యాయి. మున్ముందు కృత్రిమ మేధకు స్టార్టప్‌లు సమధికంగా విస్తరిస్తాయని టాటా గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రతన్‌ టాటా అంచనా వేస్తున్నారు. 

టెక్నాలజీ నవీకరణలో బాసటగా నిలిచి స్టార్టప్ సంస్థల్ని స్విట్జర్లాండ్‌, స్వీడన్‌, బ్రిటన్ రాటు తేలుతున్నాయి. స్టార్టప్‌ల పురోగతిలో అత్యంత కీలకమైన మౌలిక వసతుల పరికల్పనలో ఫిన్లాండ్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌ వంటి దేశాలు పోటీపడుతున్నాయి. భారతీయ పరిశోధన సామర్థ్యాన్ని గూగుల్‌, జనరల్‌ ఎలెక్ట్రిక్‌, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థలు ఏనాడో ప్రస్తుతించాయి.

ఆ సహజ బలిమికి వ్యవస్థాగత తోడ్పాటు, విధానపరమైన సంస్కరణలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణాయక సహకారం జతపడితే సృజనాత్మక వాణిజ్య యోచనల దన్నుతో స్టార్టప్ సౌభాగ్యం ఇక్కడా సాకారం అవుతుంది. స్టార్టప్ సంస్థలకు వెన్నుదన్నుగా నిలిచి అద్భుత విజయ గాథల్ని ఆవిష్కరిస్తున్న జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ దేశాల విధానాన్ని  అందిపుచ్చుకొనేలా నవ్యభారతానికి కేంద్ర బడ్జెట్‌ పథనిర్దేశం చేయాలని టెక్నాలజీ నిపుణులు కోరుతున్నారు.

వాల్ మార్ట్ సంస్థతో ఫ్లిప్ కార్ట్ ఒప్పందం తర్వాత ఫ్లిప్ కార్ట్ మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు మైంత్రా, ఫోన్ పే తదితర సంస్థలు నిర్వహిస్తున్నారు. ఓవర్ నైట్ మల్టీ మిలియనీర్లవుతున్నారు. 2020లో స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు ‘ఈఎస్వోపీఎస్’ అమలు చేసే సంస్థలకు ద్వంద్వ పన్నుల విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. స్నాప్ డీల్ సీఈఓ కునాల్ బాహ్ల్ మాట్లాడుతూ నోషనల్స్ గెయిన్స్‌కు బదులు వాస్తవ లాభాలపై పన్ను విధించాలని సూచిస్తున్నారు. 

ఫోన్ పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ నిగమ్ మాట్లాడుతూ ‘ఈఎస్వోపీ’లను నిర్వహిస్తున్న తమ ఉద్యోగులపై ద్వంద్వ పన్నుల విధానం అమలు చేస్తున్నారని చెప్పారు. ఈఎస్వోపీల నిర్వాహకులు అవసరమైన ప్రతిభావంతులను ఆకర్షించడంతోపాటు టాప్ పర్ఫార్మర్లను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 

also read Budget 2020:ఇప్పటి వరకు ఎంత మంది బడ్జెట్ ప్రవేశపెట్టారో తెలుసా...?

స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కానీ ఈఎస్వోపీఎస్ సంస్థలను కొనుగోలు చేస్తున్న తమ సంస్థ ఉద్యోగులు ఆదాయం పన్ను చెల్లించడానికి వెనుకాడరని ఫోన్ పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్ నిగమ్ తెలిపారు. స్టార్టప్ సంస్థల్లో చురుగ్గా పాల్గొనాలని ప్రభుత్వాన్ని ఆయా సంస్తల నిర్వాహకులు కోరుతున్నారు. ఇంకుబేటర్లను ఏర్పాటు చేయడంలో గానీ, ఐపీవోలు ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంస్థలకు పబ్లిక్ లిస్టింగ్ నార్మ్స్‌ను సడలింపజేయాలని అభ్యర్థిస్తున్నారు. 

క్లియర్ ట్యాక్స్ సీఈఓ అర్చిత్ గుప్తా మాట్లాడుతూ ‘ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ సంస్థలకు ఇప్పటికీ ఏంజిల్ టాక్స్ సమస్యగా మారింది. దీనివల్ల సొంత డబ్బు స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి రిస్క్ ఎదుర్కొనేందుకు ఏంజిల్ ఇన్వెస్టర్లు సిద్ధంగా లేరు’ అని పేర్కొన్నారు.

2019లో ప్రారంభదశలో ఉన్న స్టార్టప్ సంస్థల విలువ 1.15 బిలియన్ల డాలర్లకు పెరిగింది. 2018లో అది 1.13 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. కానీ డీల్స్ మాత్రమే 416 సంస్థల నుంచి 387 సంస్థలకు పడిపోయాయని వెంచర్ ఇంటెలిజెన్స్ సమాచారం. అంతకుముందు 2015లో స్టార్టప్ సంస్థలు ప్రారంభ దశలోనే 540 వరకు మూతపడ్డాయి. ఇప్పుడు ఏంజిల్ ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారు. 

ఓలా, హైక్ మెసేంజర్, మేక్ మై ట్రిప్, క్విక్కర్, సాఫ్ట్ బ్యాంక్ ఇన్వెస్టర్లు, మాట్రిక్స్ పార్టనర్స్, కాలారీ కేపిటల్, ఐడీజీ వెంచర్స్‌తో ఏర్పాటైన లాబీ గ్రూప్ ఇండియా టెక్. ఓఆర్జీ సీఈఓ రమీశ్ కైలాసం మాట్లాడుతూ స్టార్టప్ ఇంకుబేటర్లపై టాక్స్ హాలిడే ప్రకటించాలని కోరారు. 

స్టార్టప్ సంస్థల ప్రమోటర్లలో ఇంక్యుబేటర్లు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని కైలాసం తెలిపారు. ‘100ఎక్స్.వీసీ’ స్టార్టప్ ఫండ్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ యగ్నేష్ సంఘ్రాజ్కా మాట్లాడుతూ రూ.25 కోట్లకు పైబడిన పెట్టుబడులతో కూడిన స్టార్టప్‌లకు మాత్రమే వాల్యుయేషన్ నివేదిక తప్పనిసరి చేయాలని కోరారు. నూతన స్టార్టప్ సంస్థలకు అవసరమైన నిధుల సమీకరణ, ఏంజిల్ ఫండింగ్ కోసం ధ్రువీకరణ సర్టిఫికెట్లు కావాలని ఎర్లీ స్టేజ్ ఇన్వెస్టర్లు, ఏంజిల్ ఫౌండర్లు డిమాండ్ చేస్తున్నారు.