Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్వేస్‌పై ముప్పేట దాడి: స్పైస్ జెట్ అండ్ ఇండిగో ఇలా

రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. 

SpiceJet leasing Jet Airways  grounded planes to keep fares in check
Author
New Delhi, First Published Mar 23, 2019, 1:18 PM IST

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని జెట్‌ ఎయిర్‌వేస్‌ నిలిపివేసిన విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్‌జెట్‌ ఆలోచిస్తోంది. ఇందుకోసం‘జెట్‌’ విమానాల లీజు యజమానుదార్లతో పాటు జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్యంతో చర్చలు జరుపుతోంది. దాదాపు 50 వరకు విమానాలను స్పైస్‌జెట్‌కు ఆఫర్‌ చేసే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల కథనం.

 డీల్ కుదిరాక స్పైస్‌జెట్ నెట్‌వర్క్ లోకి..
లీజుదారులు, స్పైస్‌జెట్‌ మధ్య డీల్‌ కుదిరాక కొద్ది వారాల్లోనే విమానాలు ఈ ఎయిర్‌లైన్‌ నెట్‌వర్క్‌లోకి చేరవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రస్తుతం తన నెట్‌వర్క్‌లోని 119లో 41 విమానాలనే నడుపుతోంది. 

టికెట్‌ ధరలు తగ్గేందుకు చాన్స్
జెట్‌ ఎయిర్వేస్ సంస్థకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు స్పైస్‌జెట్‌ లీజుకు తీసుకోవడం ద్వారా విమాన సర్వీసులు పెరిగి ఈ మధ్య భారీగా పెరిగిన టికెట్ల ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లీజు అద్దె చెల్లించలేకపోవడంతోపాటు ఇతర కారణాల వల్ల జెట్‌ ఎయిర్‌వేస్‌ తన నెట్‌వర్క్‌లోని మూడింట రెండోవంతు విమానాలను నిలిపివేసింది. 

బోయింగ్ విమానాలపై డీజీసీఏ నిషేధం
దీనికితోడు ఇథియోపియో ఎయిర్‌లైన్స్‌ విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రపంచ దేశాలతోపాటు భారత్‌ కూడా బోయింగ్‌ 737 మాక్స్‌ 8 విమానాలపై నిషేధం విధించింది. దాంతో స్పైస్‌జెట్‌ తన వద్దనున్న 12 బోయింగ్‌ 737లను నిలిపివేయాల్సి వచ్చింది. తత్ఫలితంగా రోజుకు వందల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి. విమాన చార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి.
 
13 అంతర్జాతీయ రూట్లలో విమానాలు రద్దు
ఏప్రిల్ నెలాఖరు వరకు జెట్ ఎయిర్‌వేస్ 13 అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో పాటు మరో ఏడు విమానాలకు అద్దె చెల్లించక పోవడం వల్ల జెట్ ఎయిర్‌వేస్ ఆయా సర్వీసులను నిలిపివేసింది. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి వివిధ దేశాలకు రాకపోకలు సాగించే జెట్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

పుణె సింగపూర్, అబుదాబీ సర్వీసులు కూడా రద్దు
గత డిసెంబర్ నెలలో ప్రారంభించిన పుణె - సింగపూర్, పుణె -అబుదాబీ విమాన సర్వీసులను జెట్ ఎయిర్‌వేస్ రద్దు చేసింది. దీంతో పాటు ముంబై -మాంచెస్టర్ మార్గంలో విమానసర్వీసును కూడా నిలిపివేసింది. 

600 నుంచి 119 విమానాలకు జెట్ ఎయిర్వేస్
గతంలో రోజుకు 600 విమానసర్వీసులు నడిపేవారమని, ప్రస్థుతం కేవలం 119 విమానాలే నడుపుతున్నామని జెట్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. ఢిల్లీ - అబుదాబీ, ఢిల్లీ -దమ్మమ్, ఢిల్లీ -ఢాకా, ఢిల్లీ -హాంకాంగ్, ఢిల్లీ- రియాద్ విమాన సర్వీసులను రద్దు చేశారు. బెంగళూరు నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసులను కూడా రద్దు చేశారు. ముంబయి నుంచి అబుదాబీ, బహ్రెయిన్, దమ్మమ్, విమాన సర్వీసులను కూడా ఏప్రిల్ 30వతేదీ వరకు రద్దు చేశారు. 


జెట్ ఎయిర్వేస్‌లో మెజారిటీ వాటాకు బ్యాంకర్లు రెడీ
సంక్షోభంలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో రుణదాతలు మెజారిటీ వాటా తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొత్త ప్రమోటర్‌ వచ్చే వరకు బ్యాంకులు ఈ వాటాను తమ చేతిలో ఉంచుకునే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కొత్త ప్రమోటర్ కోసం మూడు నెలలు కావాలి
జెట్‌ ఎయిర్‌వే్‌సలోకి కొత్త ప్రమోటర్‌ను తీసుకువచ్చేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం బ్యాంకులు తమ వాటాను తగ్గించుకోవటం లేదా విక్రయించే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఐదు నెలలుగా నిధుల కోసం ఎస్బీఐ కన్సార్టియం కసరత్తు
నిధుల కటకటతో సతమతమవుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం రుణ పరిష్కార ప్రణాళికను సిద్ధం చేసేందుకు ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం గడిచిన ఐదు నెలలుగా కసరత్తు చేస్తోంది. జెట్‌ ఎయిర్‌ రుణ భారం దాదాపు రూ.8,200 కోట్ల వరకు ఉంది. మరోవైపు రూ.1,700 కోట్ల విలువైన రుణాలను ఈ నెలాఖరులోగా చెల్లించాలి.

రుణదాతలు వాటా తీసుకుంటే బెటర్
ఒకవేళ జెట్‌ ఎయిర్వేస్ సంస్థలో రుణదాతలు వాటా తీసుకుంటే సంస్థ గాడిన పడుతుందని పేర్కొన్నారు. కొత్త ప్రమోటర్‌ను తేవాలంటే ముందుగా ఇప్పటి ప్రమోటర్‌ తప్పుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియంతా పూర్తి కావటానికి దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రమోటర్‌ అయిన నరేశ్‌ గోయల్‌కు 51 శాతం వాటాలుండగా ఎతిహాద్‌ ఎయిర్‌వే్‌సకు 24 శాతం వాటాలున్నాయి.

జెట్ ఎయిర్వేస్ పైలట్లకు ఇండిగో ఎర!
పైలట్లు, ఇతర సిబ్బంది కొరతతో సతమతం అవుతున్న ఇండిగో.. జెట్‌ ఎయిర్వేస్ పైలట్లకు ఎర వేస్తోంది. జెట్‌ నుంచి బయటికొస్తున్న 100కు పైగా బోయింగ్‌ 737 పైలట్లను ఇండిగో నియమించుకుంటోంది. ఇండిగో నెట్‌వర్క్‌లోని విమానాల్లో ఎయిర్‌బస్‌ ఏ320లే అధికం. 

బోయింగ్ విమానాలు నడిపేందుకు ఆరు నెలల శిక్షణఈ బోయింగ్‌ పైలట్లకు ఎయిర్‌బస్‌ విమానాలు నడిపేందుకు మరో ఆర్నెళ్లపాటు శిక్షణ ఇప్పించనున్నట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి పైలట్లను నియమించుకోవడంకన్నా దేశీయంగా అందుబాటులో ఉ న్న పైలట్లకే అవసరమైతే శిక్షణ ఇప్పించడం చౌక అని ఇండిగో భావిస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios