ముంబై: ‘మీటూ (నేనూ బాధితురాలినే)’ ఉద్యమం మరో కార్పొరేట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌నూ తాకింది. దేశీయ వేలం సంస్థ ‘సోథ్ బే ఇండియా’ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ భాటియాపై ఒక మహిళ ఈ ఆరోపణ చేశారు. దీంతో ఆయన దీనిపై విచారణ పూర్తయ్యే వరకు సెలవులో వెళ్లాలని యాజమాన్యం ఆదేశించింది. ఒక మహిళ తనను గౌరవ్ భాటియా తాకరాని చోట తాకాడని, బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించారని తన ఇన్‌స్టా‌గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 

మహిళపై వరుసగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో ఆయన సెలవుపై వెళ్లారు. దీనిపై విచారణ పెండింగ్ లో ఉన్నంత వరకు ఆయన సెలవులో కొనసాగుతారని సోథ్ ఇండియా బే ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థలో ఎటువంటి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినా సహించేది లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. గౌరవ్ భాటియా సహకారంతో నిశితంగా దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని పేర్కొంది. 

గౌరవ్ భాటియా 2016 నుంచి సంస్థలో పని చేస్తున్నారు. అంతకుముందు దశాబ్దం పాటు లగ్జరీ బ్రాండ్ ‘ఎల్వీఎంహెచ్’లో పని చేశారు. వచ్చేవారం ఆన్ లైన్ వేలం ప్రక్రియ చేపట్టనున్న సోథ్ బే ఇండియా సంస్థ ఎండీ గౌరవ్ భాటియాపై వచ్చిన ఈ ఆరోపణలు సంస్థ భవితవ్యానికి కీలకం కానున్నాయి. 

ముంబైలో ప్రారంభ వేలం నిర్వహణలో గౌరవ్ భాటియా ‘డ్రైవింగ్ ఫోర్స్’గా ఉన్నారని సోథ్ బే ఇండియా వెబ్ సైట్ తెలిపింది. దక్షిణాసియా కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నది. ప్రస్తుతం సంస్థ మిడిల్ ఈస్ట్ అండ్ భారత్ విభాగం చైర్మన్ ఎడ్వర్డ్ గిబ్స్, దక్షిణాసియా ఆర్ట్ ఇంటర్నేషనల్ హెడ్ యామినీ మెహతాల సారథ్యంలో పూర్తిగా వచ్చేవారం జరిగే వేలంపైనే కేంద్రీకరించామని పేర్కొంది.