Asianet News Telugu

క్రెడిట్ కార్డు ‘యూసేజ్’ బెటరే.. కానీ కంట్రోల్ ఇన్ యువర్ సెల్ఫ్

చేతిలో క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఇష్టారాజ్యంగా వాడితే చివరకు రుణాల బారీన పడి అష్టకష్టాల పాలవ్వాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాటి వినియోగంలో ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
 

Smart usage of credit card: How can you reap maximum benefits?
Author
New Delhi, First Published Jun 3, 2019, 11:34 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: మన రోజువారీ జీవితాలను క్రెడిట్‌ కార్డులు సులభతరం చేశాయి. క్రెడిట్‌ కార్డు లేని వారు చాలా తక్కువే ఉంటారు. క్రెడిట్‌ కార్డులు చేతిలో ఉండడంతో ప్రజల్లో వినియోగ ధోరణులూ పెరిగిపోయాయి. కార్డులను అడ్డూ ఆపూ లేకుండా వినియోగించి అప్పుల పాలవుతున్న వారూ ఉంటున్నారు. 

క్రెడిట్‌ కార్డు ఖర్చులను నియంత్రించుకోవడం ఎలా ఉన్నదని వాటి యూజర్లు ద్రుష్టి సారించాలని కోరుతున్నారు. క్రెడిట్‌ కార్డు ఉందని విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించకూడదు. ఎక్కడైనా క్రెడిట్‌ కార్డు ఇచ్చే ముందు ఆ ఖర్చు అవసరమా? కాదా? అన్నది సమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి నెలా క్రెడిట్‌ కార్డు మీద ఎంత వ్యయం చేస్తున్నారన్నది బ్యాంకు పంపే స్టేట్‌మెంట్‌లో ఉంటుంది. అది క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.  క్రెడిట్‌ కార్డులపై మితిమీరి వ్యయం చేసినట్టయితే కష్టాల్లో పడతారన్న విషయం ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

పైగా చెల్లింపుల్లో డీఫాల్ట్‌ అయితే క్రెడిట్‌ స్కోరు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పైగా విచక్షణారహితంగా ఖర్చు చేస్తూ పోతే తదుపరి దశలో చెల్లించాల్సిన వడ్డీల భారం సైతం పెరిగిపోతుంది. అత్యవసరమైతే తప్ప కార్డును ఉపయోగించకూడదని తీర్మానించుకుంటే ఇలాంటి ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.
 
క్రెడిట్‌ కార్డు మనకు ఖర్చుల్లో వెసులుబాటు కల్పిస్తుంది తప్పితే దాని ద్వారా అందుబాటులో ఉండే సొమ్ము ఉచితంగా లభించిందేమీ కాదు. ఎంతగా ఖర్చు చేస్తే అంత నిష్పత్తిలో నెలవారీ చెల్లింపులు పెరిగిపోతాయి.

మీకు మంచి ఆదాయం ఉండి క్రెడిట్‌ కార్డుపై ఖర్చు కూడా ఎక్కువగా చేస్తున్నట్లైతే బ్యాంకులు తరచుగా క్రెడిట్‌ పరిమితి పెంచుకుంటూ పోతాయి. ఇది మీ కొనుగోలు శక్తిని పెంచినా మిమ్మల్ని రుణగ్రస్తులను చేస్తుంది. అందుకే క్రెడిట్‌ పరిమితి నిర్దిష్ట స్థాయికి మించి పెంచవద్దని బ్యాంకును కోరండి.
 
సాధారణంగా వేతన జీవులకు క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడతాయి. దీని వల్ల మంచి వేతనాలు ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ ఒకటి కన్నా ఎక్కువ క్రెడిట్‌ కార్డులే ఉంటున్నాయి. ఇది కూడా మిమ్మల్ని ఖర్చుకు పురిగొల్పే అంశమే. 

అయితే అన్ని క్రెడిట్‌ కార్డులను అదుపు లేకుండా ఉపయోగించుకుంటూ పోయినా రుణభారం పెరిగిపోవడం ఖాయం. అందుకే క్రెడిట్‌ కార్డులను అధికంగా తీసుకోవద్దు. రెండు కార్డుల వరకు మంచిదే. 

అంతకు మించితే ప్రమాదం. మీకు కార్డు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న కార్డు కన్నా అది మెరుగనుకుంటే అందులోని బ్యాలెన్స్‌ కొత్త కార్డులోకి బదిలీ చేయమని కోరి పాత కార్డును రద్దు చేసుకోండి.
 
చాలా మంది యూజర్లు క్రెడిట్‌ కార్డుందని తమ కొనుగోలు శక్తిని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తారు. ఇది కూడా రుణభారం పెరిగిపోవడానికి కారణం. 

ఎటువంటి పరిస్థితుల్లోనైనా క్రెడిట్ కార్డుల వినియోగం విషయమై మీ ఆర్థిక లక్ష్యాలకు అతీతంగా ప్రవర్తించవదని నిపుణుల సూచన. మీరు భరించగల స్థాయిలో లేని వస్తువులు కొనుగోలు చేయడం మొదలుపెడితే మీ ఆర్థిక లక్ష్యాలతో రాజీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 

తప్పనిసరిగా కార్డు వినియోగించి కొనుగోలు చేయాలనుకునే సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో క్రెడిట్‌ కార్డులను ఇంట్లోనే వదిలేయడం మంచిది. కార్డు చేతిలో లేకపోతే దాని ఉపయోగం కూడా తగ్గుతుంది.

ఇంటి దగ్గరే క్రెడిట్ కార్డు వదిలేయడం వల్ల దానిపై చేసే ఖర్చు కూడా అదుపులో ఉంటుంది. మీరు మానసిక భావోద్వేగాలను అదుపులో చేసుకోలేకపోతున్నారని భావించి, మితిమీరి ఖర్చు చేస్తున్నారనుకుంటే ఈ వ్యూహం అనుసరించడం ఉత్తమం.
 
క్రెడిట్ కార్డుపై వ్యయం అదుపులో ఉంచుకోవాలంటే ఏయే కొనుగోళ్లకు కార్డును వినియోగించుకోవాలి, ఏ ఖర్చుల విషయంలో కార్డు ఉపయోగించకూడదనే విభజన రేఖ తయారు చేసుకోవాలి. మీ నెలవారీ వేతనంలో మిగులు సొమ్ముతో కొనుగోలు చేసుకోగలమనే వాటి కోసం కార్డును ఉపయోగించడం మంచిది కాదు. 

స్నాక్స్‌, నెలవారీ వెచ్చాలు, అండర్‌వేర్లు, సాక్స్‌, శిరోజ సంరక్షణ ఉత్పత్తులు, సినిమా టికెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కుల్లో ప్రవేశ టికెట్లు, పిల్లల ఆటబొమ్మలు, వారాంతంలో కుటుంబంతో కలిసి బ ట తీసుకునే ఆహారం వంటివి క్రెడిట్‌ కార్డు ఖర్చుకు దూరంగా ఉంచాలి. ఇవన్నీ చిన్న ఖర్చుల్లాగే కనిపించినా చివరకు భారంగా మారిపోతాయి.
 
కార్డు వ్యయాలను అదుపు చేసుకునేందుకు ప్రాథమికంగా వార్షిక ఫీజు లేని కార్డులను ఎంపిక చేసుకోవడం బెటర్. లేటు ఫీజులు విధించినప్పుడు బ్యాంకుతో మాట్లాడి వాటిని తగ్గించుకునే ప్రయత్నించడం మంచిది. వేతనం పొందే తేదీతో క్రెడిట్‌ కార్డు చెల్లింపులను అనుసంధానం చేయడం మరిచిపోవద్దని చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios