స్కోడా అంటే ఒక బ్రాండ్. ఇది ఒక స్టేటస్ సింబల్. వినియోగదారుల కోసం స్కోడా ఈ సంవత్సరం నాలుగు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. కుషాక్, స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లు, కొత్త సూపర్బ్, ఆక్టేవియా RSలు ఇందులో ఉన్నాయి. వీటి స్పెషాలిటీస్ చూద్దామా?

చెక్ రిపబ్లిక్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్‌ స్కోడా ఈ సంవత్సరం నాలుగు కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు సమాచారం. కుషాక్, స్లావియా మోడల్స్ ఫేస్‌లిఫ్ట్‌లను విడుదల చేయడంతో పాటు నాలుగో తరం సూపర్బ్, ఆక్టేవియా RSలు ఇందులో ఉన్నాయి.

100 పైగా దేశాల్లో స్కోడా కార్ల విక్రయం

1895లో చెక్ రిపబ్లిక్ లోని మ్లాడా బోలెస్లావ్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన స్కోడా కంపెనీ యూరప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మరెన్నో దేశాల్లో కార్లను విక్రయిస్తోంది. 100కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో వాహనాలు ఉత్పత్తి చేస్తుంది.

స్కోడా కంపెనీ భారతదేశంలో 2001లో ప్రవేశించింది. Skoda Auto Volkswagen India Pvt. Ltd. ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పుణె (చాకన్), ఔరంగాబాద్ ఈ రెండు చోట్ల స్కోడా కార్లు అసెంబుల్ చేస్తారు. భారత్‌లో 150+ డీలర్‌షిప్‌లు కలిగి ఉంది. స్కోడా నుంచి రానున్న కార్ల మోడల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 

స్కోడా ఆక్టేవియా RS

ఈ సంవత్సరం దీపావళి సమయంలో 50 లక్షల రూపాయల ధరతో స్పోర్టి స్కోడా ఆక్టేవియా RS విడుదల కానుంది. ఇది 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 265 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6.4 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. కాంట్రాస్టింగ్ రెడ్ స్టిచింగ్, కార్బన్ డెకర్ వంటి స్పోర్ట్స్ సీట్లు, ఇతర కొత్త ఫీచర్లతో ఆక్టేవియా RS త్వరలో మార్కెట్ లోకి రానుంది. 

2025 స్కోడా కుషాక్/స్లావియా

కుషాక్ SUV, స్లావియా సెడాన్ ఈ రెండు మోడల్స్ తిరిగి మార్కెట్ లోకి రానున్నాయి. అయితే వీటి లాంచ్ తేదీ, వివరాలు ఇంకా ప్రకటించలేదు. రెండు మోడళ్లు రాబోయే కొన్ని నెలల్లోనే విడుదల కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు మోడల్స్ అవుట్ సైడ్ పెద్దగా మార్పులు ఉండవని, లోపల మాత్రం కొన్ని మార్పులు ఉంటాయట. కుషాక్‌లో 360 డిగ్రీ కెమెరా, ADAS సూట్, అప్‌డేట్ చేసిన కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉండవచ్చు. రెండు మోడళ్లలో 114bhp, 1.0L టర్బో, 148bhp, 1.5L టర్బో పెట్రోల్ ఇంజిన్లు కొనసాగుతాయి.

కొత్త స్కోడా సూపర్బ్

2025 పండుగ సీజన్‌లో సూపర్బ్ మోడల్ భారత్‌కు వస్తుందని తెలిసింది. టాప్ ఎండ్ L&K వేరియంట్ ధర 54 లక్షల రూపాయలు ఉండవచ్చు. 2.0L టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రావచ్చు. ఈ మోడల్ లో చాలా మార్పులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.