Asianet News TeluguAsianet News Telugu

కరోనా పేషెంట్లకు గుడ్ న్యూస్: నెలాఖరుకల్లా రెమ్‌డెసివిర్‌ ఔషధం రెడీ...

కరోనా ఆందోళనలతో భయపడుతూ బతుకుతున్న ప్రజలు, వైరస్ బాధితులకు ఉపశమనం కలిగించేలా.. పరిశోధనాత్మక ఔషధం రెమ్​డెసివిర్ ఔషధం దేశీయ విపణిలోకి జూన్ నెలాఖరుకల్లా రానుంది. ఇందుకు త్వరలో డీసీజీఐ నుంచి అనుమతులు రానున్నాయి. ఇప్పటికే ఈ ఔషధ తయారీకి అయిదు కంపెనీల సన్నాహాలు చేస్తున్నాయి.

Six Indian companies applied to CDSCO for permission to manufacture, market Remdesivir drug: Health Ministry
Author
Hyderabad, First Published Jun 16, 2020, 12:38 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాధి బాధితులకు కొంత ఊరట కలిగిస్తుందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం ‘రెమ్‌డెసివిర్‌’ ఈ నెలాఖరు నాటికి మనదేశ విపణిలో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఇందుకు అమెరికా బయోఫార్మాస్యూటికల్‌ కంపెనీ- గిలీడ్‌ సైన్సెస్‌కు చెందిన ఈ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతి (ఈయూఏ) ఇచ్చిన విషయం విదితమే. దీనికి ఇంకా తుది అనుమతి రాలేదు.

అయినప్పటికీ ఈ ఔషధాన్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటానికి గిలీడ్‌ సైన్సెస్‌ మనదేశానికి చెందిన కొన్ని జనరిక్‌ ఫార్మా కంపెనీలతో లైసెన్సింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. తొలుత సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌తోను, తదుపరి డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ క్యాడిలాతో గిలీడ్‌ ఒప్పందాలు కుదిరాయి.

దీని ప్రకారం ఈ ఔషధాన్ని తయారు చేసి మనదేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం ఈ కంపెనీలకు లభించింది. ఔషధ తయారీకి ఉపయోగించే టెక్నాలజీ కూడా గిలీడ్‌ నుంచి ఈ కంపెనీలకు బదిలీ అవుతుంది. 


దీంతో రెమ్‌డెసివిర్‌ తయారీ, విక్రయం కోసం ఈ కంపెనీలు మనదేశంలోని డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నాయి. ఇప్పటికే హెటెరో ల్యాబ్స్‌, సిప్లాతో సహా 5 కంపెనీలు చేసిన దరఖాస్తులను డీసీజీఐ పరిశీలిస్తున్నట్లు, త్వరలో తయారీ అనుమతులు రావచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

డీసీజీఐ అనుమతి వచ్చిన వెంటనే తయారీ చేపట్టి నాలుగైదు రోజుల్లోనే మార్కెట్లోకి ఔషధాన్ని విడుదల చేయటానికి ఈ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. నెలాఖరు నాటికి ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తేగలమని అంచనా వేస్తున్నాం- అని హైదరాబాద్‌లోని ఓ అగ్రశ్రేణి ఫార్మా కంపెనీ ప్రతినిధి వివరించారు.

యాంటీ- వైరల్‌ ఔషధమైన ‘రెమ్‌డెసివిర్‌’, కొవిడ్‌- 19 పాజిటివ్‌గా రోగులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పిస్తుందని ప్రయోగ ఫలితాల్లో తేలింది. కరోనా వైరస్‌ ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎంతో త్వరగా విస్తరిస్తుంది. తొలుత ఊపిరితిత్తుల్లోకి, తదుపరి ఉదర భాగంలోకి వెళ్లి స్థిరపడుతుంది. 

దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి ఇతర జబ్బులు దాడి చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాన్ని ఇస్తే...శరీరంలోని ‘వైరస్‌ లోడ్‌’ తగ్గి బాధితుడు త్వరగా కోలుకోవచ్చు. ‘రెమ్‌డెసివిర్‌’ 100 ఎంజీ ఇంజక్షన్‌ పౌడర్‌ను ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది.

also read ‘బాయ్‌కాట్ చైనా’ ప్రచారోద్యమంపై మారుతి, బజాజ్..ఎందుకంటే?

మొదటి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఒక్కో డోసు చొప్పున ఇస్తే ఫలితం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. మనదేశంలో ఐదు రోజుల చికిత్సకు మందు ఖర్చు రూ. 40 వేల వరకూ ఉంటుందని తెలుస్తోంది. కొవిడ్‌- 19 తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న బాధితులకు మాత్రం 10 రోజుల వరకూ ఈ మందుతో చికిత్స చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.

‘ఇన్వెస్టిగేషనల్‌ డ్రగ్‌’ కాబట్టి ఈ మందును రోగిపై తప్పనిసరి అయితేనే వాడాలనే నిబంధన ఉంది. అంతేగాక ఈ మందు ఇచ్చిన తర్వాత రోగి ఏవిధంగా కోలుకున్నాడు, ఎటువంటి ప్రభావం చూపింది... అనే పూర్తి సమాచారాన్ని సేకరించి భద్రపరచాల్సి ఉంటుంది.

‘రెమ్‌డిసివిర్‌’ తయారీకి ఔషధ కంపెనీలు పెట్టుకున్న దరఖాస్తులను డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలోని శాస్త్రవేత్తలు సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు, దీనికి సంబంధించిన కొంత అదనపు సమాచారాన్ని కూడా ఔషధ కంపెనీలను అడిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఔషధాన్ని ప్రభుత్వ ల్యాబ్‌లో కూడా పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నారు. ఎంత డోస్ వాడాలి, దాని ప్రభావం ఏమేరకు ఉంటోంది, సైడ్‌ ఎఫెక్ట్స్‌... ఏమిటి? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. 

‘లాక్‌డౌన్‌’ సడలించిన తర్వాత మనదేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చికిత్స కోసం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. 

ఇప్పటికే ఇతర రకాల వ్యాధులు ఉండి, వయసు మీద పడిన వారికి కొవిడ్‌-19 సోకితే కోలుకోవటం కష్టంగా ఉన్నందున, త్వరగా ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాన్ని అందుబాటులోకి తేవాలనే ఒత్తిడి ఔషధ నియంత్రణ వర్గాలపై పెరుగుతోంది. 

పరిశ్రమ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధం తయారీకి అనుమతి కోరుతూ ఇప్పటి వరకూ హెటెరో ల్యాబ్స్‌, సిప్లా, జుబిలెంట్‌, మైలాన్‌ ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ కంపెనీలు డీసీజీఐకి దరఖాస్తు చేశాయి. ఈ కంపెనీలన్నీ గిలీడ్‌ సైన్సెస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios