న్యూఢిల్లీ: చైనా ఉత్పత్తులను బహిష్కరించాలంటూ దేశవ్యాపంగా డిమాండ్‌తోపాటు పెరిగిన ప్రచారోద్యమంపై ప్రముఖ ఆటో రంగం సంస్థలైన మారుతీ సుజుకీ, బజాజ్ కంపెనీలు పెదవివిరిచాయి. ఈ నిర్ణయాన్ని అములు చేయడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, అంతిమంగా ఇది భారతీయ వినియోగదారులకు నష్టం కలిగిస్తుందని ఈ సంస్థలు అభిప్రాయపడ్డాయి.

‘బాయ్ కాట్ చైనా గూడ్స్’ ప్రచారోద్యమంపై మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ మాట్లాడుతూ భారత్‌లో తయారయ్యే వాహనాలకు చైనా ముడిసరుకులు అవసరమని తెలిపారు. ఓ సంస్థగా మారుతీ చైనా వస్తువులను నేరుగా దిగుమతి చేసుకోకున్నా, సంస్థ సరఫదారులు చైనా వస్తువులపై ఆధారపడతారని చెప్పారు.

చైనా వస్తువులపై సుంకం పెంచితే అది అంతిమంగా భారతీయ వినియోగదారులకు నష్టం చేస్తుందని ఆర్సీ భార్గవ తెలిపారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు ప్రతిగా ‘బాయ్ కాట్ చైనా గూడ్స్’ ప్రచారోద్యమాన్ని ముందుకు తెచ్చారని అభిప్రాయ పడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారతదేశంలో వ్యాపార లావాదేవీలను శాశ్వతంగా మెరుగు పరిచినా ఇప్పటికీ ఎఫ్డీఐ నిధులు రావడం లేదని భార్గవ గుర్తు చేశారు. భారత్ గత 70 ఏళ్లలో ఉత్పాదక రంగంలో ఎఫ్డీఐ నిధులను ఆకర్షించలేకపోయిందని, ప్రభుత్వ విధానాల్లో పోటీతత్వం కొరవడిందని కుండబద్ధలు కొట్టారు. 

also read  కరోనా కాలంలో సైకిళ్లకు ఫుల్ డిమాండ్.. ఉత్పత్తి లేక కొరత ...

మరో ప్రముఖ వాహన రంగ సంస్థ బజాజ్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ద్విచవాహానాల్లో వినియోగించే అలాయ్ వీల్స్‌లో అధిక భాగం చైనా నుంచే దిగుమతి అవుతాయన్నది. దేశీయ సప్లయి చెయిన్‌లో దిగుమతులు కీలక భూమిక పోషిస్తాయని బజాజ్ వ్యాఖ్యానించింది. 

చైనా వస్తువులను నిషేధిస్తే ఆ ప్రభావం తయారీ రంగంపై తీవ్రంగా ఉంటుందని బజాజ్ ఆటో తెలిపింది. ధరలు తక్కువగా ఉండటమే చైనా వస్తువులపై ఆధారపడటానికి కారణమని కూడా స్పష్టం చేసింది. 

సరిహద్దుల్లో ఉద్రిక్తతల పేరిట చైనా వస్తువులపై సుంకాలు విధించడం భారతీయులకే నష్టదాయకం అని బజాజ్ ఆటో వ్యాఖ్యానించింది. ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు నూతన టెక్నాలజీని దేశంలోకి తీసుకు రావడం ఇబ్బందికరంగా మారుతుందని తెలిపింది. 

పార్లమెంటరీ వాణిజ్యశాఖ స్థాయీ సంఘం నివేదిక ప్రకారం భారత పరిశ్రమపై చైనా దిగుమతులు 2019లో 50 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 2.5 బిలియన్ డాలర్లు పెరిగాయి. చైనాతో వాణిజ్యంలో భారత్ మొత్తం వాణిజ్య లోటు 40 శాతం పై మాటే.