ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకుని రికార్డులు నెలకొల్పాయి. క్రూడాయిల్ ధరల పతనం, తొలి త్రైమాసిక ఫలితాలపై పాజిటివ్ అంచనాలతో సెన్సెక్స్ జనవరి 29వ తేదీ నుంచి ఐదు నెలల తర్వాత కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ప్రపంచంలో ఆరో అతి పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదిగిందన్న వార్తలతో కూడా మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. సెన్సెక్స్ 282.48 పాయింట్ల లాభంతో 36,548. 41 వద్ద ముగిసింది. కాగా, నిఫ్టీ 11,000 స్థాయిని అధిగమించి 74.90 పాయింట్ల లాభంతో 11,023.20 వద్ద ముగిసింది. ఒకదశలో 11,078.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని కూడా తాకింది. రిలయన్స్ 4.42 శాతం పెరిగి వంద బిలయన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా అవతరించింది.

బుల్లిష్‌గా ఉన్నా అప్రమత్తంగా ఉండాలి


కానీ వచ్చే 6-12 నెలల కాలానికి బుల్లిష్‌గా ఉన్నామార్కెట్ విశ్లేషకులు మాత్రం ఇన్వెస్టర్లు, ట్రేడర్లు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదని చెబుతున్నారు. పరస్పర విరుద్ధ ఆర్థిక డేటా నేపథ్యంలో కార్పోరేట్ రాబడులు, క్రూడాయిల్ ధరలు, రూపాయి మారకం విలువ, తర్వలో జరుగబోయే రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్ దిశను సమీప భవిష్యత్‌లో నిర్దేశిస్తాయని డీహెచ్‌ఎఫ్‌ఎల్ ఫార్మేసియా మ్యూచువల్ ఫండ్‌ ప్రతినిధి రాజేష్ అయ్యర్ అన్నారు. 

వీటితో మార్కెట్లు ఇలా ప్రభావితం


చమురు ధరలు, రూపాయి మారకం విలువ, మొండి బకాయి సమస్య, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కేంద్రంలో రాజకీయ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కార్పోరేట్ రాబడులు మార్కెట్‌ను ప్రభావితం చేయనున్నాయని కార్వీ స్టాక్ బ్రోకింగ్ విశ్లేషించింది.

ఇలా ఇండెక్స్‌ల నష్టాల పర్వం


మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లతోపాటు మెటల్, ఆటో, రియల్టీ, ఐటీ ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిసాయి. బ్యాంక్ నిఫ్టీ 0.78 శాతం మేర లాభపడింది. మార్కెట్ గరిష్ఠ స్థాయిలో ముగిసినప్పటికీ ఎన్‌ఎస్‌ఈలో నష్టపోయిన షేర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. మొత్తం 1,026 షేర్లు నష్టపోతే 756 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిసాయి. బుధవారం కొనుగోళ్లు జరిపిన ఎఫ్‌ఐఐలు మళ్లీ నికరంగా అమ్మకాలకు దిగారు. రూ. 742.63 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. డీఐఐలు రూ.366.40 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

10 షేర్లకు మాత్రమే లాభాల పంట ఇలా..


సెన్సెక్స్ గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నా, గత జనవరిలో వచ్చిన గరిష్ఠ స్థాయిలతో పోలిస్తే సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 10 షేర్లు మాత్రమే పోల్చితే లాభాలను ఇచ్చాయి. మిగిలిన 20 షేర్లు 17-37 శాతం మేర నష్టపోయాయి. లాభాలను ఇచ్చిన వాటిలో టీసీఎస్, కోటక్ బ్యాంక్‌ 24 శాతం, హెచ్‌యుఎల్ 23 శాతం, ఎంఅండ్‌ఎం 22 శాతం, ఏషియన్ పెయింట్స్ 18 శాతం, ఇన్ఫోసిస్ 12 శాతం, ఇండస్ బ్యాంక్ 10 శాతం, రిలయన్స్ 8 శాతం, హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్ 7 శాతం, యెస్ బ్యాంక్ 4 శాతం చొప్పున రాబడిని ఇచ్చాయి. నష్టపోయిన వాటిలో వేదాంత, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ ఉన్నాయి.

నిఫ్టీలో షూటింగ్ స్టార్ క్యాండిల్ ప్యాట్రన్


నిఫ్టీ 11,078 పాయింట్లను తాకిన తర్వాత వచ్చిన లాభాల స్వీకరణతో గరిష్ఠ స్థాయి నుంచి 55 పాయింట్ల నష్టంతో షూటింగ్ స్టార్ క్యాండిల్ ప్యాట్రన్ ఏర్పడింది. సాధారణంగా ఈ ప్యాట్రన్‌ను ట్రెండ్ రివర్సల్‌కు సంకేతంగా భావిస్తారని యాక్సిస్ సెక్యూరిటీస్‌కు చెందిన రాజేష్ పాల్వియా చెప్పారు. గురువారం నాటి కనీస స్థాయికి దిగువన క్లోజ్ అయితే షూటింగ్ స్టార్ ప్యాట్రన్‌కు ధృవీకరణ లభిస్తుంది. ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టీ 10,980 స్థాయికి ఎగువన నిలదొక్కుకోవాలని పాల్వియా తెలిపారు. ఒకవేళ 11,000స్థాయికి దిగువన ముగిస్తే 10,920 వరకూ కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా టెక్నికల్ ఇండికేటర్లు ఓవర్‌బాట్ పొజిషన్‌లోకి వచ్చినందున మార్కెట్ పెరిగేందుకు అవకాశాలు పరిమితంగా ఉన్నాయని యోస్ సెక్యూరిటీస్ సాంకేతిక విశ్లేషకులు ఆదిత్యా అగర్వాల్ తెలిపారు. గరిష్ఠ స్థాయిల్లో లాభాల స్వీకరణకు అవకాశం ఉన్నట్లు చెప్పారు.

11 ఏళ్లకు మళ్లీ వంద బిలియన్ డాలర్ల కంపెనీ రిలయన్స్


మళ్లీ 11 ఏళ్ల తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రికార్డును తానే తిరగరాసింది. వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. షేరు ధర 4.42 శాతం లాభపడి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ. 1099.8కి చేరుకోవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,88,51 3.11 కోట్లకు (100.3 బిలియన్ డాలర్లు) చేరుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి లాభాల స్వీకరణతో మార్కెట్ క్యాప్ వంద బిలియన్ డాలర్ల దిగువకు పతనం అయింది. 2007, అక్టోబర్ 18న రిలయన్స్ ఇండస్ట్రీస్ తొలిసారిగా వంద బిలియన్ డాలర్ల మార్కెట్‌క్యాప్ కంపెనీగా అవతరించింది. ఆ తర్వాత వచ్చిన కరెక్షన్‌తో మార్కెట్ క్యాప్ కూడా తగ్గింది. దాదాపు 11 ఏండ్ల తర్వాత మళ్లీ వంద బిలియన్ మార్కెట్ క్యాప్ మార్క్‌ను చేరుకుంది. టీసీఎస్ గత ఏప్రిల్‌లోనే వంద బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీగా ఎదిగింది.