ఉక్రెయిన్ - రష్యా సంక్షోభం నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో భారీ కరెక్షన్ చోటు చేసుకుంది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు నష్టపోయింది. అలాగే నిఫ్టీ కూడా 200 పాయింట్లకుపైగా నష్టాల్లో కొనసాగుతోంది. మెటల్ స్టాక్స్ మాత్రం లాభాలను అందిస్తున్నాయి.
ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంతో ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల బాట పట్టాయి. అటు యూఎస్, యూరప్ మార్కెట్ల ట్రెండ్ తో అటు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఇక దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే బుధవారం భారత స్టాక్ మార్కెట్ మరోసారి బలహీనంగా ప్రారంభమైంది. సెన్సెక్స్, నిఫ్టీలు భారీ పతనంతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గ్లోబల్ ఫ్యాక్టర్ ఒత్తిడితో ఇన్వెస్టర్లు మరోసారి అమ్మకాలు ప్రారంభించారు.
మార్కెట్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్ 600 పాయింట్లు పడిపోయింది. ప్రారంభ సెషన్‌లో సెన్సెక్స్ 618 పాయింట్లు నష్టపోయి 55,629.30 వద్ద, నిఫ్టీ 21 పాయింట్ల పతనంతో 16,593.10 వద్ద ప్రారంభమయ్యాయి. ఉదయం 9.24 గంటలకు సెన్సెక్స్ 613 పాయింట్ల పతనంతో 55,700 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 144 పాయింట్ల నష్టంతో 16,650 వద్ద ట్రేడవుతోంది. ఉదయం 10.35 గంటలకు సెన్సెక్స్ 1.60 శాతం తగ్గి ఏకంగా 900 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా సరిగ్గా అదే సమయంలో దాదాపు 210 పాయింట్లు నష్టపోయింది.
ఈ స్టాక్స్‌పై ఇన్వెస్టర్ల కన్ను
ఇక సెక్టార్ల వారీగా చూస్తే ఈరోజు మార్కెట్‌లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. బ్యాంక్, ఆటో రంగ షేర్లలో క్షీణత నెలకొనగా, మెటల్ షేర్లు ఈరోజు లాభాల్లో ట్రేడవుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీని కారణంగా పెట్టుబడిదారులు మెటల్ రంగానికి చెందిన స్టాక్‌లపై బెట్టింగ్‌లు కాస్తున్నారని నిపుణులు అంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 3 శాతం పతనం చెందాయి.
టాప్ గెయినర్స్ విషయానికి వస్తే
Hindalco Indus 6.81 %, Coal India +5.96 %,Tata Steel +5.47 %, ONGC +3.52 %, UPL +3.19 % లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ ఇవే..
ICICI Bank -3.96 %, Maruti Suzuki India -3.69 %, HDFC Bank -3.68 %, Bajaj Auto -3.62 %, Asian Paints -3.45 % నష్టపోయాయి.
అటు ప్రపంచ మార్కెట్ల విషయానికి వస్తే, ప్రధానంగా ఆసియా మార్కెట్లు కూడా బలహీనంగా ప్రారంభమయ్యాయి ఆసియా ప్రధాన స్టాక్ మార్కెట్లలో బుధవారం ట్రేడింగ్ పతనంతో ప్రారంభమైంది. సింగపూర్ ఎక్స్ఛేంజ్ 0.78 శాతం, జపాన్ నిక్కీ సైతం 1.73 శాతం క్షీణించింది. తైవాన్‌లో ట్రేడింగ్ కూడా 0.32 శాతం నష్టంతో ప్రారంభమైంది. దక్షిణ కొరియా మార్కెట్ మాత్రమే 0.06 శాతం పెరిగింది.
