Asianet News TeluguAsianet News Telugu

ఎస్బీఐ ఫెస్టివల్ ఆఫర్: వడ్డీరేట్లు తగ్గింపు.. నేటి నుంచి అమలు

అన్ని రకాల కాల పరిమితి రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రుణాలు తీసుకొనే వారికి ఇది ఒక రకంగా శుభవార్తే.

SBI cuts FD rates twice in 15 days. Latest fixed deposit rates here
Author
Mumbai, First Published Sep 10, 2019, 1:30 PM IST

ముంబై: అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు పండుగ బొనాంజాను అందిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే పండుగ సీజన్‌లో నగదు సరఫరాను పెంచే ఉద్దేశంలో భాగంగా అన్ని రకాల కాల పరిమితి రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇలా వడ్డీరేట్లను తగ్గించడం ఇది ఐదోసారి కావడం విశేషం. ఇప్పటి వరకు 40 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించినట్లు అయింది. ఈ నూతన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. 

ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై విధిస్తున్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు 8.25 శాతం నుంచి 8.15 శాతానికి తగ్గనున్నది. బ్యాంకింగ్ రంగంలో ఇదే తక్కువ స్థాయి వడ్డీ కావడం విశేషం. ఇప్పటికే అన్ని రకాల రుణాలను రెపో రేటుకు లింక్ చేసిన బ్యాంక్..డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేట్లలో కూడా కోత విధించింది.

టర్మ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్.. బల్క్ డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్ల నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇవి కూడా మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో 5 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్..మే, జూలై నెలలో ఇంతే స్థాయిలో కోత విధించింది. ఆ తర్వాతి నెల ఆగస్టులో ఏకంగా 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 

దీంతో రుణరేటు 8.25 శాతానికి తగ్గింది. తాజాగా మరో పది బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రేటు 8.15 శాతానికి తగ్గినట్లు అయింది. బ్యాంకింగ్ రంగంలో ఇదే తక్కువ స్థాయి వడ్డీ. ఎస్బీఐకి పోటీగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 8.30 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. 

అదే ఐసీఐసీఐ బ్యాంక్ 8.35 శాతం ఇస్తున్నది. ఈ రెండు బ్యాంకులు గడిచిన రెండు వారాల్లో తమ వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్లు తగ్గించాయి.

మరోవైపు ఫిక్స్ డ్ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 20 నుంచి 25 బేసిక్ పాయింట్లు, బల్క్ డిపాజిట్లపై 10 నుంచి 20 బేసిక్ పాయింట్ల మేర తగ్గించి వేసింది. ఈ వడ్డీరేట్లు కూడా మంగళవారం నుంచి అమలులోకి వస్తాయి. 

దీంతో ఏడాది నుంచి రెండేళ్ల గడువు గల డిపాజిట్లపై 6.70 శాతంగా ఉన్న వడ్డీరేటు 6.50 శాతానికి తగ్గింది. కాగా, డిపాజిట్లపై ఎస్బీఐ వడ్డీరేట్లు తగ్గిచడం 15 రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. చివరిసారిగా ఎస్బీఐ గత నెల 26వ తేదీన 10 నుంచి 50 బేసిక్ పాయింట్ల మేరకు వడ్డీరేట్లు తగ్గించి వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios