Asianet News TeluguAsianet News Telugu

నరేశ్‌జీ!!ఇక చాలు తప్పుకోండి: జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌కు ఎస్బీఐ

జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని ప్రమోటర్ నరేశ్ గోయల్ తోపాటు మరో ముగ్గురిని ఎస్బీఐ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాజమాన్యం ఆధ్వర్యంలో సంస్థ నిర్వహణ అసాధ్యమని, వ్రుత్తి నిపుణులకు అప్పగించడం బెటరని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన భేటీలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. అబుదాబీ ఎయిర్ లైన్స్ ‘ఎతిహాద్’ కూడా నరేశ్ గోయల్ చైర్మన్‌గా కొనసాగితే తాము వైదొలుగుతామని ఎస్బీఐకి తేల్చి చెప్పింది.
 

SBI asks Goyal, 3 others to step down from Jet board
Author
Hyderabad, First Published Mar 21, 2019, 2:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ చేతులు మారడం ఖాయమని తేలిపోయింది. ప్రస్తుత యాజమాన్యాన్ని మార్చి, వృత్తి నిపుణుల చేతికి అప్పగించి జెట్‌ ఎయిర్‌వేస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వం ముందు ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకర్లు ప్రతిపాదించినట్లు సమాచారం.

పాతికేళ్ల చరిత్ర కలిగిన పూర్తిస్థాయి సేవల విమానయాన సంస్థ నిలిచిపోవడం ప్రయాణికులకు, విమానయాన రంగానికి మంచిది కాదన్నది స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్ల అభిప్రాయం.

ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో జరిగిన సమావేశంలోనూ ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు కథనం. జెట్‌ ఎయిర్వేస్ పునరుద్ధరణకు బ్యాంకర్లు ఐదు నెలలుగా చర్చించి, రూపొందించిన ప్రణాళికను వెల్లడించేందుకు ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్ కుమార్ నిరాకరించారు. 

‘జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాలు రాకపోకలు సాగించాలన్నదే మా లక్ష్యం. ఏ ఒక్క ప్రమోటర్‌ లేదా మరో వ్యక్తికో ఉద్దీపన ఇవ్వలేం’ అని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్ కుమార్ పేర్కొన్నారు. విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తప్పనిసరిగా జెట్‌ యాజమాన్యాన్ని మార్చాల్సిందేనని బ్యాంకర్లు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాజమాన్యంతో, కంపెనీని నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వానికి బ్యాంకర్లు వివరించారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌కు 119 విమానాలు ఉండగా, అందులో మూడోవంతు అంటే 41 విమానాలు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. లీజ్‌ చెల్లించకపోవడంతో మిగిలిన విమానాలను సంబంధిత యాజమాన్యాలు నిలిపి వేశాయి. విమానాల ఆకస్మిక రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

చివరి నిమిషంలో విమానాలు రద్దవుతుండటంతో అధిక ధర పెట్టి మరో విమానానికి టికెట్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి ప్రయాణికులకు ఏర్పడు తోంది. ఎన్నికల వేళ జెట్‌ సమస్య ముదురుతుండడంతో అప్రతిష్టను దూరం చేసుకొనే ప్రయత్నంలో భాగంగానే మోడీ సర్కార్ ఈ దిశగా చర్యలు ప్రారంభించిందని విశ్లేషకులు చెబుతున్నారు.  

రుణాలు, వడ్డీలతోపాటు పైలట్లు-ఇతర సిబ్బందికి వేతనాలు కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ బకాయి పడిన నేపథ్యంలో, సంస్థ పునరుద్ధరణ ఎలా జరగాలనే అంశంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో బుధవారం మధ్యాహ్నం ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌, విమానయాన కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలా, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రా సమావేశమయ్యారు.

గతంలో దేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ మూతపడితే, ప్రభుత్వంపైనా ప్రభావం పడుతుంది. అందువల్ల సంస్థలో జరిగే పరిణామాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వివరించినట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీశ్‌ కుమార్ తెలిపారు. జెట్‌కు ఉద్దీపన పథకంపై చర్చించలేదని పేర్కొన్నారు.

అయితే భారీమొత్తంలో రుణాలిచ్చిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో పాటు ప్రయాణికులకు కూడా జెట్‌ ఎయిర్‌వేస్‌ కార్యకలాపాలు సాగించడం మేలు చేస్తుందని మంత్రి అరుణ్ జైట్లీకి రజనీశ్ కుమార్ వివరించారు. దివాలా స్మృతి కింద ఆ సంస్థపై చర్యలు ప్రారంభించడం చివరి అస్త్రమని పేర్కొన్నారు. 

‘విమానయానం వంటి సేవా రంగాల్లో దివాలా స్మృతి అమలు చేయడం దాదాపు సాధ్యం కాదు. ఒకవేళ అదే జరిగితే, విమానాలు నిలిపి వేయడమే అవుతుంది. అది మా లక్ష్యం కాదు. చివరి నిమిషం వరకు సంస్థ పునరుద్ధరణకే ప్రయత్నిస్తాం’అని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అన్నారు. తన వాటా 24 శాతాన్ని కొనుగోలు చేసుకోమని ఎస్‌బీఐని ఎతిహాద్‌ కోరిందని, అందువల్ల సంస్థలోకి కొత్త భాగస్వామిని తీసుకొచ్చే ప్రతిపాదనపై స్పందిస్తూ ‘ఏ అవకాశాన్ని కొట్టి పారేయలేం’ అని రజనీశ్‌ తెలిపారు.

‘ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌తో చర్చలు కొనసాగుతున్నాయి. వారు బయటకు వెళ్లే విషయంలో తుది నిర్ణయం జరగలేదు. ఎతిహాద్‌ కోరుతున్న కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. ఎవరి జోక్యం లేకుండా పూర్తిస్థాయి వృత్తి నిపుణులే నిర్వహించాలన్నది వారి ఆకాంక్ష’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్‌ కుమార్ తెలిపారు.

ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ సంస్థకు రూ.8200 కోట్ల రుణాలు ఉండగా, ఈ నెలాఖరుకు తీర్చాల్సిన బకాయిలు రూ.1700 కోట్లు. సంస్థ మూతబడితే ఉద్యోగులు కొలువులు కోల్పోయి  23వేల  కుటుంబాలు రోడ్డున పడతాయి. సంక్షోభానికి కారణమైన జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్ నరేశ్ గోయల్ కుటుంబానికి సంస్థలో 51% వాటా ఉంది. 

ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి ఇబ్బందులను ఎదుర్కొంటున్న జెట్‌ ఎయిర్‌వేస్‌కు మరో సరికొత్త సమస్య వచ్చిపడింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ను నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యారణను తయారు చేస్తున్న వేళ.. ఆ సంస్థకు తాజాగా పైలట్లు షాక్‌నిచ్చారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి సమ్మె బాట పట్టనున్నట్టుగా ప్రకటించారు. 

తమకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర బకాయిల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా జీతాలు చెల్లించకుంటే విమానాలు పైకి ఎగరవని, తమ సేవలు నిలిపివేస్తామని పైలట్లు జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యాన్ని హెచ్చ రించారు. 

కంపెనీ దేశీయ పైలట్లతో కూడిన నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌లో మంగళవారం విస్తృతంగా చర్చించిన అనంతరం వారు ఈ ప్రకటన చేశారు. సంస్థను చక్కదిద్దే ప్రణాళికపై స్పష్టత రాకున్నా, వేతన చెల్లింపులపై పరిష్కారం లభించకపోయినా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తాము విధులకు హాజరుకాబోమని పైలట్స్ గిల్డ్‌ స్పష్టం చేసింది. 

వేతనాలపై యాజమాన్యం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఏవియేటర్స్‌ గిల్డ్‌ గతవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌కు లేఖ రాసింది. మరోవైపు జెట్‌ ఇంజినీర్ల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఇదే విషయమై పౌర విమానయాన డైరెక్ట రేట్‌ జనరల్‌ (డీజీసీఏ)కు లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios