Asianet News TeluguAsianet News Telugu

రూ.5000 కోట్లకు గుజరాతీ సందీశర శఠగోపం.. ఆపై నైజిరియా పరారీ


సర్కారీ పెద్దలతో అనుబంధం పెంచుకోవడంతోపాటు, బ్యాంకర్లను ఆకర్షించి రూ.5000 కోట్ల మేరకు రుణాలు పొంది, షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి, అక్కడ పెట్టుబడులు పెట్టిన కుటుంబం సందీశర నితిన్‌ది. తర్వాత కుటుంబంతో కలిసి నైజిరియాకు చెక్కేసిందా ఫ్యామిలీ.

Sandesara probe: UPA government officials, bankers under lens
Author
New Delhi, First Published Oct 13, 2018, 10:49 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు పెట్టుకుని, బ్యాంకు అధికారులను ఆకట్టుకుని వేల కోట్ల రూపాయలు రుణాలు పొందడం.. తర్వాత విదేశాలకు చెక్కేయడం మోసగాళ్లకు అలవాటుగా మారింది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర జిల్లాలో ఏర్పాటు చేసిన స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ అధినేత సందీశర కుటుంబం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ కుటుంబంపై 2012లోనే ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ముద్ర వేసింది. 

విదేశాల నుంచి 80 మిలియన్ల డాలర్ల (రూ.589 కోట్ల) రుణం పొంది ఎగవేతకు పాల్పడిన కుటుంబం సందీశర అని అధికార వర్గాల కథనం. ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ఆర్బీఐ ముద్ర వేసిన తర్వాత కూడా ప్రభుత్వాధికారుల మద్దతు, సహకారం లేకుండా బ్యాంకుల నుంచి డబ్బు పొందడం అసాధ్యమని సమాచారం. 

స్టెర్లింగ్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ సందీశరను రూ.5000 కోట్ల అవకతవకల కేసులో ప్రస్తుతం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించాయి.ఈ విషయం ముందే పసిగట్టిన సందీశర కుటుంబం నైజిరియాకు పారిపోయింది. అక్కడ ముడి చమురు ఉత్పత్తిపై పెట్టుబడులు పెడుతోంది సందీశర కుటుంబం. 

సందీశర కుటుంబంపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అంతా రంగం సిద్ధం చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఎ) కింద తొలిసారి కేసు నమోదు కానున్న కుటుంబం అదే. భారతదేశంలో ఏర్పాటు చేసిన గుల్ల కంపెనీల సాయంతో బ్యాంకులు, ఆర్తిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలను విదేశాలకు సందీశర కుటుంబం చేరవేసిందని సమాచారం. అంతేకాదు సందీశర కుటుంబం తన ఆస్తులను అమ్మి రుణాలు సెటిల్ చేయాలని భావిస్తున్నట్లు ఈడీ అధికారులకు ఉప్పందింది. 

సందీశర నితిన్, ఆయన కుటుంబం, సోదరుడు చేతన్, అల్లుడు దీప్తిబెన్ సందీశర తదితరులు నైజిరియాలోనే నివసిస్తున్నారని దర్యాప్తు సంస్థలకు సమాచారం అందింది. నైజిరియాతో భారతదేశానికి నేరస్తుల అప్పగింత ఒప్పందం ఏదీ లేదు. దీన్ని అడ్డం పెట్టుకుని దేశాన్ని, బ్యాంకులనూ కష్టాల్లోకి నెట్టేసింది సందీశర కుటుంబం. గతేడాది అక్టోబర్ 27వ తేదీన నితీన్, చేతన్ సందీశరలపై పీఎంఎల్ఏ చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేసింది. అంతకుముందు రూ.5000 కోట్ల కుంభకోణం విషయమై సందీశర కుటుంబ సభ్యులపై రెండేళ్ల క్రితం సీబీఐ చార్జిషీట్ నమోదు చేసింది. 

2004 నుంచి 2012 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సందీశర కుటుంబం వివిధ బ్యాంకుల నుంచి రూ.5000 కోట్ల రుణాలు పొందింది. అయితే రూ.4700 కోట్ల విలువైన సందీశర కుటుంబ ఆస్తులను సదరు బ్యాంకుల వద్ద అటాచ్ చేయడం ఒక్కటే దర్యాప్తు సంస్థలు సాధించిన ఘనత. సందీశర కుటుంబంతోపాటు ఆర్థిక లావాదేవీలతో భాగస్వాములయ్యారని భావిస్తున్న చార్టర్డ్ అక్కౌంటెంట్ హేమంత్ హథి, ఆంద్రా బ్యాంక్ మాజీ డైరెక్టర్ అనూప్ గార్గ్, రాజ్ భూషణ్ దీక్షిత్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. వీరందరిపైనా సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ల ప్రకారం రూ.5,383 కోట్ల మేరకు సందీశర కుటుంబ గ్రూప్ ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios