Asianet News TeluguAsianet News Telugu

రూపాయి @ 70కి పైపైనే: డాలర్ కట్టడికి దారేది?

అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం.. అటుపై పెరుగుతున్న ముడి చమురు ధరలకు తోడు విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐ) నిష్క్రమణతో రూపాయి బక్కచిక్కుతోంది. 

Rupee may hit 70/Dollar mark this week, say bankers

ముంబై: విదేశీ పోర్ట్‌పోలియో పెట్టుబడుల (ఎఫ్‌పీఐ) రాకలో మరింత జాప్యం జరిగితే మాత్రం డిసెంబర్ నాటికి డాలర్‌పై రూపాయి మారకం విలువ 70 దాటుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరైల్ లించ్ (బీఓఎఫ్ఎఎంఎల్) సహా పలు బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. కాకపోతే రూపాయి మరింత పతనం కాకుండా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) జోక్యం చేసుకుని ఎన్నారై బాండ్లు జారీ చేసే అవకాశం ఉన్నదని కూడా బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధర, విదేశీ పెట్టుబడుల కొరతతో బలపడుతున్న డాలర్ విలువతో రూపాయి విలువ ఒత్తిడికి గురవుతున్నది. ఈ వారం రూపాయి విలువ డాలర్‌పై 70 దాటే అవకాశం ఉన్నదని బ్యాంకర్లు పేర్కొన్నారు.

రూపాయి పతనమైతే ఆర్బీఐ ఇప్పటికిప్పుడేం చేయలేదా?


అదే జరిగితే మాత్రం మరింతగా రూపాయిని రక్షించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) చర్యలు తీసుకునే పరిస్థితుల్లో ఉండదని అంటున్నారు. బ్యాంకర్ల కథనం ప్రకారం ప్రస్తుతం రూపాయి విలువ 69.30 వద్ద ఎంతో కీలకమని పేర్కొంటున్నారు. గత నెల 28వ తేదీన రూపాయి విలువ 69.10కి పతనమై తర్వాత గత గురువారం 68.95 వంటి అతి తక్కువ విలువ వద్ద ముగిసింది. ఒకవేళ రూపాయి విలువ 70 దాటితే మాత్రం  ఆర్బీఐ 30-35 బిలియన్ డాలర్ల సమీకరణకు ప్రవాస భారతీయుల బాండ్లను ప్రవేశపెట్టవచ్చునని తెలిపింది. రూపాయి విలువ పతనం కావడానికి తోడు ముడి చమురు ధరలతో కరంట్ ఖాతా లోటు (సీఏడీ) మరింత పెరిగితే విదేశీ వాణిజ్యానికి పలు ఇబ్బందులు ఏర్పడతాయని బ్యాంకర్లు అంటున్నారు.

రూపాయి పతనం నివారణకు 35 బిలియన్ల మేర ఎన్నారై బాండ్ల సేకరణ


డిసెంబర్ త్రైమాసికంలో కూడా ఎఫ్‌పీఐ పెట్టుబడులు తిరిగి రాకపోతే 30 నుంచి 35 బిలియన్ల డాలర్ల వరకు ఎన్‌ఆర్‌ఐ బాండ్ల ద్వారా వచ్చే విదేశీ కరెన్సీ డిపాజిట్లతో కరెన్సీ మార్కెట్‌లో కాస్త వెసులుబాటు కల్పించవచ్చునని మెరిల్‌లించ్ తెలిపింది. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడుల తరలివెళ్లడం వల్ల ఆర్బీఐ దాదాపు 20 బిలియన్ డాలర్లను విక్రయించవచ్చుననీ, అలానే ఓపెన్ మార్కెట్ కార్యకలాపాల ద్వారా మరో 50 బిలియన్ డాలర్లను అమ్మే అవకాశం ఉందని మెరిల్‌లించ్ అంచనా వేసింది. ఏ రకంగా చూసినా రూపాయి మారకం విలువ రూ.72 తాకవచ్చని బార్‌క్లేస్ అంచనా వేసింది. 2019 ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, ఆర్బీఐ స్పష్టమైన విధానాలను ప్రకటించలేకపోవడం వంటి అంశాలు రూపాయి మారకం విలువపై ప్రభావం చూపిస్తాయని బార్‌క్లేస్ అభిప్రాయ పడింది.

అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంతో రూపాయికే భారీగా నష్టం


అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో అసియా దేశాల కరెన్సీలు నష్టపోతున్నాయి. ఆసియా కరెన్సీల్లో రూపాయి విలువ గరిష్ఠంగానే నష్టపోయింది. వాణిజ్య సుంకాల పోరులో దేశీయ మార్కెట్‌లోకి వచ్చే విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు కూడా బాగా తగ్గిపోయాయనీ, గతనెలలో పోర్టుఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ కూడా ఎక్కువగా జరిగిందని బ్యాంకర్ ఒకరు తెలిపారు. దీనికి తోడు ఆర్బీఐ పాలసీ రేట్లను పెంచినప్పుడల్లా రూపాయి విలువ పతనం అవుతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ విశ్లేషించింది. గత నెలలో జరిగిన పరపతి విధాన సమీక్షలో రెపోరేటును పెంచినప్పటి నుంచి రూపాయి మారకం విలువ 1.8 శాతం మేర నష్టపోయింది. గత నెల రోజుల్లో 200 కోట్ల డాలర్ల విదేశీ పోర్టుఫోలియో పెట్టుబడులు తరలివెళ్లాయని మెరిల్‌లించ్ తన నివేదికలో హెచ్చరించింది.

ఈ వారం రూపాయి @ 70 పక్కా!


ఏ రకంగా చూసినా ఈ వారంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.70 అధిగమించే అవకాశాలు ఉన్నాయి. రూ.70 పైన నిలదొక్కుకోవడం అంత సులువు కాదని సీనియర్ బ్యాంకింగ్ అధికారి ఒకరు అన్నారు. విదేశీ వాణిజ్య రుణాలు (ఈసీబీ) తీసుకున్న కంపెనీలు డాలర్లలో రుణాలను డాలర్లలో చెల్లించాల్సి ఉన్నందున డాలర్లను దాచుకుంటున్నాయని ప్రముఖ బ్యాంక్ ట్రెజరర్ ఒకరు తెలిపారు. రూపాయి మారకం విలువపై ఆర్బీఐ ఎలాంటి లక్ష్యాలను ప్రకటించకున్నా ఒడిదుడుకులను అరికట్టేందుకు డాలర్లను విక్రయిస్తుంది. గతనెల 29 నాటికి విదేశీ కరెన్సీ రిజర్వు నిల్వలు 406.058 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అయినా రూపాయి విలువను 69.30కి మించి పడిపోకుండా ఆర్బీఐ శతవిధాల ప్రయత్నిస్తుందని కరెన్సీ మార్కెట్ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios