రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర పరిమాణామాలు భారత కరెన్సీ రూపాయి పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు డాలర్ మారకంతో రూపాయి దారుణంగా క్షీణించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర పరిమాణామాలు భారత కరెన్సీ రూపాయి పైన తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నేడు డాలర్ మారకంతో రూపాయి దారుణంగా క్షీణించింది. 2022 క్యాలెండర్ ఏడాదిలోనే 3.5 శాతం క్షీణించింది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి నేడు ఓ సమయంలో 77.02 వద్ద ట్రేడ్ అయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడుతోంది. అలాగే, విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్తున్నాయి. మరోవైపు, రష్యా రూబుల్ సహా వివిధ దేశాల కరెన్సీలు డాలర్ మారకంతో పతనమవుతున్నాయి.

నేడు (సోమవారం, మార్చి 7) డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 76.94 వద్ద ప్రారంభమైంది. ఓ సమయంలో 77ను కూడా దాటింది. ఈ రోజు దాదాపు 1 శాతం మేర నష్టపోయిన రూపాయి డాలర్ మారకంతో పోలిస్తే 77.02 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆల్ టైమ్ కనిష్టం 76.90. ఈ రోజు దీనిని కూడా అధిగమించింది.

చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో దిగుమతుల బిల్లు గణనీయంగా పెరగనుంది. దీంతో విదేశీ మారకపు నిల్వలు తగ్గుతున్నాయి. ఇది రూపాయి వ్యాల్యూపై ప్రభావం చూపుతోంది. దీంతో ఆసియాలోనే అత్యంత అద్వాన్న పని తీరును కనబరుస్తున్న కరెన్సీగా రూపాయి ఉంది. రూపాయి వ్యాల్యూ పడిపోతే దిగుమతి వ్యయాలు పెరిగి, ఇది భారంగా మారుతుంది. మన దిగుమతుల్లో చమురు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంటుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరిగి, అన్ని రంగాలు, అన్ని ఉత్పత్తులపై ప్రభావం చూపుతుంది. ఆహార ధరల పైన కూడా ప్రభావం ఉంటుంది. విదేశీ చదువులు, ప్రయాణాలు పెరుగుతాయి.