Ruchi Soya FPO ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా యోగా గురువు రాందేవ్ బాబా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.  అసలైన యోగా ధర్మంతో పాటు పారిశ్రామిక ధర్మంలో ముందుకు సాగుతున్నామని, జాతీయ హితానికి ప్రాధాన్యతనిస్తూ రుచి సోయా ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, స్వదేశీ ఉత్పత్తులను అందించడం కొనసాగిస్తామని Ruchi Soya FPO బాబా రామ్‌దేవ్ అన్నారు. 

Ruchi Soya FPO: బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా ఎఫ్‌పిఓ ఈ నెలలో తెరవనున్నారు. ఈమేరకు బాబా రాందేవ్ FPOకు సంబంధించిన పలు అప్ డేట్స్ మీడియాతో పంచుకున్నారు. కంపెనీ ఎఫ్‌పిఓ ధరను ఒక్కో షేరుకు రూ.615-650గా నిర్ణయించింది. కంపెనీ రూ.4300 కోట్ల FPO ద్వారా సేకరించనుంది. ఈ FPO మార్చి 24న ప్రారంభమై మార్చి 28న ముగుస్తుంది.

ఇదిలా ఉంటే FPO ప్రైస్ బ్యాండ్ నిర్ణయించగానే, సోమవారం ఈ స్టాక్ ఏకంగా 19 శాతం భారీ క్షీణతను నమోదు చేసింది. ఈరోజు ఉదయం రుచి సోయా షేరు రూ.845 స్థాయి వద్ద ప్రారంభమై రూ.805 స్థాయికి జారుకుంది. గత వారం రూ.1004.35 స్థాయి వద్ద ముగిసింది. అంటే నేడు 19 శాతానికి పైగా క్షీణత నమోదైంది.

మధ్యాహ్నం 2.50 గంటలకు షేరు 10 శాతం పతనంతో రూ.904 స్థాయిలో ట్రేడవుతోంది. FPO కోసం ధర బ్యాండ్‌ను నిర్ణయించిన తర్వాత ఈ క్షీణత కనిపించింది. ఈరోజు వరుసగా మూడో రోజు కూడా ఈ స్టాక్‌పై ఒత్తిడిని గమనించవచ్చు. నిజానికి మార్చి 15న ఈ షేరు రూ.1144 స్థాయిని తాకింది. మార్చి 15న ఈ స్టాక్ 13.18 శాతం, మార్చి 14న 20 శాతం భారీ పెరుగుదలను నమోదు చేసింది. కానీ FPO ప్రైస్ బ్యాండ్ కారణంగా, ఈ స్టాక్‌లో భారీ అమ్మకాలు కనిపిస్తున్నాయి.

రుచి సోయా ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వివరాలు పేర్కొంటూ, ఎఫ్‌పిఓ కోసం ఒక్కో షేరుకు ఫ్లోర్ ధర రూ.615 , రూ.650 క్యాప్ ధరను తమ ఇష్యూ కమిటీ ఆమోదించినట్లు తెలిపింది. కనిష్టంగా 21 షేర్ల లాట్ (minimum bid lot) తీసుకోవాల్సి ఉంటుది. ఎడిబుల్ ఆయిల్ కంపెనీ రుచి సోయా గత ఏడాది ఆగస్టులో ఎఫ్‌పిఓ తీసుకురావడానికి క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబి ఆమోదం పొందింది.

ఈ ఫండ్ ఎలా ఉపయోగిస్తారు..
రుచి సోయా జూన్ 2021లో రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ముసాయిదాను దాఖలు చేసింది. DRHP ప్రకారం, రుచి సోయా ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిర్దిష్ట బకాయి ఉన్న రుణాన్ని చెల్లించడానికి, దాని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, ఇతర సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలను తీర్చడానికి ఉపయోగిస్తుంది. 2019 సంవత్సరంలో, పతంజలి 4,350 కోట్ల రూపాయలకు దివాలా ప్రక్రియ ద్వారా రుచి సోయాను కొనుగోలు చేసింది. ప్రస్తుతం కంపెనీ ప్రమోటర్ల వద్ద దాదాపు 99 శాతం వాటా ఉంది. ఈ రౌండ్ FPOలో కంపెనీ కనీసం తొమ్మిది శాతం వాటాను విక్రయించనుంది. 

కనీసం 25% వాటా పబ్లిక్‌గా ఉండాలి
సెబీ నిబంధనల ప్రకారం కంపెనీలో కనీసం 25 శాతం పబ్లిక్‌ వాటా ఉండాలి. ప్రమోటర్లు తమ వాటాను 75 శాతానికి తగ్గించుకోవడానికి దాదాపు మూడేళ్ల సమయం ఉంది. కంపెనీ ప్రమోటర్లు ప్రస్తుతం కంపెనీలో 99 శాతం వాటాను కలిగి ఉన్నారు. ఈ FPOలో కంపెనీ దాదాపు 9 శాతం వాటాను విక్రయించబోతోంది.

పతంజలి ఆయుర్వేద్ దివాలా తీసిన కంపెనీ రుచి సోయాను కొనుగోలు చేసిన అనంతరం , 27 జనవరి 2020న రుచి సోయా షేర్ మళ్లీ లిస్ట్ అయ్యింది. కంపెనీ రుణానికి సంబంధించి ఆచార్య బాలకృష్ణ వ్యక్తిగత హామీ ఇచ్చారు. రుచి సోయాను పతంజలి కొనుగోలు చేసినప్పుడు ఈ రుణాన్ని బ్యాంకుల నుండి తీసుకున్నారు.